జాతీయోద్యమ వజ్రాలు

ABN , First Publish Date - 2022-08-15T09:03:51+05:30 IST

మా నాన్న గుంటూరు సుబ్బారావు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు మంచి స్నేహితుడు. బోస్‌ పెట్టిన ‘ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ’లోనూ ఆయన చాలా కాలం పని చేశారు.

జాతీయోద్యమ వజ్రాలు

తెలుగు నాట స్వాతంత్ర్యోద్యమంలో గుత్తా, గోరా 

కుటుంబాల పాత్ర విశిష్టమైనది. ఒకవైపు మహాత్ముడి 

పిలుపుతో అహింసా మార్గాన్ని అనుసరిస్తూనే... 

మరోవైపు నాస్తికోద్యమానికి నాయకత్వం వహించిన ఘనత ఆ రెండు కుటుంబాలది. జాతీయోద్యమానికి సమాంతరంగా కుల నిర్మూలనోద్యమంలోనూ వాళ్ల పాత్ర ప్రత్యేకం. ఆంగ్లేయుల పాలన వద్దంటూ ఆనాడు వీధుల్లోకి వచ్చి గళమెత్తిన గుత్తా, గోరా కుటుంబాలకు చెందిన స్వాతంత్య్ర ధీరల స్మృతులు... 75ఏళ్ల భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా వారి మాటల్లోనే... మా కుటుంబమంతా గళమెత్తింది 

- గుత్తా జవహరీబాయి (99) 


మా నాన్న గుంటూరు సుబ్బారావు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు మంచి స్నేహితుడు. బోస్‌ పెట్టిన ‘ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ’లోనూ ఆయన చాలా కాలం పని చేశారు. మా నాన్నకు... శరత్‌చంద్రబోస్‌కు మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగేవి. మా నాన్న అప్పుడప్పుడూ కలకత్తాలోని నేతాజీ ఇంటికి వెళ్లొస్తుండేవారు కూడా. మా రెండో చెల్లి పుట్టినప్పుడు ‘మళ్లీ అమ్మాయే పుట్టింద’ని నేతాజీతో నాన్న అంటే... ‘ఆడపిల్లలే కన్నవాళ్లను కంటికి రెప్పలా కాపాడతారు. కనుక నీవు దిగులుపడకు’ అని నవ్వారట. నా భర్త గుత్తా సుబ్రహ్మణ్యం కుటుంబానిదీ స్వాతంత్ర్యోద్యమంలో ప్రత్యేక స్థానం. పుట్టిల్లు, మెట్టినిల్లు ప్రేరణతో నేనూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాను. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ, బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాను. ర్యాలీలు నిర్వహించాను. గోపరాజు రామచంద్రరావు, ఆచార్య ఎన్జీ రంగా, పుచ్చలపల్లి సుందరయ్య తదితర జాతీయోద్యమ నాయకుల రాకపోకలతో గుత్తావారిపాలెంలోని మా ఇల్లు కళకళలాడుతుండేది. గాంధీ పిలుపుతో నాతో సహా, మా కుటుంబమంతా క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాం. అప్పుడే మా బావలు (భర్త సోదరులు) రామానుజయ్య, రాఘవయ్య, చలమయ్య, నా పెద్ద తోడికోడలు సుందరమ్మ, ఆడపడుచు రాజారత్నం... బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించినందుకు  జైలు పాలయ్యారు. సుందరమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతూ రాయవేలూరు కారాగారంలోనే కన్నుమూసింది. అలా ఒకరా, ఇద్దరా మా కుటుంబమంతా త్యాగధనులే! ఆ జ్ఞాపకాలు ఇప్పుడు తలుచుకుంటే మనసంతా భారంగా ఉంటుంది. మరోవైపు గర్వంగా అనిపిస్తుంది. కులనిర్మూలన పోరాటాన్ని మా గుత్తావారి కుటుంబం ముందుండి నడిచింది. ఎనభై ఏళ్ల కిందట ఒక అమావాస్య రోజున మా ఊరి దళితవాడలో గుత్తా సుబ్రహ్మణ్యం, నేనూ దండలు మార్చుకోవడంతో ఒక్కటయ్యాం. మేమిద్దరం కలిసి అనేక పోరాటాల్లో పనిచేశాం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా, ఇంకా మన దేశాన్ని కులం, మూఢనమ్మకాలు పట్టి పీడించడం బాధగా ఉంది. మనుషుల మధ్య అంతరాలను పోగొట్టేందుకు మరో పోరాటం ఇప్పుడు అవసరమనిపిస్తోంది.

Read more