అమెరికాకు కృతజ్ఞతలు చెబుతూనే మరింత సాయం కోరిన జెలెన్‌స్కీ

ABN , First Publish Date - 2022-03-17T01:29:47+05:30 IST

రష్యా దురాక్రమణదారుల నుంచి తమ దేశాన్ని కాపాడుకునేందుకు మరింత ఆర్థిక సహాయంతో పాటు..

అమెరికాకు కృతజ్ఞతలు చెబుతూనే మరింత సాయం కోరిన జెలెన్‌స్కీ

వాషింగ్టన్: రష్యా దురాక్రమణదారుల నుంచి తమ దేశాన్ని కాపాడుకునేందుకు మరింత ఆర్థిక సహాయంతో పాటు ఆయుధాలను తక్షణ సాయంగా అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యూఎస్ కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. తొలిసారి వర్చువల్ కాన్ఫరెన్స్‌లో ఆయన కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతూ.. ''మిత్రులారా! అమెరికాకు ఉక్రెయిన్ ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తోంది. దురాక్రమణదారులను ఎదుర్కొనేందుకు ఆయుధాలతో సహా అవసరమైన అన్నిరకాల సాయం అందిస్తున్న మీ ప్రభుత్వానికి, మీ ప్రజలకు రుణపడి ఉంటాం. తక్షణం మరింత సాయం అందించాలని మిమ్నల్ని కోరుకుంటున్నాను. రష్యా మిలిటరీ మిషన్ నిలిపేసేంత వరకూ వారిపై మరిన్ని కొత్త ఆంక్షల ప్యాకేజీ  ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంది'' అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.


రష్యా దాడులను పెరల్ హార్బర్‌పై 1941 డిసెంబర్ 7న జరిగిన దాడులతోనూ, న్యూయార్క్, వాషింగ్టన్, పెన్సిల్వేనియాలపై 2001 సెప్టెంబర్ 11న జరిగిన దాడులతోనూ జెలెన్‌స్కీ పోల్చారు. ఇదే అనుభవాన్ని తమ దేశం ప్రతిరోజూ చవిచూస్తోందని, గత మూడు వారాలుగా ప్రతీ రాత్రి ఇదే పరిస్థితి ఉక్రెయిన్‌లో నెలకొందని చెప్పారు. ఉక్రెయిన్ గగనతలాన్ని మృత్యుముఖంగా రష్యా మారుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో బాంబులదాడులు, చిన్నపిల్లలు సహా అనేక మంది క్షతగాత్రులైన లఘ వీడియోను కూడా జెలెన్‌స్కీ ఈ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో  ప్రదర్శించారు. తన వయస్సు దాదాపు 45 ఏళ్లని, కనీసం 100 మంది పిల్లల గుండెలు ఆగిపోతే, ఈ మరణాలను తాను ఆపలేకపోతే ఇక తాను బ్రతికుండటంలో అర్ధం లేదని కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు. 20 నిమిషాల సేపు జెలెన్‌స్కీ ఒక ట్రాన్స్‌లేటర్‌ సాయంతో తన ప్రసంగం సాగించారు. కొద్ది సేపు ఆంగ్లంలోనూ మాట్లాడారు.

Read more