చప్పట్లు కొట్టే చేతులే పోరాటాల పిడికిళ్లు

ABN , First Publish Date - 2022-09-28T06:09:32+05:30 IST

‘బతుకమ్మ... ప్రకృతితో ముడిపడి ఉన్న శ్రామికుల పండుగ.

చప్పట్లు కొట్టే చేతులే పోరాటాల పిడికిళ్లు

తుకమ్మ... ప్రకృతితో ముడిపడి ఉన్న శ్రామికుల పండుగ. కుల మతాలకు అతీతంగా... అంతా కలిసి ఆడకుంటే ఇది రాష్ట్ర పండుగ ఎలా అవుతుంది?’ అని ప్రశ్నిస్తున్నారు ప్రజా గాయని విమలక్క. సామాజిక అసమానతలను నిరసిస్తూ... 


ఈ ఏడాది ‘కుల నిర్మూలన బహుజన బతుకమ్మ’ను ఆమె నెత్తికెత్తుకున్నారు.  ‘బతుకమ్మ ఒక ఉత్సవం కాదు, ప్రజా సంస్కృతిని నిలబెట్టే సాంస్కృతికోద్యమం’ అంటున్న విమలక్క...  తమ తొమ్మిది రోజుల ‘బహుజన బతుకమ్మ’ కార్యాచరణ గురించి ‘నవ్య’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.


ఈ ఏడాది కుల నిర్మూలనోద్యమ స్ఫూర్తితో ‘బహుజన బతుకమ్మ’ను నిర్వహిస్తున్నాం. 75 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో... ఊరు, వాడ విడివిడిగా ఉంటే భారతీయత ఎక్కడ ఉంటుందని బతుకమ్మ పాటలతో ప్రశ్నిస్తున్నాం. ‘మూడు రంగుల జెండా కింద నాలుగు వర్ణాల నస ఏందం’టూ నిలదీస్తున్నాం. బడికాడ, గుడికాడ తేడాలెరుగని భవితను ఆకాంక్షిస్తున్నాం. అందుకే శ్రమజీవులంతా కలిసి బహుజన బతుకమ్మను ఆడుకుందామని పిలుపునిచ్చాం. కుల, మతాలకు అతీతంగా ఊరంతా కలిసి సహపంక్తి భోజనాలు చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం. దీనికి ఆంరఽధ, రాయలసీమ ప్రాంతాల నుంచి మంచి స్పందన లభించడం సంతోషం. 


పర్యావరణ పరిరక్షణ పండుగ...

నా చిన్నతనంలో... బతుకమ్మ పండుగ అంటే, మా ఊరులోని చేను, చెలకల దగ్గరకు పోయి వారం వరకు నిల్వ ఉండే గునుగు, అడవి చామంతి, ముత్యాల పువ్వులు, అప్పటికప్పుడు అయితే... తంగెడు, గుమ్మడి, రుద్రాక్ష పువ్వులు సేకరించేవాళ్ళం. అలా వారం పాటు పిల్లలమంతా బొడ్డెమ్మలను, పెద్దలు బతుకమ్మలను పేర్చి రోజూ సాయంత్రం ఆడేటోళ్ళం. బాగా మగ్గిన బ్రహ్మజెముడు కాయలతో రంగులద్దేవాళ్లం. ఈ పూల పండుగ ప్రకృతి వనరులను సంరక్షించుకొనే పండుగ కూడా. కాబట్టి నేల సారాన్ని, నీటి స్వచ్ఛతను కాపాడుకోవడం కూడా బతుకమ్మ పండుగలో భాగమే! 


బాట బతుకమ్మతో మొదలు...

పదిహేనేళ్ల కిందట తెలంగాణ మలిదశ ఉద్యమ పతాకగా ‘బహుజన బతుకమ్మ’ను ప్రారంభించాం. ఆనాడు తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టాలంటూ ఆర్మూర్‌ రోడ్డుమీద ‘బాట బతుకమ్మ’ పేరుతో ఉద్యమ ఆకాంక్షను ఎలుగెత్తాం. అప్పటి నుంచి... ప్రతి ఏటా ఒక్కో అంశంతో బహుజన బతుకమ్మను ప్రజల మధ్యకు తీసుకెళుతున్నాం. వివిధ అంశాలపై వ్యాసాలతో నాలుగు పుస్తకాలు తీసుకొచ్చాం. మిత్ర రాసిన ‘బహుజన బతుకమ్మ’ పాటల్ని ‘అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య’ తరపున రికార్డు చేసి యూట్యూబ్‌లో విడుదల చేశాం. 


ఊరిని ఏకం చేస్తూ...

పూల పండుగలోనూ కొందరు అసమానతలు తీసుకొచ్చారు... అయితే బతుకమ్మ అందరిదీ. అదే మేము చాటుతున్నాం. తెలంగాణలోని ప్రతి ఆడ బిడ్డా సమానత్వం కోసం ఆడాలి - పాడాలి - పోరాడాలి. చప్పట్లు కొట్టే చేతులే అసమానతలను ధిక్కరించే పోరాట పిడికిళ్ళుగా మారాలి. వెలివాడలు ఊరివాడలు కావాలని తొలినాళ్ల నుంచి ‘బహుజన బతుకమ్మ’ గళమెత్తుతోంది.  ప్రతిచోటా బహుజన బతుకమ్మ ద్వారా ఊరు వాడను ఏకం చేసిన అనుభవాలు బోలెడున్నాయి. అయితే... దళితులకు బతుకమ్మ పండుగ లేకపోవడం మీద లోతైన పరిశోధన జరగాలి.


అంటు, ముట్టు లేదు...

పాతకాలంలో గుమ్మడి పువ్వును గౌరమ్మగా కొలిచేవారు. అంతేకానీ, పసుపు ముద్ద, కుంకుమ బొట్లు ఉండేటివి కాదు. బతుకమ్మకు అంటు, ముట్టు లేదు. భర్త చనిపోయిన వాళ్లు, ఒంటరి మహిళలు నిర్భయంగా బతుకమ్మ ఆడొచ్చు. ఋతుస్రావ సమయంలోనూ బతుకమ్మ పండుగను జరుపుకోవచ్చు. కేవలం ముత్తైదువులే బతుకమ్మను ఆడాలి అనడం మూఢాచారమే! అయితే బతుకమ్మతోనే కుల, మతాల హద్దులు చెరుగుతాయని అనుకోవడం లేదు. వర్గ, కుల పోరాటాలతోనే సమసమాజం సాకారమవుతుందని అనుకుం టున్నా. ఆ లక్ష్యంతో  సాగే సాంస్కృతికోద్యమంలో బహుజన బతుకమ్మ ఒక భాగం.

సాంత్వన్‌, ఫొటోలు: ఆర్‌ రాజ్‌కుమార్‌


తొమ్మిది సూత్రాలు...

నవధాన్యాల సంస్కృతిని ఎత్తిపడుతూ తొమ్మిది రోజులూ... తొమ్మిది సూత్రాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నాం. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యతో పాటు మరో నలభై ప్రజా సంఘాలు బహుజన బతుకమ్మలో భాగస్వాములయ్యాయి. అందులో కులనిర్మూలనా సంఘం కూడా ఒకటి. ఉద్యమాల గడ్డ ఉస్మానియా వర్సిటీలో ఈ నెల 24న జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలేల మునిమనుమరాలు నీతాతాయి హోళె చేతుల మీదుగా కులనిర్మూలన బహుజన బతుకమ్మను ప్రారంభించాం. తెలంగాణ ఉమ్మడి పది జిల్లాలలో ఒక్కోరోజు ఒక్కోచోట సభలు, సమావేశాలతో సాగుతూ... అక్టోబరు 4న మేడారంలో ఈ కార్యక్రమం ముగుస్తుంది. 

Read more