Biopic : బయోపిక్‌... భలే ట్రిక్‌!

ABN , First Publish Date - 2022-12-03T23:45:14+05:30 IST

కొత్త కథలు ఎక్కడి నుంచో పుట్టుకురావు. ఉన్నవాటినే వాడుకోవాలి. పాత కథలకు కొత్త కలరింగు ఇవ్వాలి. చుట్టూ చూడాలే గానీ.. బోలెడన్ని జీవితాలు కళ్ల ముందు కనిపిస్తాయి.

Biopic : బయోపిక్‌... భలే ట్రిక్‌!

కొత్త కథలు ఎక్కడి నుంచో పుట్టుకురావు. ఉన్నవాటినే వాడుకోవాలి. పాత కథలకు కొత్త కలరింగు ఇవ్వాలి. చుట్టూ చూడాలే గానీ.. బోలెడన్ని జీవితాలు కళ్ల ముందు కనిపిస్తాయి. అందులో కొన్నయినా సినిమాలకు పనికొచ్చే కథలుంటాయి. బయోపిక్‌లు పుట్టుకురావడానికి కారణం అదే. ప్రతి మనిషి జీవితంలోనూ.. ఒడిదుడుకులు ఉంటాయి. మలుపులు గెలుపులూ కనిపిస్తాయి. తెలియకుండానే సినిమాటిక్‌ విషయాలు జరిగిపోతుంటాయి. అవన్నీ కమర్షియల్‌ కథలకు పనికొచ్చే అంశాలే. సెలబ్రెటీల జీవితాల్ని తెరపై చూడాలనే కోరిక ప్రతి ప్రేక్షకుడికీ ఉంటుంది. అందుకే బయోపిక్‌ల ప్రవాహం కొనసాగుతోంది. ఐదారేళ్లుగా అన్ని భాషల్లోనూ బయోపిక్‌లు వస్తున్నాయి. వెళ్తున్నాయి. అందులో విజయాల శాతం కాస్త తక్కువే ఉన్నప్పటికీ.. ఈ తరహా చిత్రాలకు క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కొన్ని జీవిత కథలు వెండి తెరపైకి దూసుకొస్తున్నాయి. ఇంకొన్ని స్ర్కిప్టు దశలో ఉన్నాయి.

బయోపిక్‌లపై తెలుగువారి దృక్పథాన్ని, వాటిని చూసే కోణాన్నీ పూర్తిగా మార్చేసిన సినిమా ‘మహానటి’. ఓ వ్యక్తి జీవితాన్ని తెరపై ఎలా ఆవిష్కరించాలో చెప్పిన సినిమా అది. అప్పటి నుంచీ.. బయోపిక్‌లు తెలుగునాట ఎక్కువయ్యాయి. వాటిలో విజయాన్ని సాధించిన సినిమాలేంటి? అనేది పక్కన పెడితే.. తెలుగు సినిమాకి సరికొత్త కథా వస్తువు దొరికినట్టైంది. ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ ఎన్టీఆర్‌ జీవితాన్ని తెరపై చూసుకొనే అవకాశాన్ని కల్పించాయి. ‘సైరా’ కూడా ఓ చారిత్రక యోధుడి కథే. ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీస్తున్నప్పుడే ఏఎన్నార్‌ కథనీ సినిమాగా మారిస్తే బాగుంటుందని అక్కినేని అభిమానులు ఆశ పడ్డారు. కానీ అలాంటి ప్రయత్నాలేం జరగలేదు. మహా గాయకుడు ఘంటసాల జీవితాన్ని తెరపైకి తీసుకొస్తామన్నారు కానీ, ఆ ప్రయత్నాలు పూర్తిగా ముందుకు వెళ్లలేదు. గజ దొంగ.. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ కథని ఇప్పుడు సినిమాగా తీస్తున్నారు. ఇందులో రవితేజ హీరో. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పుల్లెల గోపీచంద్‌ జీవితం కూడా వెండి తెరపై రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. సుధీర్‌ బాబు ఆ పాత్రలో కనిపించనున్నారు. సుధీర్‌కి బాట్మెంటెన్‌ నేపథ్యం కూడా ఉంది. కాబట్టి.. సుధీర్‌ ఈ పాత్రకు పర్‌ఫెక్ట్‌. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించాలన్న ఆలోచన ఉంది. దానికి తగ్గటుగానే స్ర్కిప్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతోంది.

సూపర్‌ స్టార్‌ కృష్ణ జీవిత కథ కూడా సినిమాగా వస్తే బాగుంటుంది. ఈ విషయాన్ని మహేశ్‌బాబు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ‘మా నాన్నగారి కథ సినిమాగా చూడాలని నాకూ ఉంది. ఎవరైనా మంచి స్ర్కిప్టుతో వస్తే.. నిర్మాతగా మారడానికి నేను రెడీ. కానీ ఆ బయోపిక్‌లో నేను నటించను’ అని క్లారిటీగా చెప్పేశారు మహేశ్‌. కథ రెడీ అయితే... మహేశ్‌ కూడా రెడీనే. ఇక ఆ బాధ్యత దర్శకులు, రచయితలదే. బెంగళూరు నాగరత్తమ్మ కథని సినిమాగా తీయాలని సింగీతం శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నారు. ఆయన పూర్తి స్థాయిలో స్ర్కిప్టు కూడా రెడీ చేశారు. అనుష్క, సమంత లాంటి స్టార్‌ కథానాయికలతో సంప్రదింపులు జరిపారు. దీనిపై కూడా తొందరల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రతన్‌ టాటా బయోపిక్‌ చేయాలని దర్శకురాలు సుధా కొంగర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పాత్రలో అభిషేక్‌ బచ్చన్‌ లేదంటే సూర్య నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. స్ర్కిప్టు పనులు కూడా పూర్తయ్యాయి. కేజీఎఫ్‌ నిర్మాతలు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు.

సినిమా స్టార్‌, రాజకీయ నేత, క్రీడా విజేత.. ఇలా ఎవరి కథైనా... సినిమా అయిపోవొచ్చు. కాకపోతే.. అందులో కమర్షియల్‌ హంగులు ఎన్ని ఉన్నాయి? అనేదే ప్రధానం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ వెలుగులు, చీకట్లు ఉంటాయి. తప్పొప్పులు ఉంటాయి. అవన్నీ సంపూర్ణంగా చూపించగలిగితేనే బయోపిక్‌లు నిర్మించాలి. ఒకవైపు నిలబడి మాట్లాడితే అవి సంపూర్ణంగా అనిపించవు. కొన్ని బయోపిక్‌లు కేవలం సినిమాటిక్‌ కోణంలోనే సాగడం ఆశ్చర్యపరుస్తోంది. నిజాల్ని దాచేసి, కేవలం డ్రామా కోసం కట్టు కథలు, సన్నివేశాలు అల్లుకొంటున్నారు. ఇంకొన్ని సార్లు బయోపిక్‌లు విమర్శల పాలవుతున్నాయి. వివాదాలకు దారిస్తున్నాయి. సున్నితమైన విషయాన్ని తెరపై చూపించాలనుకొన్నప్పుడు దర్శకులు చాలా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. పైగా.. బయోపిక్‌కి ముఖ్యమైన సవాల్‌.. నటీనటుల ఎంపిక. పాత్రకు తగిన నటున్ని తీసుకురాకపోతే.. ఆ బయోపిక్‌ నిలబడదు. కృష్ణ కథని రాసుకోవడం సులభమే. ఎందుకంటే ఆయన జీవితం తెరచిన పుస్తకం. కానీ... కృష్ణ రూపు రేఖలతో ఉన్న నటుడ్ని వెదికి పట్టుకోవడం చాలా కష్టమైన పని. ఈ విషయంలో రాంగోపాల్‌ వర్మని మెచ్చుకొని తీరాల్సిందే. జీవిత కథలు తెరకెక్కించడం అంటే ఆయనకు మహా సరదా. బయోపిక్‌లతో వర్మ గొప్ప విజయాలేం సాధించలేదు కానీ, ఆ పాత్రలకు తగిన నటీనటుల్ని వెదికి పట్టుకోవడంలో మాత్రం ఆయన సిద్ధహస్తుడిగా మారారు. వీరప్పన్‌ కథకు ఆయన ఎంపిక చేసిన నటుడ్ని చూస్తే.. నిజంగానే వీరప్పన్‌ మన కళ్ల ముందు ఉన్నాడా? అనిపిస్తుంది. ఇంత కసరత్తు మిగిలిన వాళ్లూ చేయాలి. సాధారణంగా ఓ వ్యక్తి జీవితంలోని తెలియని కొత్త కోణాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆశిస్తారు. అలాంటి విషయాలు ఎన్నుంటే.. బయోపిక్‌ అంతగా పండుతుంది. తెలిసిన కథే తెరపై చూడాలంటే ఎవరికైనా బోరే! ఈ విషయంలో కొన్ని బయోపిక్‌లు దొరికిపోయాయి. బాలీవుడ్‌లో జీవిత కథలు తెరకెక్కించేటప్పుడు సహజత్వానికి పెద్ద పీట వేస్తుంటారు. కమర్షియల్‌ హంగుల గురించి పట్టించుకోరు. దక్షిణాదికి ఆ సౌలభ్యం లేదు. ఏ కథైనా కమర్షియల్‌ కోణంలో చెప్పాల్సిందే. అందుకే జీవిత కథలకూ మెరుగులు అద్దడం తప్పడం లేదు. అంతిమంగా ఏ కథైనా ప్రేక్షకులకు నచ్చాల్సిందే. వాళ్ల మెప్పుపొందితేనే విజయం. జీవిత కథలతో.. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం ఈజీనే అయినా.. వాళ్లతో మార్కులు వేయించుకోవడం మాత్రం కష్టం. ఈ విషయంలో దర్శకులు తమ బుర్రలకు ఇంకాస్త పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2022-12-03T23:45:16+05:30 IST