Women Problems : ఆ ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయపడుతున్న మహిళలు

ABN , First Publish Date - 2022-12-06T11:48:29+05:30 IST

ఆధునిక జీవన విధానంలో మహిళలు కుటుంబ భారంలో కొంత మోయవలసిన పరిస్థితులు ఉన్నాయి.

Women Problems : ఆ ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయపడుతున్న మహిళలు
Work Place Violence

న్యూఢిల్లీ : ఆధునిక జీవన విధానంలో మహిళలు కుటుంబ భారంలో కొంత మోయవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో వారు తమ మేధోసంపత్తిని, శక్తి, సామర్థ్యాలను చాటి చెప్పుకుంటున్నారు. పురుషులతో సరిసాటిగా ఎదుగుతున్నారు. సైన్యం సహా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. అయితే వారు తమ సత్తాను నిరూపించుకునే చోటులోనే మానసికంగా క్రుంగిపోయే దుస్థితిని ఎదుర్కొంటున్నారు. కార్యాలయాలు, పని ప్రదేశాల్లో దుష్టబుద్ధిగల పురుషుల వేధింపులను తట్టుకోలేకపోతున్నారు. ఈ వేధింపులు, హింస ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకునేందుకు మొట్టమొదట చేసిన ప్రయత్నంలో కఠోర వాస్తవాలు వెల్లడయ్యాయి. ఈ సమస్య లేకపోతే వారు మరింత సమర్థతతో దేశానికి ప్రయోజనకరంగా సేవలందించగలరనడంలో సందేహం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో పురుషులు కూడా వేధింపులను ఎదుర్కొంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.

ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ కార్మిక సంస్థ (UN International Labour Organization), లాయిడ్స్ రిజిస్టర్ ఫౌండేషన్ (Lloyds Register Foundation), గాలప్ (Gallup) 121 దేశాల్లో గత ఏడాది నిర్వహించిన అధ్యయన నివేదిక సోమవారం విడుదలైంది. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. యువత, వలసదారులు, రోజు కూలీలు, ముఖ్యంగా మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.

ఈ అధ్యయనంలో 75,000 మంది వర్కర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వీరిలో 22 శాతం మందికిపైగా తాము ఏదో ఓ రూపంలో హింస లేదా వేధింపులను ఎదుర్కొన్నట్లు తెలిపారు.

పని ప్రదేశాల్లో హింస, వేధింపులు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. ఇది చాలా ప్రమాదకరమైన అంశమని పేర్కొంది. దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటోందని పేర్కొంది. బాధితుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడం నుంచి ఆదాయాన్ని కోల్పోవడం, కెరీర్ దెబ్బతినడం, ఆర్థిక నష్టాలు వంటివాటిని వారు ఎదుర్కొనవలసి వస్తోందని తెలిపింది.

పని ప్రదేశాల్లో హింస లేదా వేధింపులను ఎదుర్కొన్నవారిని మూడు ప్రశ్నలు అడిగారు. (1) శారీరక, (2) మానసిక, (3) లైంగిక హింస, వేధింపులలో ఎవరు ఏ రూపంలో ఇబ్బందిపడ్డారు? ఒకటి కన్నా ఎక్కువ రూపాల్లో ఇబ్బందిపడ్డారా? అని అడిగారు. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో మూడింట ఒక వంతు మంది తాము ఒకటి కన్నా ఎక్కువ రూపాల్లో హింస లేదా వేధింపులను ఎదుర్కొన్నామని చెప్పారు. తాము ఈ మూడు రూపాల్లోనూ హింస లేదా వేధింపులను ఎదుర్కొన్నామని 6.3 శాతం మంది చెప్పారు.

మానసిక హింస, వేధింపులు అత్యంత సాధారణమేనని స్త్రీ, పురుషులు చెప్పారు. తాము పని చేస్తున్నపుడు దీనిని ఏదో ఒక సమయంలో ఎదుర్కొన్నామని 17.9 శాతం మంది చెప్పారు. పని ప్రదేశంలో శారీరక హింస, వేధింపులను ఎదుర్కొన్నామని 8.5 శాతం మంది చెప్పారు, అయితే వీరిలో మహిళల కన్నా పురుషులే ఎక్కువ ఉన్నారు. లైంగిక హింస, వేధింపులను ఎదుర్కొన్నామని 6.3 శాతం మంది చెప్పగా, వీరిలో మహిళలు అధికంగా ఉన్నారు.

పని ప్రదేశంలో హింస, వేధింపుల బాధితుల్లో 60 శాతం మందికి పైగా తాము అనేకసార్లు ఈ దుస్థితిని ఎదుర్కొన్నామని చెప్పారు. వీరిలో అత్యధికులకు చివరి సంఘటన గడచిన ఐదేళ్ళలో జరిగింది.

స్త్రీ లేదా పురుషుడు, అంగవైకల్యం, జాతీయత, స్థానికత, శరీరఛాయ, మతం వంటివాటి కారణంగా ఏదో ఓ సమయంలో వివక్షను ఎదుర్కొనేవారు పని ప్రదేశంలో హింస, వేధింపులను ఎదుర్కొనే అవకాశాలు ఇతరుల కన్నా ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనం వెల్లడించింది.

పని ప్రదేశంలో హింస, వేధింపులపై గణాంకాలు స్పష్టంగా లేవని ఈ నివేదిక పేర్కొంది. ప్రజల సొంత అనుభవాలను తెలుసుకోవడం కోసం లాయిడ్, గాలప్ సంస్థలతో కలిసి ఐఎల్ఓ పని చేయడానికి ఇదే కారణమని తెలిపింది. ఈ అధ్యయన ఫలితాలు ఈ విషయంలో మరింత పరిశోధన జరగడానికి ఉపయోగపడతాయని పేర్కొంది. బలమైన సాక్ష్యాధారాలు ఉండటం వల్ల ఈ దుస్థితిని నివారించడానికి తగిన సమగ్ర చట్టాలు, విధానాలను రూపొందించి, అమలు చేయడానికి వీలవుతుందని తెలిపింది.

Updated Date - 2022-12-06T13:34:12+05:30 IST