రూపాయి విలువ పతనం... ప్రజలపై పెను భారం...

ABN , First Publish Date - 2022-07-14T23:52:29+05:30 IST

అమెరికన్ డాలర్‌తో పోల్చినపుడు భారత దేశ రూపాయి విలువ

రూపాయి విలువ పతనం... ప్రజలపై పెను భారం...

న్యూఢిల్లీ : అమెరికన్ డాలర్‌తో పోల్చినపుడు భారత దేశ రూపాయి విలువ క్షీణించడం కొనసాగుతుండటం వినియోగదారులకు ఆందోళనకరం. వరుసగా మూడు సెషన్స్‌లో రూపాయి విలువ పతనమైంది. గురువారం ఏడు పైసలు రికవరీ కావడానికి ముందు దీని విలువ రికార్డు స్థాయిలో పతనమై 79.81కి చేరింది. బలమైన అమెరికన్ కరెన్సీ ఓవర్‌ఫ్లోస్, ఫారెక్స్ ఔట్‌ఫ్లోస్ రూపాయి లాభపడకుండా అడ్డుకున్నట్లు డీలర్లు చెప్తున్నారు. 


గురువారం ఓ అమెరికన్ డాలర్‌కు రూ.79.90 స్థాయికి రూపాయి విలువ పతనమైంది. అంటే ఓ డాలర్‌కు రూ.80 స్థాయికి దగ్గర్లో ఉంది. రూపాయి విలువ క్షీణించడం వల్ల ప్రజలపై ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి విలువ పతనం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఫిబ్రవరి నుంచి దాదాపు 26 సార్లు పతనమైంది. ఈ నెలలో ఆరుసార్లు సరికొత్త బలహీన స్థాయులను తాకింది. 


మన దేశం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది కాబట్టి ద్రవ్యోల్బణ ఒత్తిళ్ళ వల్ల రూపాయి పతనం తాలూకు సెగ తప్పకుండా తగులుతుంది. అదనపు సొమ్ము అందుబాటులో లేని కుటుంబాల ఖర్చులకు సంబంధించిన నిర్ణయాలపై దీని ప్రభావం ఉంటుంది. 


దిగుమతి చేసుకోవలసిన వస్తువులు, ఆహార ధాన్యాల కోసం డాలర్లలో చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి రూపాయి విలువ బలహీనపడినపడినందువల్ల దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరుగుతాయి. ఎలక్ట్రానిక్స్ నుంచి ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ వరకు వినియోగదారులు అధిక మొత్తాలను చెల్లించక తప్పదు. విదేశీ విద్య, ప్రయాణాల కోసం కూడా భారీగా చెల్లించవలసి వస్తుంది. అమెరికాలో విద్య, ప్రయాణాల ఖర్చులు గత ఆరు నెలల్లో ఏడు శాతం మేరకు పెరిగాయి. ఇప్పుడు రూపాయి విలువ పతనమవుతుండటంతో వినియోగదారులపై ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది. 


Read more