JK: ఆర్టికల్ 370 పునరుద్ధరణపై మా పోరాటం ఆగదు: ఒమర్ అబ్దుల్లా

ABN , First Publish Date - 2022-09-11T23:12:17+05:30 IST

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే 370 అధికరణను (Article 370) పునరుద్ధరించడం సాధ్యం కాదని..

JK: ఆర్టికల్ 370 పునరుద్ధరణపై మా పోరాటం ఆగదు: ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే 370 అధికరణను (Article 370) పునరుద్ధరించడం సాధ్యం కాదని గులాం నబీ ఆజాద్ (Ghulam nabi azad) నిర్ద్వంద్వంగా ప్రకటించిన తరుణంలోనే ఇందుకు భిన్నంగా నేషనల్ కాన్ఫరెన్స్ (NC) నేత, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆదివారంనాడు స్పందించారు. 370 అధికరణను పునరుద్ధరించేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు.


శ్రీనగర్‌లో నిర్వహించిన నేషనల్ కాన్ఫరెన్స్ సదస్సులో ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం రద్దు చేసిన 370వ అధికరణ పునరుద్ధరణ కోసం ప్రజాస్వామ పద్ధతిలో, రాజ్యాంగ బద్ధంగా, రాజకీయ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. 2019 ఆగస్టు 5న కేంద్రం చేసిన ప్రకటనను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చాలా బలంగా సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు. ''మేము మాత్రం ఆశలు (ఆర్టికల్ 370 పునరుద్ధరణపై) వదులుకోలేదు. సుప్రీంకోర్టుపై మాకు నమ్మకం ఉంది. కనీసం అత్యున్నత న్యాయస్థానమైనా మన అభ్యర్థనను వింటుందని ఆశిస్తున్నాం. మన కేసు చాలా బలంగా ఉందనే నమ్మకం నాకు ఉంది'' అని ఆయన చెప్పారు.


ఆర్టికల్ 370 రద్దు తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందంటూ కేంద్రం చెప్పుకోవడాన్ని ఒమర్ అబ్దుల్లా కొట్టివేశారు. క్షేత్ర స్థాయిలో ఎలాంటి అభివృద్ధిని తాను చూడలేదన్నారు. కేంద్ర పాలనపై జనం విసుగెత్తిపోయారని, జమ్మూకశ్మీర్‌లో రాజకీయ అనిశ్చితికి తెరపడాలంటే సాధ్యమైనంత త్వరగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.

Updated Date - 2022-09-11T23:12:17+05:30 IST