బయటికి వచ్చిన జిన్‌పింగ్‌!

ABN , First Publish Date - 2022-09-28T07:29:59+05:30 IST

తాను గృహనిర్బంధంలో ఉన్నానంటూ వచ్చిన వార్తలకు చెక్‌ పెడుతూ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ మంగళవారం తొలిసారిగా బయటకు వచ్చారు.

బయటికి వచ్చిన జిన్‌పింగ్‌!

ఉజ్బెకిస్థాన్‌ పర్యటన అనంతరం తొలిసారి ప్రజలకు బయట కనిపించిన చైనా అధ్యక్షుడు

బీజింగ్‌, సెప్టెంబరు 27: తాను గృహనిర్బంధంలో ఉన్నానంటూ వచ్చిన వార్తలకు చెక్‌ పెడుతూ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ మంగళవారం తొలిసారిగా బయటకు వచ్చారు. బీజింగ్‌లో జరిగిన ఒక ప్రదర్శనకు ఆయన హాజరయ్యారని ప్రభుత్వ అధికారిక మీడియా ఈ మేరకు వెల్లడించింది. గడచిన దశాబ్దకాలంగా చైనా సాధించిన ప్రగతిని చూపించేలా రూపొందించిన ఈ ప్రదర్శనను జిన్‌పింగ్‌ మాస్క్‌ ధరించి ప్రత్యక్షంగా హాజరై తిలకించారని స్పష్టం చేసింది. 2020లో ప్రపంచంపై కొవిడ్‌ విరుచుకుపడినప్పటి నుంచీ దేశాన్ని వీడని జిన్‌పింగ్‌, ఈ నెల 16న ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ బయటకి రాకపోవడంతో అప్పటికే ఉన్న గృహనిర్బంధం వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ప్రదర్శనకు ఆయన హాజరై అన్ని వదంతులకు చెక్‌ పెట్టినట్లైంది. చైనాలో మావో తర్వాత ఆ స్థాయికి చేరుకున్న వ్యక్తి జిన్‌పింగ్‌ మాత్రమే. ఈ నేపథ్యంలో ఆయన దేశాధ్యక్షుడిగా తన హోదాను శాశ్వతం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఏడాది చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) సమావేశాల్లో జిన్‌పింగ్‌ను మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2022-09-28T07:29:59+05:30 IST