రాత మార్చిన ఆట

ABN , First Publish Date - 2022-10-12T06:27:29+05:30 IST

‘‘విమానం ఎక్కి ఆకాశంలో ఎగురుతానని ఏనాడూ అనుకోలేదు.

రాత మార్చిన ఆట

అమ్మ... తను... నిలువ నీడ లేదు. బజార్లో కూరలు అమ్ముకొంటూ... ఫుట్‌పాత్‌పైనే 

పడుకొంటూ... ఊహ తెలిసినప్పటి నుంచి ఇదే ఎస్‌.సంధ్య జీవితం. కానీ ఇప్పుడు... 

ఆట ఆమె రాత మార్చింది. దోహాలో జరిగే ‘స్ట్రీట్‌ చైల్డ్‌ ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌’లో పోటీపడే 

భారత జట్టుకు సంధ్య నాయకత్వం వహిస్తోంది. 


‘‘విమానం ఎక్కి ఆకాశంలో ఎగురుతానని ఏనాడూ అనుకోలేదు. ఇక ఆటలు నా జీవితంలో భాగమవుతాయన్న ఊహే లేదు. అలాంటిది అదే ఆట నా జీవితాన్నే మలుపు తిప్పింది. సరికొత్త మార్గం చూపించి... బతకడానికి ఓ అర్థం ఉందని చెప్పింది. అవును... ఫుట్‌బాల్‌... ఈ ప్రపంచానికి నన్ను గొప్పగా పరిచయం చేసింది. అది కూడా వీధి పిల్లల కోసం కూర్చిన జట్టు నాయకత్వ బాధ్యతలు నాకు అప్పగించింది. ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది! జట్టులో అందరూ నాలాంటివారే. వీధుల్లో బతుకుతూ... ప్రతిభను నమ్ముకున్న అమ్మాయిలే ప్రస్తుత భారత జట్టు సభ్యులు. 


వీధుల్లోనే... 

నేను చెన్నై తప్ప మరో ప్రాంతం ఎరుగను. నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడి కోయంబేడు వీధుల్లోనే పెరిగాను. బాల్యమంతా వీధుల్లోనే గడిచింది. ఇక్కడి మార్కెట్‌లో పక్కన పడేసిన కూరగాయలు సేకరించి విక్రయించేదాన్ని. ఆ వచ్చిన కాస్త డబ్బుతో నేను, మా అమ్మ కడుపు నింపుకొనేవాళ్లం. మాకు అక్కడి ఫుత్‌పాత్‌లే ఆవాసాలు. రాత్రయితే బిక్కు బిక్కుమంటూ గడిపేవాళ్లం. ఒకటా రెండా... అలా ఎన్నో ఏళ్లు గడిచాయి. నిత్య పోరాటంగా సాగుతున్న నా జీవితంలోకి వెలుగు రేఖలా ప్రవేశించింది ‘కరుణాలయ’ స్వచ్ఛంద సంస్థ. ఎప్పటిలాగే ఆ రోజు ఫుట్‌పాత్‌ మీద కూరలు అమ్ముతున్నాను. ఆ దృశ్యం సంస్థ వారి కంట పడింది. వెంటనే వారు నా దగ్గరకు వచ్చి, వివరాలు అడిగారు. నా కథ తెలుసుకుని తమ కేంద్రానికి తీసుకువెళ్లారు. 


ఊహించని మలుపు... 

అక్కడి షెల్టర్‌కు వెళ్లిన తరువాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. నన్ను స్కూల్లో చేర్పించారు. ఆ సమయంలోనే ఫుట్‌బాల్‌పై ఆసక్తి కలిగింది. దాన్ని గమనించి నన్ను ఎంతో ప్రోత్సహించారు. శిక్షణనిప్పించారు. క్రమంగా ఆటలో మెళకువలు నేర్చుకున్నాను. నైపుణ్యం సాధించాను. దాంతో పాల్గొన్న వివిధ పోటీలన్నిటిలో రాణించాను. ఆ ప్రతిభను గుర్తించి నన్ను  ‘స్ట్రీట్‌ చైల్డ్‌ ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌’లో పోటీపడే భారత జట్టుకు ఎంపిక చేశారు. ఇది నేను అస్సలు ఊహించలేదు. ఎక్కడో వీధుల్లో అవస్థలు పడుతున్న నాకు ఇంతటి అవకాశం రావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. 


భిన్న నేపథ్యాల... 

కతార్‌లోని దోహాలో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 25 దేశాలు పాల్గొంటున్నాయి. విమానం ఎక్కడం... నా నేపథ్యం, నా పరిస్థితులకు కలలో కూడా అసాధ్యం. కానీ దాన్ని సుసాధ్యం చేసింది... ఫుట్‌బాల్‌. ఈ ఆట నాకు ఎంతో నేర్పింది. ఎన్నో ఇచ్చింది. మరో విశేషమేమంటే భారత జట్టులో తొమ్మిది మంది చెన్నై బాలికలే. వారివీ భిన్న నేపథ్యాలు. పదిహేడేళ్ల ప్రియకు వాళ్ల అమ్మానాన్న ఎలా ఉంటారో కూడా తెలియదు. రాయపురం స్కూల్‌లో పన్నెండో తరగతి చదువుతున్న తను ఐదేళ్ల కిందట ఫుట్‌బాల్‌ మొదలుపెట్టింది. తనలా ఏ దిక్కూ లేని ఎంతో మంది పిల్లలకు బంగరు భవిత అందిచాలన్న లక్ష్యంతో సామాజిక సేవకు అంకితం కావాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఎంతో గర్వంగా భావిస్తోంది. తనే కాదు... జట్టులో ఏ ఒక్కరిని కదిలించినా భావోద్వేగాలు నిండిన ఇలాంటి కన్నీటి కథలే కనిపిస్తాయి. 


ఆరు నెలల కృషి... 

ఈ టోర్నీ కోసం మేం రాత్రింబవళ్లూ శ్రమించాం. కోచ్‌ల ఆధ్వర్యంలో ఆరు నెలలుగా కఠోర శిక్షణ తీసుకొంటున్నాం. నాలాంటి వీధి బాలికలందరికీ ఇది ఒక సువర్ణావకాశం. టోర్నీలో గెలుపే అంతిమ లక్ష్యం అయినా... మాలాంటి వారందరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు లభించిన ఒక వేదికగా దీన్ని ఉపయోగించుకొంటాం.’’


  చెన్నైలోని కోయంబేడు వీధుల్లో పెరిగా. మార్కెట్‌లో  పడేసిన కూరగాయలు సేకరించి విక్రయించేదాన్ని. ఆ డబ్బుతో నేను, మా అమ్మ కడుపు నింపుకొనేవాళ్లం. మాకు అక్కడి ఫుత్‌పాత్‌లే ఆవాసాలు. 

Read more