Chinmai Tammareddy : కౌన్సెలింగ్‌తో... జీవితాల్లో వెలుగులు నింపుతూ

ABN , First Publish Date - 2022-12-03T00:08:57+05:30 IST

బలీయమైన సేవాతత్వంతో నిస్వార్ధంగా జీవితాన్ని సేవకే అంకింతం చేసేవాళ్లు ఎంతో అరుదు. టీనేజీ వయసులో మొదలుపెట్టిన తన సేవాకార్యక్రమాల పరంపరను

Chinmai Tammareddy : కౌన్సెలింగ్‌తో... జీవితాల్లో వెలుగులు నింపుతూ

బలీయమైన సేవాతత్వంతో నిస్వార్ధంగా జీవితాన్ని సేవకే అంకింతం చేసేవాళ్లు ఎంతో అరుదు. టీనేజీ వయసులో మొదలుపెట్టిన తన సేవాకార్యక్రమాల పరంపరను నేటికీ కొనసాగిస్తూ, ఎంతోమంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు హైదరాబాద్‌కు చెందిన సైకాలజిస్ట్‌, మోటివేషనల్‌ స్పీకర్‌ చిన్మయి తమ్మారెడ్డి. ఆవిడ నవ్యతో పంచుకున్న విశేషాలు...

పదిహేడవ ఏట నుంచే సేవాకార్యక్రమాలు మొదలుపెట్టాను. మురికివాడలకు వెళ్లి, ఆరోగ్యపరంగా వారు పాటించవలసిన జాగ్రత్తలు, స్వయం స్వావలంబనల గురించి వాళ్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చేదాన్ని. కాలేజీలో ఉన్నప్పుడు స్నేహితులను వెంట పెట్టుకుని వీలున్నన్ని చోట్ల, వీలైనంత మందికి కౌన్సెలింగ్‌ ఇస్తూ ఉండేదాన్ని. అలాగే హైదరాబాద్‌ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి కౌన్సెల్‌ చేస్తూ ఉండేవాళ్లం. సామాజిక సేవాభావాలున్న వ్యక్తిని కాబట్టి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ నాకు తగిన చదువు అది కాదని నిర్ణయించుకుని, బిఎ సైకాలజీ పూర్తి చేశాను. తర్వాత ఆన్‌లైన్‌లో యుఎస్‌ యూనివర్శిటీల నుంచి ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌, లైఫ్‌ కోచింగ్‌ డిప్లొమాలు పూర్తి చేశాను. బాల్యం నుంచే నాది హ్యాపీ మైండ్‌సెట్‌. ఏ ఇబ్బంది వచ్చినా, తిరిగి ఆ హ్యాపీనెస్‌ దశకు చేరుకోవడం నాకు అలవాటు. అలాగే నాకు చీకటి, ఒంటరితనం అంటే భయం కూడా ఉండదు. ఈ గుణాలన్నీ స్వతహాగా నాకు అలవడినవే! వీటిని ఇతరుల జీవితాలను గాడిలో పెట్టడం కోసమే ప్రకృతి నాలాంటి వాళ్లను డిజైన్‌ చేసుకుందేమో అనిపిస్తుంది. అలా ఎన్నో వేల కుటుంబాలను నిలబెట్టాను. నా సేవకు ఆటంకం ఏర్పడకూడదనే ఉద్దేశంతో పెళ్లి కూడా మానుకున్నాను. ఈ విషయంలో కుటుంబ తోడ్పాటు కూడా ఉంది.

స్కూళ్లకు వెళ్లి...

కౌన్సెలింగ్‌ అవసరం ఎంతో మందికి ఉంటుంది. కానీ అందరికీ అంతటి ఆర్థిక స్థోమత ఉండకపోవచ్చు. కాబట్టే అలాంటి ఎంతోమందికి ఉచితంగా సేవలందిస్తూ ఉంటాను. వృత్తిపరంగా వన్‌ టు వన్‌ కౌన్సెలింగ్‌ చేయడంతో పాటు గ్రూప్‌ మోటివేషన్‌ క్లాసెస్‌ చేపడుతూ ఉంటాను. అలాగే సెలబ్రిటీలకు కూడా కౌన్సెలింగ్‌ చేశాను. షి టీమ్స్‌ ‘భరోసా’ కోసం ఈవ్‌ టీజర్లకు కౌన్సెలింగ్‌ సెషన్లు ఇస్తూ ఉంటాను. జీవితం పట్ల విజన్‌ను ఎలా ఏర్పరుచుకోవాలో, మనం చేసే పనులు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, స్వీయనియంత్రణ ఎలా సాధించవచ్చో వివరించి వాళ్లలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి, అవసరం మేరకు పిల్లలకు మోటివేషనల్‌ క్లాసెస్‌ చేపడుతూ ఉంటాను. పాఠశాల విద్యలో ఉన్న పిల్లలు తల్లితండ్రుల మాటలను పెడచెవిన పెడుతూ, ఆకర్షణలకు లోనవుతూ ఉంటారు. పరిస్థితులకు తగ్గట్టు జీవితాన్ని ఎలా డిజైన్‌ చేసుకోవాలో, సెల్ఫ్‌ ఎఫిషియెంట్‌గా ఎలా ఎదగాలో వివరిస్తూ ఉంటాను. అలాగే పెళ్లి చేసుకోబోయే జంటలకు మ్యారేజ్‌ కౌన్సెలింగ్‌, పిల్లలను కనబోయే వారికి చైల్డ్‌ ప్రిపరేషన్‌, పిల్లల పెంపకంలో చైల్డ్‌ ప్రోగ్రామింగ్‌, ఎదిగిన పిల్లలకు చైల్డ్‌ రీప్రోగ్రామింగ్‌, మహిళలకు విమెన్‌ ఎంపవర్‌మెంట్‌, అలాగే యువతకు బ్రేక్‌త్రూ ప్రోగ్రామ్స్‌, అలాగే మేజర్‌ అండ్‌ మైనర్‌ కౌన్సెలింగ్‌లు చేస్తూ ఉంటాను.

స్వీయ విలువ తెలుసుకోవాలి

నేడు సమాజంలో రేప్‌ ధోరణి పెరిగిపోతోంది. అలాగే ప్రేమ పేరుతో దగ్గరై హత్యకు ఒడిగట్టే ఉదంతాలను కూడా చూస్తున్నాం. ఈ ధోరణిలో మార్పు తీసుకురావడం నా లక్ష్యంగా పెట్టుకున్నాను. తాజా శ్రద్ధా వాకర్‌ దుర్ఘటనను గమనిస్తే, తన పార్ట్‌నర్‌ ఆఫ్తాబ్‌ తిట్లు, దెబ్బలను బలవంతంగా భరిస్తూ అతని ప్రేమను పొందడం కోసం అతనితోనే ఉండిపోయి, చివరకు ప్రాణాలు పోగొట్టుకుంది. నిజానికి అలాంటి ట్రామా బాండింగ్‌లో ఇరుక్కుపోయి బాధలను భరిస్తూ ఉండే ఆడవాళ్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరూ మొదట తమను తాము ప్రేమించుకోవడం మొదలుపెట్టాలి. స్వీయ విలువను తెలుసుకోవాలి. ఎప్పుడైతే లివిన్‌ పార్ట్‌నర్‌ తనను చిన్నచూపు చూడడం, అవమానించడం చేశాడో ఆ ధోరణికి అక్కడే ఫుల్‌స్టాప్‌ పెట్టేయాలి. ఓర్చుకుని సర్దుకుపోవాలనే మైండ్‌సెట్‌ను మార్చుకోవాలి. దూషణలు దెబ్బలకు దారితీసేలోపే అప్రమత్తమై జాగ్రత్తపడాలి. అలాగే పిల్లలు పక్కదారి పట్టడానికి కారణాలు తల్లితండ్రుల్లోనూ ఉంటాయి. పెంపక లోపాలకు ఆస్కారం లేనప్పుడు పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారు. కాబట్టి పిల్లల పెంపకం ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రేమాప్యాయతలతో సాగాలి. రేప్‌ సంస్కృతికి అడ్డుకట్ట పడేలా, శ్రద్ధా వాకర్‌ లాంటి దుర్ఘటనలు కొనసాగకుండా ఉండేలా యువతకు కౌన్సెలింగ్‌ చేపడుతున్నాను. మున్ముందు కూడా మరింత చురుగ్గా సమాజసేవను కొనసాగిస్తాను.

సెలబ్రిటీలకు సైతం

హిందీ నటి మనీషా కొయిరాలా తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. కేన్సర్‌ బారిన పడి కోలుకున్నారు. తెలిసిన వాళ్ల ద్వారా ఆవిడ నన్ను సంప్రతించారు. ఆవిడకు నేను కౌన్సెలింగ్‌ ఇచ్చాను. అలాగే నటి హేమమాలిని కూతుళ్లకూ కౌన్సెలింగ్‌ అందించాను. బాల్యంలో తండ్రి ప్రేమను పూర్తిగా పొందలేని ఈషా మాదకద్రవ్యాలకూ, మద్యానికీ బానిసై పెళ్లయ్యాక కుటుంబ గొడవలతో ఇబ్బందులను ఎదుర్కొంది. ఆ సమయంలో ఆవిడకు కౌన్సెలింగ్‌ ఇచ్చాను. అలాగే హీరో జగపతి బాబు, సురేఖ వాణి పిల్లలకు కూడా కౌన్సెలింగ్‌ ఇచ్చాను.

నాన్నది కృష్ణా జిల్లా, అమ్మది తూర్పు గోదావరి జిల్లా. నాన్న అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలో పరిశోధకులుగా పని చేశారు. వృత్తిరీత్యా నాన్నకు తరచూ బదిలీలు జరుగుతూ ఉండేవి. అలా నిజామాబాద్‌ జిల్లాలోని రుద్రూరులో ఉన్నప్పుడు, నేను పుట్టాను. తర్వాత నిజామాబాద్‌, కరీంనగర్‌లలో పెరిగి, అంతిమంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. సినీ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ నాకు పెద్ద నాన్న అవుతారు. మా అన్నయ్య, తమ్ముడు యుగంధర్‌ తమ్మారెడ్డి, పృధ్వి తమ్మారెడ్డి కూడా సినీ పరిశ్రమలోనే స్థిరపడ్డారు.

గోగుమళ్ల కవిత

Updated Date - 2022-12-03T00:08:58+05:30 IST