2 వేల కిలోమీటర్ల వలస

ABN , First Publish Date - 2022-06-19T18:05:54+05:30 IST

రంగురంగుల సీతాకోకచిలుకలు... అపురూప అందానికి చిరునామా.. వీటిలో ఎన్నో రకాలు. వీటిలో కాస్త పెద్దవి చెస్ట్‌నట్‌ టైగర్‌ రకానికి. రెక్కలు విచ్చుకున్నప్పుడు

2 వేల కిలోమీటర్ల వలస

ఓ సీతాకోకచిలుక ప్రతి వేసవిలో వేల కిలోమీటర్లు పయనిస్తుందంటే నమ్మగలమా? అవే చెస్ట్‌నట్‌ టైగర్‌ సీతాకోకచిలుకలు. వీటి వలస ప్రయాణం ఎంతో ఆశ్చర్యభరితం.

రంగురంగుల సీతాకోకచిలుకలు... అపురూప అందానికి చిరునామా.. వీటిలో ఎన్నో రకాలు. వీటిలో కాస్త పెద్దవి చెస్ట్‌నట్‌ టైగర్‌ రకానికి. రెక్కలు విచ్చుకున్నప్పుడు 43-65 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. నల్లటి శరీరం పై తెల్లని చుక్కలు.. ఆపై నీలం, ఎరుపు రంగుల మచ్చలతో ఆకర్షణీ యంగా ఉంటాయి. జపాన్‌, కొరియా, చైనా, తైవాన్లతో పాటు హిమాలయాల్లో కూడా వీటి సందడి కనిపిస్తుంది. వాతావరణానికి తగినట్టుగా ఈ సీతాకోకచిలుకల వలస యాత్ర ప్రారంభం అవుతుంది. వసంతరుతువులో ఆహార వేట కోసం ఉత్తరం వైపు, ఆకురాలు కాలంలో గుడ్లు పెట్టేందుకు దక్షిణానికి ఇవి పయనమై వెళతాయి.


సుదూర తీరాలకు...

జపాన్‌లో వీటిని ‘అసాగి’ అని పిలుస్తారు. రెక్కలకు ఉండే ముదురు నీలం రంగు కారణంగా వీటికి ఆ పేరు వచ్చింది. జపాన్‌ అంతా ఈ సీతాకోకలు కనిపిస్తాయి. అయితే జపాన్‌లో ఉన్న అన్ని సీతాకోక చిలుకల్లోకి ఇవే వలసవి కావడం విశేషం. జపాన్‌లోని అందాల ద్వీపాల్లో ఒకటి హిహేషిమా. ఇక్కడ మే, జూన్‌ మాసాలలో ఎక్కడ చూసినా చెస్ట్‌నట్‌లే. తమ సుదీర్ఘ యాత్రలో భాగంగా రెండు నెలలు ఈ ద్వీపంలో ఉండిపోతాయి. ఎక్కడో ఉన్న తైవాన్‌ నుంచి జపాన్‌లోనే ఉన్న హోన్షు, నాన్సే ద్వీపాలకు వెళుతూ హిహేషిమాకి చేరు కుంటాయి. ఇదే సమయంలో పూసే మిల్క్‌వీడ్‌ పూల మకరందాన్ని తాగుతూ గడిపేస్తాయి. ఎంత లేదన్నా రెండు వేల కిలోమీటర్ల దూరం పయనిస్తాయి.


వేసవిలో వందల సంఖ్యలో వస్తోన్న ఈ సీతాకోకచిలుకలపై స్థానిక సంరక్షక సభ్యులు గుర్తులు వేసి వీటి పయనాన్ని లెక్కించారు. రెండు వారాలకు 600 కిలోమీటర్లు, రెండు నెలల తరవాత 1500 కిలోమీటర్ల దూరంలోని ద్వీపాల్లో ఇవి కనిపించడం చూసి ఆశ్చర్యపోయారు. చెస్ట్‌నట్‌లు ప్రతి సారీ 1500 - 2000 కిలోమీటర్లు పయనిస్తున్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. రోజుకి 200 కిలోమీటర్లు పయనించేవీ ఉన్నాయట. కొన్ని కొరియా ద్వీపాలకూ ఎగురుతున్నాయట. చిన్న చిన్న రెక్కలతో అంత దూరం ప్రయాణిస్తున్న వాటి తీరు ఆశ్చర్యం కలగక మానదు. ఎక్కువగా రెక్కలను ఆడించి అలసిపోకుండా గాలి కుదుపులతో ముందుకు సాగడం వీటి ప్రత్యేకత. మనుషులను చూసి ఇవి భయపడవు. అందుకే అసాగి సీతాకోకచిలుకలతో సెల్ఫీలు దిగేవారు లేకపోలేదు. వేసవిలో ఆహారం కోసం అంత దూరం పయనిస్తోన్న చెస్ట్‌నట్‌ల జీవితాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు. 

Read more