బ్రిటన్‌ హోంలో.. నిన్న ప్రీతి.. నేడు బ్రేవర్మన్‌

ABN , First Publish Date - 2022-09-08T06:47:24+05:30 IST

బ్రిటన్‌ క్యాబినెట్‌లో భారత సంతతి మహిళా న్యాయవాది, సుయెల్లా బ్రేవర్మన్‌కు అరుదైన ఘనత దక్కింది. హోం సెక్రటరీగా కీలక బాధ్యతలు చేపట్టిన ఈ బౌద్ధ మతస్తురాలి గురించి ఆసక్తికర విశేషాలివి!

బ్రిటన్‌ హోంలో.. నిన్న ప్రీతి.. నేడు బ్రేవర్మన్‌

బ్రిటన్‌ క్యాబినెట్‌లో భారత సంతతి మహిళా న్యాయవాది, సుయెల్లా బ్రేవర్మన్‌కు అరుదైన ఘనత దక్కింది. హోం సెక్రటరీగా కీలక బాధ్యతలు చేపట్టిన ఈ బౌద్ధ మతస్తురాలి గురించి ఆసక్తికర విశేషాలివి!


బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హయాంలో అటార్నీ జనరల్‌గా సేవలందించిన 42 ఏళ్ల బ్రేవర్మన్‌, కొత్త ప్రధాని లిజ్‌ ట్రస్‌ సారధ్యంలో బ్రిటన్‌ హోంమంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టడం విశేషం! ఈ అత్యున్నత పదవిని చేపట్టిన రెండో భారతీయ సంతతి మహిళ బ్రేవర్మన్‌... బోరిస్‌ జాన్సన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా కొనసాగారు. ఆ సమయంలో మరో భారతీయురాలు, ప్రీతి పటేల్‌, హోంమంత్రి పదవిలో కొనసాగారు. తాజాగా లిజ్‌ ట్రస్‌, ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత, ప్రీతి హోంసెక్రటరీ పదవికి రాజీనామా చేయడంతో, ఆ పదవి బ్రేవర్మన్‌ను వరించింది. 


వేర్వేరు నేపథ్యాలు... 

ఇద్దరు పిల్లల తల్లి అయిన సుయెల్లా బ్రేవర్మన్‌, యుకెలోనే పుట్టి పెరిగారు. ఈమె తల్లి ఉమ, తమిళనాడుకు చెందిన హిందూ మహిళ. తండ్రి, క్రిస్టీ ఫెర్నాండెజ్‌, గోవాకు చెందిన క్రైస్తవ వ్యక్తి. తల్లి ఉమ మారిషస్‌ నుంచి యుకె వలస వెళ్తే, తండ్రి 1960లో, కెన్యా నుంచి యుకెకు వలస వెళ్లారు. 


బరువు బాధ్యతలు బోలెడు 

హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బ్రేవర్మన్‌కు, యుకె ప్రభుత్వం, ఎంతో క్లిష్టమైన, సవాళ్లతో కూడిన బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా, చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న కొందరు శరణార్థులను వెనక్కు పంపించవలసిన బాధ్యత ఇప్పుడు బ్రేవర్మన్‌ మీద ఉంది. తన కొత్త బాధ్యతలు, సవాళ్ల గురించి బ్రేవర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ... ‘‘నేను బ్రెగ్జిట్‌ అవకాశాలను పొందుపరచాలని అనుకుంటున్నాను. అలాగే సమస్యలను చక్కదిద్ది, పన్నులను తగ్గించాలని అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారావిడ. యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ నుంచి యుకెను బయటకు తీసుకువచ్చేలా ఐరోపా నుంచి స్పష్టమైన విరామాన్ని కోరుకుంటున్నట్టు కూడా తెలిపారావిడ. గత జూలైలో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో తల్లితండ్రుల గురించి మాట్లాడుతూ... ‘‘వాళ్లు బ్రిటన్‌ను ప్రేమించారు. బ్రిటన్‌ వాళ్లలో ఆశలను కలిగించింది. ఈ దేశం వారికి అవకాశాలను కల్పించింది. రాజకీయాల్లోకి అడుగు పెట్టడం వల్లే నా నేపథ్యం అందరికీ తెలిసింది’’ అని చెప్పుకొచ్చారావిడ.


ప్రధానిని ప్రోత్సహిస్తూ... 

హోం సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బ్రిటన్‌ కొత్త ప్రధాని లిజ్‌ ట్రస్‌ గురించి మాట్లాడుతూ, ప్రధానిగా లిజ్‌ సిద్ధంగా ఉన్నారనీ, ఆ పదవిలో ఆవిడ కొత్తగా నేర్చుకోవలసిందేమీ లేదనీ, కష్టతరమైన ఆ పదవిని, సమర్థంగా నిర్వర్తించవలసి ఉంటుందనీ అన్నారావిడ. అలాగే కష్టతరమైన ఆరేళ్ల కాలాన్ని దాటుకుని, అధికారంలోకి వచ్చిన తమ పార్టీ అతి త్వరగా స్థిరత్వాన్ని సాధించవలసిన అవసరం ఉందని కూడా చెప్పుకొచ్చారు బ్రేవర్మన్‌. 


పెళ్లి... పిల్లలు... 

సుయెల్లా బ్రేవర్మన్‌ పూర్తి పేరు, సు ఎల్లెన్‌ కాసియానా ఫెర్నాండెజ్‌. ఈవిడ 1980, ఏప్రిల్‌ 3న లండన్‌లోని హారోలో జన్మించారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం లా గ్రాడ్యుయేట్‌ అయిన బ్రేవర్మన్‌, రెండేళ్ల పాటు ఫ్రాన్స్‌లో యూరోపియన్‌ అండ్‌ ఫ్రెంచ్‌ లాలో మాస్టర్‌ డిగ్రీ చేశారు. 2018, ఫిబ్రవరిలో సుయెల్లా, రేల్‌ బ్రేవర్మన్‌ను పెళ్లాడారు. గత ఏడాది రెండో బిడ్డకు జన్మనివ్వడం కోసం ప్రసూతి సెలవులో ఉన్న సమయంలో, కేబినెట్‌ మంత్రిగా అనుమతించేలా ఒక చట్టపరమైన మార్పును తీసుకువచ్చి ప్రఖ్యాతి కూడా పొందారు. బౌద్ధ మతస్తురాలైన బ్రేవర్మన్‌ లండన్‌ బుద్ధిస్ట్‌ సెంటర్‌కు క్రమం తప్పక హాజరవుతూ ఉంటారు. ఈవిడ, పార్లమెంటులో బుద్ధుని బోధనలతో కూడిన ధమ్మపద మీద ప్రమాణం చేసి, హోం మంత్రి బాధ్యతలు చేపట్టడం విశేషం. 


వాళ్లు బ్రిటన్‌ను ప్రేమించారు. బ్రిటన్‌ వాళ్లలో ఆశలను కలిగించింది. ఈ దేశం వారికి అవకాశాలను కల్పించింది. రాజకీయాల్లోకి అడుగు పెట్టడం వల్లే నా నేపథ్యం అందరికీ తెలిసింది.

Read more