అందం... పూర్తి సేంద్రీయం

ABN , First Publish Date - 2022-10-25T23:45:13+05:30 IST

‘సహజసిద్ధ పదార్థాలతో తయారైన’ అనే లేబుల్‌ కనిపిస్తే చాలు, చటుక్కున అందుకుంటా. కానీ నిజానికి అధిక శాతం ఉత్పత్తుల్లో ఉండేవన్నీ రసాయనాలే! అలాంటి వాటితో విసిగిపోయిన

అందం... పూర్తి సేంద్రీయం

‘సహజసిద్ధ పదార్థాలతో తయారైన’ అనే లేబుల్‌ కనిపిస్తే చాలు, చటుక్కున అందుకుంటా. కానీ నిజానికి అధిక శాతం ఉత్పత్తుల్లో ఉండేవన్నీ రసాయనాలే! అలాంటి వాటితో విసిగిపోయిన కోయంబత్తూరుకు చెందిన ఓ జంట, పూర్తి సహజసిద్ధ సౌందర్య సాధనాల తయారీ మొదలుపెట్టింది. వాళ్లిద్దరి ‘జ్యూసీ కెమిస్ట్రీ’ కథ ఇది.

‘ఆర్గానిక్‌’ లేదా ‘న్యాచురల్‌’ ఈ రెండు పదాలతో కూడిన వినియోగ వస్తువులు, మరీ ముఖ్యంగా ఆరోగ్య, సౌందర్య సాధానాల పట్ల ఆసక్తి, ఆకర్షణ మనందర్లో పెరిగాయి. ఆరోగ్యం, సౌందర్యం పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ అలాంటి రకరకాల ఉత్పత్తుల పట్ల, వాటి తయారీలో ఉపయోగించిన పదార్థాల పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నారు. వృక్షాధారిత ఉత్పత్తులు అందించే సత్ఫలితాలను బట్టి వాటి పట్ల మక్కువ పెరిగింది. అయితే బజార్లో దొరికే ఆర్గానిక్‌ ఉత్పత్తులన్నీ పూర్తి సురక్షితమైనవి కావు. వాటిలో రసాయనాలు రహస్యంగా దాగి ఉంటూ ఉంటాయి. వాటికి పూర్తి భిన్నంగా, మేఘా అషర్‌, ప్రీతేష్‌ అషర్‌ అనే ఓ భారతీయ జంట, 2014లో, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, కృత్రిమ రంగులు ఉపయోగించని సహజసిద్ధ వేగన్‌ సౌందర్య సాధనాల తయారీకి పూనుకుంది. అయితే వేర్వేరు రంగాల్లో విద్యాధికులైన ఈ జంట, వారి నైపుణ్యాలకు ఆలోచనలను జోడించి, పూర్తి సురక్షితమైన సౌందర్య సాధనాల తయారీ మొదలుపెట్టడానికి కారణం మేఘకు ఎదురైన ఓ స్వీయ అనుభవమే!

స్వీయ అనుభవంతో...

అత్యధికంగా సెన్సిటివ్‌గా మారిన చర్మంతో, మొండి మొటిమలతో మేఘ పదేళ్ల పాటు బాధలు పడింది. ఎంతోమంది చర్మ నిపుణులను కాస్మటాలజిస్టులను కలిసింది. ఎన్నో ఉత్పత్తులనూ వాడింది. అయితే వాటిలో మొటిమలను తగ్గించే సామర్థ్యం లోపించిందని ఆలస్యంగా గ్రహించింది. దాంతో ఆర్గానిక్‌ మార్గాన్ని ఎంచుకుందామని నిర్ణయించుకుని, ఆ ఉత్పత్తులను వాడడం మొదలుపెట్టింది. అయితే ఉత్పత్తుల మీద ఆర్గానిక్‌ అనే లేబుల్‌ ఉన్నప్పటికీ, వాటిలో వాడిన పదార్థాల్లో పారాబెన్స్‌, సల్ఫేట్స్‌, కృత్రిమ రంగులూ, సువాసనలూ, మినరల్‌ ఆయిల్స్‌, ఇతరత్రా రసాయనాల పేర్లు ఆమెకు కనిపించాయి. వాటి గురించి తెలుసుకోవడం కోసం భర్త ప్రీతే్‌షను సంప్రతించింది. ఆ పేర్లన్నీ పరిశీలించిన అతను అవన్నీ తన పెట్రోకెమికల్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌లో ఉపయోగించే ముడిపదార్థాలని చెప్పడంతో మేఘ కళ్లు తెరుచుకున్నాయి.

మేధోమథనం చేసి...

మాన్యుఫ్యాక్చరింగ్‌ నేపధ్యం నుంచి వచ్చిన ప్రీతేష్‌, సంక్లిష్టమైన ఫార్ములాలు, తయారీ నైపుణ్యాల్లో సిద్ధహస్తుడు. మేఘ క్రిమినాలజీ అండ్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌కు చెందిన డిగ్రీతో పాటు జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌ కూడా చదివింది. వీళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు. పెద్దయ్యాక ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా కలిసి వెళ్లారు. ప్రీతేష్‌ అక్కడి గ్రిఫిత్‌ యూనివర్శిటీలో బిజినెస్‌ మ్యానేజ్‌మెంట్‌ చదువుతూ చివరి సెమెస్టర్‌లో తండ్రి అనారోగ్యానికి గురవడంతో, హఠాత్తుగా భారతదేశానికి తిరిగొచ్చేశాడు. అప్పటి నుంచి ఇండస్ర్టియల్‌ ఆటోమొటివ్‌ లూబ్రికెంట్‌ కుటుంబ వ్యాపార పగ్గాలు అందుకున్నాడు.

చదువు పూర్తి చేసి ఇండియాకొచ్చిన మేఘ, ప్రీతేష్‌ను పెళ్లాడింది. తను వాడే సౌందర్య ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాల గురించీ, కృత్రిమ పదార్థాల గురించీ భర్త ద్వారా తెలుసుకుంది. అలా అంతిమంగా వాళ్లిద్దరూ తామే స్వయంగా సహజసిద్ధ సౌందర్య సాధనాల తయారీకి పూనుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా జ్యూసీ కెమిస్ట్రీ పేరుతో ఎటువంటి దుష్ప్రభావాలకూ తావు లేని పూర్తి సహజసిద్ధ సౌందర్య ఉత్పత్తులను మొదలుపెట్టారు. తక్కువ కాలంలోనే ఫ్రాన్స్‌కు చెందిన ఇకొసెర్ట్‌, వి3 ప్రమాణాలను కలిగి ఉన్న ఏకైక భారతీయ సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థగా జ్యూసీ కెమిస్ట్రీకి ప్రత్యేక గుర్తింపునూ దక్కించుకోగలిగారు.

సౌందర్య ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాల గురించీ, కృత్రిమ పదార్థాల గురించీ భర్త ద్వారా తెలుసుకుంది. తామే స్వయంగా సహజసిద్ధ సౌందర్య సాధనాల తయారీకి పూనుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా జ్యూసీ కెమిస్ట్రీ పేరుతో ఎటువంటి దుష్ప్రభావాలకూ తావు లేని పూర్తి సహజసిద్ధ సౌందర్య ఉత్పత్తులను తయారు చేసి ఆ సంస్థను ఉన్నత ప్రమాణాల్లో మేటిగా నిలిపారు.

Updated Date - 2022-10-25T23:45:19+05:30 IST