Congress Versus RSS : దళితులు ఆరెస్సెస్ చీఫ్ ఎందుకు కాలేకపోతున్నారు : సిద్ధరామయ్య

ABN , First Publish Date - 2022-06-07T21:23:43+05:30 IST

కాంగ్రెస్, ఆరెస్సెస్ మధ్య జగడం ముదురుతోంది. పాఠశాల విద్యార్థుల

Congress Versus RSS : దళితులు ఆరెస్సెస్ చీఫ్ ఎందుకు కాలేకపోతున్నారు : సిద్ధరామయ్య

బెంగళూరు : కాంగ్రెస్, ఆరెస్సెస్ మధ్య జగడం ముదురుతోంది. పాఠశాల విద్యార్థుల పాఠ్యాంశాలను కాషాయీకరణ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆరెస్సెస్ కార్యకర్తలు ధరించే చెడ్డీలను ఎన్ఎస్‌యూఐ తగులబెట్టింది. మేం కూడా చెడ్డీలను పంపిస్తాం కాల్చుకోండి అంటూ ఆరెస్సెస్ స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరెస్సెస్‌కు ఘాటు ప్రశ్నలు సంధించారు.


కర్ణాటక పాఠ్య పుస్తకాల సమీక్ష కమిటీ తీసుకున్న నిర్ణయం ఈ వివాదానికి కారణమైంది. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్ ప్రసంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చడంతో కాంగ్రెస్ నిరసన తెలుపుతోంది. 


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ పదవిని ఓ దళితుడు లేదా ఇతర వెనుకబడిన కులాలు (OBCs)కు చెందిన వ్యక్తి ఎందుకు అలంకరించలేకపోతున్నారని సిద్ధరామయ్య ప్రశ్నించారు. ఆయన హుబ్లిలో మాట్లాడుతూ, ఆరెస్సెస్ నాన్ సెక్యులర్ ఆర్గనైజేషన్ అని తాను మొదటి నుంచి చెప్తున్నానని తెలిపారు. ‘‘ఓ దళితుడు, ఓబీసీ లేదా ఓ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎప్పుడైనా సర్‌సంఘ్‌చాలక్ అయ్యారా? చెడ్డీలు అంతకన్నా ఏం చేయగలవు? వాళ్ళు చెడ్డీ పనులు మాత్రమే చేస్తారు. చెడ్డీలు చెడ్డీల పనే చేస్తాయి’’ అన్నారు. ఆరెస్సెస్ కార్యకర్తలు చెడ్డీలను సేకరిస్తున్న విషయంపై స్పందించాలని విలేకర్లు అడిగినపుడు సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.


సిద్ధరామయ్య ఆదివారం మాట్లాడుతూ, కర్ణాటకలో పాఠశాల విద్యార్థుల పాఠ్యాంశాలను కాషాయీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా తాము ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా ఖాకీ చెడ్డీలను తగులబెడతామన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం National Students' Union of India (ఎన్ఎస్‌యూఐ) కార్యకర్తలు కొందరు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ నివాసం వద్ద ఖాకీ చెడ్డీలను తగులబెట్టారు. దీంతో ఆరెస్సెస్ కార్యకర్తలు గ్రామాల నుంచి పాత చెడ్డీలను సేకరించి, బెంగళూరులోని కాంగ్రెస్ కార్యాలయానికి పంపించారు. ఆరెస్సెస్ కార్యకర్తలు ధరించే ఖాకీ నిక్కర్లకు వ్యతిరేకంగా సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 


రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడాలి : బొమ్మయ్

సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ మంగళవారం స్పందించారు. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి గురించి మాట్లాడాలన్నారు. ఆయనకు ఇతర విషయాలేవీ లేకపోవడం వల్ల ఇలాంటి అంశాలపై మాట్లాడుతున్నారన్నారు. వీటన్నిటినీ కర్ణాటక ప్రజలు గమనిస్తున్నారన్నారు. 


అసెంబ్లీ ఎన్నికల కోసమే...

కర్ణాటక విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ స్పందిస్తూ, వచ్చే ఏడాది జరగనున్న శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ విద్యార్థుల అచ్చు పుస్తకాల (Text Books) అంశాన్ని రాజకీయం చేయాలనుకుంటోందని దుయ్యబట్టారు. 


కాంగ్రెస్, సిద్ధరామయ్యలకు చింకి చెడ్డీలు

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ, సిద్ధరామయ్య చెడ్డీ, కాంగ్రెస్ పార్టీ చెడ్డీ ఇప్పటికే పాడైపోయాయన్నారు. వాళ్ళకి చింకి చెడ్డీలు ఉన్నాయన్నారు. అందుకే వాళ్ళు చెడ్డీలను కాల్చడానికి నిర్ణయించుకున్నారని దుయ్యబట్టారు. వాళ్ళ చెడ్డీ ఉత్తర ప్రదేశ్‌లో పోయిందన్నారు. సిద్ధరామయ్య చెడ్డీ, లుంగీ చాముండేశ్వరిలో పోయాయని వ్యాఖ్యానించారు. 


ముందుగా అనుమతి కోరండి

బీజేపీ నేత చలవాడి నారాయణ స్వామి మాట్లాడుతూ, చెడ్డీలను తగులబెట్టడం వల్ల గాలి కలుషితమవుతుందని, ముందుగా కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి పొందాలని సిద్ధరామయ్యకు సలహా ఇచ్చారు. ఆయనకు చెడ్డీలు పంపించాలని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులందరినీ తాను కోరానని చెప్పారు. చెడ్డీలను కాల్చాలనుకుంటే ఆయన తన ఇంట్లో కాల్చుకోవచ్చునన్నారు. ఆయన ఈ స్థాయికి దిగజారుతారని తాను ఎన్నడూ అనుకోలేదన్నారు. 


ప్రతి ఇంటి నుంచి చెడ్డీలు

ఇదిలావుండగా, మాండ్య జిల్లా, కేఆర్ పేటలోని ఆరెస్సెస్ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి, నిక్కర్లను సేకరించారు. వాటిని బెంగళూరులోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి పంపించారు. తాము పెద్ద సంఖ్యలో ఖాకీ నిక్కర్లను పంపిస్తున్నామని, సిద్ధరామయ్య వాటిని తగులబెట్టలేరని అన్నారు. 


Updated Date - 2022-06-07T21:23:43+05:30 IST