వనాన్ని సృష్టించింది... తన పేరు లిఖించింది

ABN , First Publish Date - 2022-12-01T00:51:00+05:30 IST

రెండేళ్ళ కిందట మొక్కయినా కనిపించని ఆ చోటు... ఇప్పుడు చూడచక్కని వనం. ఈ అద్భుతాన్ని ఒక సాధారణమైన దినసరి కూలీ సరోజినీ మహంతి సాధ్యం చేశారు.

వనాన్ని సృష్టించింది... తన పేరు లిఖించింది

రెండేళ్ళ కిందట మొక్కయినా కనిపించని ఆ చోటు... ఇప్పుడు చూడచక్కని వనం. ఈ అద్భుతాన్ని ఒక సాధారణమైన దినసరి కూలీ సరోజినీ మహంతి సాధ్యం చేశారు. సరోజిని అంకితభావం, మొక్కవోని సంకల్పం... ఆ వనానికి ఆమె పేరును శాశ్వతం చేశాయి.

ఒడిశా రాష్ట్రం సుందర్‌గఢ్‌ జిల్లాలోని బొనాయ్‌... మైనింగ్‌ వల్ల ప్రభావితమైన అటవీ ప్రాంతం. మైన్స్‌లోకి పనివాళ్ళు, వాహనాలు రాకపోకలు సాగించడం కోసం అడవుల నరికివేత పెద్ద ఎత్తున సాగింది. పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో అడవిని మళ్ళీ పెంచాలని బొనాయ్‌ అటవీ డివిజన్‌ అధికారులు నిర్ణయించారు. ఈ అటవీ డివిజన్‌ పరిధి దాదాపు మూడు వేల చదరపు కిలోమీటర్లు. అనువుగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటించి, వాటి కాపలా కోసం స్థానికులను వాచర్లుగా నియమించారు. వారిలో సరోజినీ మహంతి ఒకరు.

నలభై రెండేళ్ళ సరోజినిది బొనాయ్‌ పరిధిలోని ఉల్సురేయ్‌ గ్రామం. ఆమె భర్త, కొడుకు, కోడలు... అందరూ వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు. స్థానిక వన సంరక్షణ సమితిలో సరోజిని సభ్యురాలు. వాచర్లను నియమిస్తున్నారని తెలుసుకున్న ఆమె ... తమ గ్రామానికి సమీపంలో ఉన్న కొంత భాగం బాధ్యతలు తనకు ఇవ్వాలని కోరారు. మొదట్లో అధికారులు సంకోచించారు. వాచర్లు రాత్రి పూట కూడా పని చేయాల్సి ఉంటుంది. చుట్టూ ఇనుప వైర్‌ ఫెన్సింగ్‌ను ఎన్నిసార్లు ఏర్పాటు చేసినా... దుండగులు కత్తిరించుకుపోతున్నారు. అలాగే పశువులు కూడా చొరబడి, మొక్కల్ని తినేస్తూ ఉంటాయి. కాబట్టి రాత్రివేళ నిఘా తప్పనిసరి. మహిళలకు అది కష్టమవుతుందనేది వారి భావన. ‘‘కానీ ఆ విధులు నేను నిర్వహించగలననీ, నేను కాపలా కాయాల్సిన చోటు మా ఇంటికి దగ్గరేననీ చెప్పాను. చివరకు వాళ్ళు ఒప్పుకున్నారు’’ అని గుర్తుచేసుకున్నారు సరోజిని. అలా 315 రూపాయల రోజు కూలీకి ఆ పనిలో చేరారు.

ఆ భూమిలో అక్కడక్కడ మొక్కలున్నా... చాలావరకూ ఎండిపోయిన బంజరు నేల. దాన్ని కాపలా కాస్తే చాలని సరోజిని అనుకోలేదు. అక్కడ పచ్చదనం నింపాలనుకున్నారు. అందుకోసం దాదాపు అయిదు ఎకరాల నేలను ఎంపిక చేసుకున్నారు. మామిడి, పనస, ఉసిరి, జామ... ఇలా రకరకాల మొక్కలు నాటడం మొదలెట్టారు.

అదే లోకంగా...

అయితే వాటి పెంపకం అంత సులువుగా జరగలేదు. అంతకుముందు ఆ డివిజన్‌లోని అటవీ ప్రాంతాల్లో నాటిన మొక్కల్లో కనీసం యాభై శాతం కూడా ఎదగలేదు. మట్టి తత్వం ఒక కారణమైతే... తగిన మెళకువలు పాటించకపోవడం మరో కారణం. ఈ విషయాలన్నిటి మీదా సరోజినికి కాస్త అవగాహన ఉంది. అటవీ సిబ్బంది సూచనలు కూడా తీసుకున్నారు. గోతుల్ని తవ్వి మొక్కలు నాటడం నుంచి వర్మీ కంపోస్ట్‌ తయారు చేయడం, ఎరువులు, యూరియా వెయ్యడం, అవసరమైనంత నీరు తెచ్చి పొయ్యడం, కలుపు మొక్కలు తొలగించడం ... ఇలా ప్రతి పనీ స్వయంగా చేశారు. చుట్టూ ఉన్న గ్రామాల నుంచి వచ్చే పశువులు ఫెన్సింగ్‌ దాటి, మొక్కల్ని తినెయ్యకుండా కాపలా కాశారు. రెండేళ్ళపాటు ఆ పనే ఆమె లోకమైపోయింది. అయితే ‘‘ఇందులో నేను కష్టపడిందేం లేదు. మొక్కలు నాటడం, వాటిని పెంచడం అంటే నాకు చిన్నప్పటి నుంచీ ఇష్టమే. ఆ భూమిని పర్యవేక్షించే బాధ్యత నాకు దొరకడం సంతోషంగా అనిపించింది. నేను నాటిన ఒక్కొక్క మొక్కా పెరుగుతున్నప్పుడు... నా బిడ్డలు పెరుగుతున్నంత ఆనందం కలుగుతుంది’’ అంటారు సరోజిని.

‘‘ఇలా జరుగుతుందా’’ అనిపించింది...

రెండేళ్ళ కిందట వర్షాకాలంలో ఆమె నాటిన మొక్కలు బాగా ఎదిగాయి. వాటిలో దాదాపు 99 శాతం బతకడం, కొన్ని చెట్లు 15 అడుగుల ఎత్తు పెరగడం చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. దాదాపు మూడువేల చెట్లతో ఇప్పుడు కళకళలాడుతున్న ఆ తోటకి... ‘సరోజినీ వనం’ అని పేరు పెట్టారు. ఆ మేరకు బోర్డులు ఏర్పాటు చేశారు. ‘‘సరోజిని కృషి స్ఫూర్తిమంతం. అది మరింతమందికి నిస్సందేహంగా ప్రేరణ కలిగిస్తుంది. అటవీ డివిజన్‌లోని ఇతర బంజరు నేలల్లో ఇటువంటి అభివృద్ధి చేసినవారి పేర్లను ఆ వనాలకు పెట్టాలని నిర్ణయించాం’’ అని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ సరోజిని తన వనంలో కొత్త మొక్కలు నాటుతూనే ఉన్నారు. వాటికి చీడపీడలు సోకకుండా ఆరోగ్యంగా ఎదగడానికి చేయగలిగిందల్లా చేస్తున్నారు. ‘‘ఈ వనానికి నా పేరు పెడుతున్నామని అధికారులు చెప్పినప్పుడు... నా నోట మాట రాలేదు. ఇలాంటిది ఎక్కడైనా జరుగుతుందా అనిపించింది.తమ ప్రాంతాల్లోనూ ఇలా చేస్తామంటూ నా సలహాలు తీసుకోడానికి దూర గ్రామాల నుంచీ చాలామంది వస్తున్నారు. నాకు తెలిసిన విషయాలనూ, అనుభవాలనూ వివరిస్తున్నాను. వారందరికీ చివరిగా నేను చెబుతున్న మాట ఒక్కటే... ‘‘మొక్కల్ని ప్రేమించండి. మీ పిల్లల్లా సాకండి’’ అని’’ అంటున్నారు సరోజిని.

Updated Date - 2022-12-01T20:10:59+05:30 IST