85 మంది కొత్త ఎమ్మెల్యేల్లో 82 మంది ఆప్ నేతలే

ABN , First Publish Date - 2022-03-14T00:08:03+05:30 IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోని సీనియర్లంతా ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్‌బీర్ సింగ్ బాదల్, బిక్రమ్ సింగ్ మజితియా లాంటి పెద్ద నాయకులంతా..

85 మంది కొత్త ఎమ్మెల్యేల్లో 82 మంది ఆప్ నేతలే

చండీగఢ్: పంజాబ్‌లో ఒక కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతే కాదు, పంజాబ్ రాజకీయంలో చాలా మంది కొత్త ముఖాలు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో 85 మంది కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇందులో 82 మంది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలే కావడం గమనార్హం. దీంతో పాటు మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. గతంలో శాసనసభ్యులు అంటే 50-60 ఏళ్లు, అంతకు పైబడిన వారు ఎక్కువగా ఉండేవారు. కానీ ఈసారి చాలా మంది 50 ఏళ్ల లోపు వారే. పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం 50 ఏళ్ల లోపు వ్యక్తే.


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోని సీనియర్లంతా ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్‌బీర్ సింగ్ బాదల్, బిక్రమ్ సింగ్ మజితియా లాంటి పెద్ద నాయకులంతా ఓడిపోయారు. వీరి స్థానాన్ని కొత్త తరం ఆక్రమించింది. పైగా ఈసారి ఎన్నికైన సభ్యుల్లో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారట. డాక్టర్లే 12 మంది ఉన్నారు. ఇందులో 9 మంది ఆప్ సభ్యులే. ఈసారి ఎన్నికలు పంజాబ్ రాజకీయాల్ని పూర్తిగా మార్చేశాయని, పాత విధానం, పాత తరం, పాత పోకడ చాలా మట్టుకు మారిందని స్థానికులే అంటున్నారు.


ఇక ఈ అసెంబ్లీలో మరో విశేషం కూడా ఉంది. గతంతో పోలిస్తే ఈసారి మహిళా ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. గత అసెంబ్లీలో కేవలం ఐదుగురు మాత్రమే సభ్యులు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 13కి పెరిగింది. కాగా ఇందులో కూడా ఆప్ దాదాపు వాటాను ఆక్రమించేసింది. 11 మంది మహిళా ఎమ్మెల్యేలు ఆప్‌కు చెందినవారే.

Updated Date - 2022-03-14T00:08:03+05:30 IST