ప్రియమైన హరికి... బాధగా.. భయంగా..

ABN , First Publish Date - 2022-08-25T06:25:24+05:30 IST

కస్తూరిబా.. గాంధీ మహాత్ముడి భార్యగా మనందరికీ తెలుసు. కానీ దారితప్పిన తన కుమారుడు హీరాలాల్‌ కోసం ఆమె ఆవేదన చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

ప్రియమైన హరికి... బాధగా.. భయంగా..

స్తూరిబా.. గాంధీ మహాత్ముడి భార్యగా మనందరికీ తెలుసు. కానీ దారితప్పిన తన కుమారుడు హీరాలాల్‌ కోసం ఆమె ఆవేదన చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇటీవల గాంధీ మునిమనవడు తుషార్‌గాంధీ- ఇప్పటిదాకా ప్రచురితం కాని  కస్తూరిబాకు సంబంధించిన కొన్ని ఉత్తరాలతో - ‘ది లాస్ట్‌ డైరీ ఆఫ్‌ కస్తూరి, మై బా’ అనే ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకంలోని ఒక ఆసక్తికరమైన భాగం మీ కోసం..


‘‘బాపూతో పాటు కస్తూరిబా జబల్‌పూర్‌ మెయిల్‌లో ప్రయాణిస్తున్నారు. కటానీ జంక్షన్‌లో బాపూను చూడటానికి కొన్ని వేలమంది గుమిగూడారు. ‘మహాత్మా గాంధీకి జై’ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. కస్తూరిబాకు సమీపంలోకి ఒక వ్యక్తి వచ్చి- ‘మాతా కస్తూరిబా కి జై’ అని అరవటం మొదలుపెట్టాడు. అతనే హరిలాల్‌. మహాత్ముడి కుమారుడు. కస్తూరిబా దగ్గరకు వచ్చి ఒక నారింజ పండును ఇచ్చాడు. గాంధీజీ ‘‘నాకు బహుమతి తేలేదా?’’ అని అడిగారు. హరి కోపంతో - ‘‘అమ్మా! ఈ పండు నీకోసమే పట్టుకొచ్చా. నువ్వు మాత్రమే తింటానని నాకు ప్రమాణం చేయి’’ అన్నాడు. గాంధీజీ వైపు తిరిగి- ‘‘మా అమ్మ చేసిన త్యాగాల వల్ల మాత్రమే నువ్వు గొప్పవాడివయ్యావనే విషయాన్ని గుర్తుపెట్టుకో!’’ అన్నాడు. ‘‘నేను ఆ విషయాన్ని ఎప్పుడో గుర్తించాను.


అందరికీ చెప్పాను కూడా! నువ్వు మా దగ్గరకి వచ్చేయవచ్చు కదా! మాతో పాటు ఉండు’’ అన్నారు గాంధీజీ. ఆ మాటలు పూర్తయ్యే లోపు రైలు కదిలింది. గుమిగూడిన జనాలు హరిని తోసేశారు. ‘‘మాతా కస్తూరిబా కి జై’’ అని హరి అరుస్తుంటే రైలు వేగం పుంజుకుంది. రైలులో ఉన్న కస్తూరిబా దుఖాఃనికి అంతులేదు. ఆ సంఘటన జరిగిన కొద్ది కాలానికి హరి... ఇస్లాంలోకి మారిపోయాడు. తన పేరును అబ్దుల్లా గాంధీగా మార్చుకున్నాడు. గాంధీజీని కూడా ఇస్లాంలోకి మారిపొమ్మంటూ ఒక బహిరంగ లేఖ రాశాడు. ఆ తర్వాతి కాలంలో హరి మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. ఈ విషయాలన్నీ పత్రికల్లో రావటం మొదలుపెట్టాయి. వీటని చూసి తీవ్రమైన దుఃఖంతో కస్తూరిబా తన కుమారుడికి ఒక ఉత్తరం రాసింది..  


‘‘ప్రియమైన హరిలాల్‌..

మద్రాసులో ఒక రోజు రాత్రి నువ్వు బాగా తాగి, సృహ తప్పి పడిపోతే... నిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పత్రికల్లో చదివాను. ఆ మర్నాడు మేజిస్ట్రేట్‌ నీకు ఒక రూపాయి జరిమానా విధించి వదిలేశారని తెలిసింది. నిన్ను అంత తక్కువ శిక్షతో వదిలేసిన ఆ మేజిస్ట్రేట్‌ చాలా మంచివాడై ఉండాలి.. నీకు ఏం చెప్పాలో నాకు అర్ధం కావటం లేదు. జాగ్రత్తగా ఉండమని.. వ్యసనాలకు లోనుకావద్దని అనేకసార్లు నీకు చెబుతూనే ఉన్నా! వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లితండ్రులకు నీవల్ల ఎంత బాధ కలుగుతోందో ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు మా పట్ల ఒక శత్రువుగా ప్రవర్తిస్తున్నావు. ఈ మధ్యకాలంలో నాన్నను తిడుతున్నావనీ, విమర్శిస్తున్నావనీ విన్నాను. మీ నాన్నను తిట్టడం ద్వారా నీవు మరింత దిగజారుతున్నావు. నీ పట్ల మీ నాన్నకు ప్రేమ మాత్రమే ఉంది. మా దగ్గరకు రమ్మని నిన్ను ఆయన చాలాసార్లు పిలిచారు. కానీ నువ్వు ఎప్పుడూ ఆయన మాట వినలేదు. ఆయనకు ఆ ప్రపంచానికి సంబంధించిన అనేక బాధ్యతలు ఉన్నాయి. ఆయన నీకు ఎలాంటి సాయం చేయలేరు. తన దురదృష్టానికి బాధపడుతూ.. అవమానాలను భరిస్తూ ఆయన జీవిస్తున్నారు. నువ్వు నాకు కలిగిస్తున్న మానసిక క్షోభను తట్టుకోలేకపోతున్నా... ఉదయాన్నే లేచిన వెంటనే ఏ వార్త వినాల్సి వస్తుందో అనే భయంతో బతుకుతున్నా! 


నువ్వు ఏం చేస్తున్నావో.. ఎక్కడ పడుకున్నావో... ఏం తిన్నావో తెలియక బాధ పడుతూ ఉంటా! నువ్వు నాకు పుట్టిన మొదటి బిడ్డవు! నీకు 50 ఏళ్లు వచ్చాయి. కొన్నిసార్లు నాకు నిన్ను కలవాలని ఉంటుంది. కానీ నన్ను ఎక్కడ అవమానిస్తావో? అనే భయం వెంటాడుతూ ఉంటుంది...’’

 (‘ది లాస్ట్‌ డైరీ ఆఫ్‌ కస్తూరి, మై బా’.. 

రచయిత: తుషార్‌ గాంధీ  ప్రచురణ: 

హార్పర్‌ కాలిన్స్‌)‘‘మాతా కస్తూరిబా కి జై’’ అని హరి 
అరుస్తుంటే రైలు వేగం పుంజుకుంది. రైలులో ఉన్న కస్తూరిబా దుఖాఃనికి అంతులేదు. 

Read more