‘కళ’కు భరోసా

ABN , First Publish Date - 2022-09-19T06:25:19+05:30 IST

‘‘చక్కటి కళాకృతిని చూసినప్పుడు... మనసుకు ఆహ్లాదం కలుగుతుంది.

‘కళ’కు భరోసా

మట్టి, కలప, లోహం, వస్త్రం... దేన్నైనా కళాఖండంగా మార్చే నైపుణ్యం హస్తకళా నిపుణుల సొంతం.కానీ వారి బతుకులు బరువై, కళ తప్పడం చూసి కలవరపడ్డారు మేఘా ఫన్సాల్కర్‌.దీనికి ఏదైనా పరిష్కారం చూపించాలన్న ఆమె తపన... ఇప్పుడు 18 రాష్ట్రాల్లో... వేలాది మంది జీవనోపాధికి దోహదం చేస్తోంది.


‘‘క్కటి కళాకృతిని చూసినప్పుడు... మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. దాన్ని సొంతం చేసుకోవాలనిపిస్తుంది. అలాంటి అందమైన వాటిని తయారు చేస్తున్న కళాకారుల్లో చాలామంది కనీసం తిండికైనా నోచుకోని స్థితిలో ఉన్నారు. ఇదంతా ప్రత్యక్షంగా చూసి... ఎంతో ఆవేదన చెందాను. 


మహారాష్ట్రకు చెందిన నా చదువు పుణే, ఇండోర్‌, అహ్మదాబాద్‌ నగరాల్లో సాగింది. మూడు సబ్జెక్టుల్లో మాస్టర్‌ డిగ్రీలు చేసి, గోల్డ్‌ మెడల్‌ సాధించాను. పెళ్ళయిన తరువాత పి.హెచ్‌.డి. చేశాను. ఆ సమయంలోనే నా పిల్లలిద్దరూ పుట్టారు. ఇంటినీ, చదువునూ... ఆ తరువాత ఉద్యోగాన్నీ బ్యాలెన్స్‌ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఇప్పుడు అర్బన్‌ రీజనల్‌ ప్లానర్‌గా నాకు ఇరవయ్యేళ్ళకు పైగా అనుభవం ఉందంటే... అదంతా నా కుటుంబం నాకు అందించిన సహకారమే. ప్రపంచ బ్యాంక్‌ తరఫున 2007 నుంచి వివిధ ప్రాజెక్టులు చేస్తున్న నాకు... మన గ్రామీణ ప్రాంతాలను చాలా దగ్గరగా చూసే అవకాశం కలిగింది. ముఖ్యంగా హస్త కళాకారుల పరిస్థితులు దుర్భరంగా కనిపించాయి. కొత్త డిజైన్లు లేక, మార్కెటింగ్‌ ఎలా చెయాలో తెలియక వారు అత్యంత దయనీయంగా జీవిస్తున్నారు. దోపిడీ చేసే దళారుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడుతున్నారు. స్థిరమైన ఆదాయం లేక అల్లాడుతున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో అధ్యయనం జరిపిన తరువాత... 2015లో ‘తిసర్‌ ఆర్టిసన్‌ ట్రస్ట్‌’ పేరిట లాభాపేక్షలేని ఒక సంస్థను ఏర్పాటు చేశాను. ‘తిసర్‌’ అంటే ‘నేత’. వివిధ ఉత్పత్తుల తయారీకోసం వారికి పెట్టుబడి సమకూర్చడం, వారి సంప్రదాయికమైన నైపుణ్యాలకు ఆధునిక శైలిని, సాంకేతికతను జోడించడం దీని ప్రధాన ఉద్దేశం. ముందుగా మదుపులు పెట్టే బాధ లేకపోవడం, కొత్త డిజైన్లు అందుబాటులోకి రావడం, ఆదాయం కూడా సమకూరడం లాంటి ప్రయోజనాలు గమనించి, ఎంతోమంది ఉత్సాహంగా ముందుకు వచ్చారు. 


2,500 ఉత్పత్తులతో...

ముంబయి కేంద్రంగా ప్రారంభించిన మా ట్రస్ట్‌ కార్యకలాపాలు ఇప్పుడు దక్షిణాసియా వ్యాప్తంగా విస్తరించాయి. దేశంలోని 18 రాష్ట్రాల్లో... వెయ్యికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో పదివేల మంది కళాకారులు దీని ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. వందకు పైగా కళారూపాలకు మా ట్రస్ట్‌ చేయూతను అందిస్తోంది. తెలంగాణ చేనేత, తమిళనాడులోని కంజీవరం, కర్ణాటకలోని చెన్నపట్న బొమ్మలు, ఒడిశాలోని పటచిత్ర, బిహార్‌లోని మధుబని, మహారాష్ట్రలో వెదురు, మట్టితో చేసిన కళాకృతులు... ఇలా అనేక రాష్ట్రాలకు చెందిన విశిష్టమైన ఉత్పత్తులతో పాటు... ప్రాంతీయమైన 20 శైలుల్లో రంగులు అద్దిన వస్త్రాలు, దుస్తులు, అలంకరణ వస్తువులు, ఆట వస్తువులు, గృహోపకరణాలు... వీటిలో ఉన్నాయి. ఇప్పటివరకూ వెయ్యికి పైగా ఉత్పత్తులకు ప్రత్యేకమైన డిజైన్లు అందించాం. యాభై రకాల చేనేత వస్త్రాలతో సహా 2,500 రకాల ఉత్పత్తులు ఈ జాబితాలో చోటుచేసుకున్నాయి. వీటి నాణ్యతను మా ట్రస్ట్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూఉంటుంది.


ప్రాంతీయ భాషల్లో యాప్స్‌

మహిళా సాధికారత ద్వారానే పేదరికం దూరమవుతుందని నా నమ్మకం. వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికీ, కొత్త నైపుణ్యాలు అందించడానికీ, మహిళలకు, బాలికలకు ఆర్థిక, డిజిటల్‌ అవకాశాలు అందుబాటులోకి తేవడానికీ ప్రయత్నిస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో... మహిళలు నిర్వహిస్తున్న సంస్థలతో వారిని అనుసంధానిస్తున్నాం. కార్పొరేట్‌ కార్యాలయాల అలంకరణల కోసం దేశీయ కళాకారుల వస్తువుల కొనుగోలును ప్రోత్సహిస్తున్నాం. స్థానిక భాషల్లో యాప్ప్‌ ద్వారా విక్రయాల కోసం దక్షిణాసియా వ్యాప్తంగా చర్యల్లో భాగంగా.. 50 క్లస్టర్లలోవంద ఉత్పత్తి బృందాలు ఏర్పాటయ్యాయి. పదివేల కుటుంబాలకు చేయూత దొరుకుతోంది. ప్రయోజనం పొందిన మహిళలు లక్ష మందికి పైగా ఉన్నారు. ఈ ఏడేళ్ళ ప్రయాణంలో ‘నారీశక్తి’ పురస్కారంతో సహా పలు అవార్డులు అందుకున్నాను. అవి నా బాధ్యతను మరింత పెంచాయనుకుంటున్నాను. మన దేశం అపూర్వమైన ఎన్నో కళలకు నిలయం. వాటిపై ఆసక్తి చూపించేవారు దేశ, విదేశాల్లో ఎందరో ఉన్నారు. అయితే... మారుమూల గ్రామాల్లోని కళాకారులతో కొనుగోలుదారులను అనుసంధానించే వ్యవస్థలు పెద్దగా లేవు. దీనివల్ల ఆ కళలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వాటిని కాపాడుకోవాలంటే... కళాకారులకు స్థిరమైన ఆదాయాన్ని అందించాలి. భవిష్యత్తు పట్ల భరోసా కల్పించాలి. ఆ దిశగా మరింత కృషి చేయాలన్నదే నా లక్ష్యం.’’


ప్రపంచ బ్యాంక్‌ తరఫున 2007 నుంచి వివిధ ప్రాజెక్టులు చేస్తున్న నాకు... మన గ్రామీణ ప్రాంతాలను చాలా దగ్గరగా చూసే అవకాశం కలిగింది. ముఖ్యంగా హస్త కళాకారుల పరిస్థితులు 

దుర్భరంగా కనిపించాయి. కొత్త డిజైన్లు లేక, మార్కెటింగ్‌ ఎలా చెయాలో తెలియక వారు అత్యంత దయనీయంగా జీవిస్తున్నారు. దోపిడీ చేసే దళారుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడు తున్నారు.

Updated Date - 2022-09-19T06:25:19+05:30 IST