అదాన్‌ డిస్టిలరీ ఎవరిది..?

ABN , First Publish Date - 2022-09-08T08:19:36+05:30 IST

‘అదాన్‌ డిస్టిలరీ ఎవరిది? బొలారం శివకుమార్‌ ఎవరు? ఏ ప్రాతిపదికన ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ అదాన్‌ డిస్టిలరీ నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తోంది?’’ అని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నల వర్షం కురిపించారు.

అదాన్‌ డిస్టిలరీ ఎవరిది..?

ఏ ప్రాతిపదికన దాని నుంచి మద్యం కొనుగోలు చేస్తున్నారు?

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఏపీ ప్రముఖులు

వైసీపీ ఎంపీ రఘురామ వ్యాఖ్యలు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 7(ఆంఽధ్రజ్యోతి): ‘‘అదాన్‌ డిస్టిలరీ ఎవరిది? బొలారం శివకుమార్‌ ఎవరు? ఏ ప్రాతిపదికన ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ అదాన్‌ డిస్టిలరీ నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తోంది?’’ అని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు.. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఏపీ ప్రముఖులు కూడా ఉన్నారని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అదాన్‌ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న మద్యం నాణ్యత ఏ పాటిదో తనతో పాటు, ఇప్పటికే టీడీపీ నాయకత్వం కూడా నివేదికలను ప్రజల ముందు ఉంచినట్టు చెప్పారు. అయినప్పటికీ.. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ భారీ మొత్తంలో మద్యం సరఫరాకు ఆర్డర్‌ ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అమ్మకాల్లో అవినీతి, కుంభకోణంపై కూడా విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాయబోతున్నానన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, నగదు లావాదేవీల వ్యవహారంపై, అదాన్‌ డిస్టిలరీ్‌సకు ఏ ప్రాతిపదికన మద్యం ఆర్డర్లు ఇస్తున్నారన్న దానిపై కేంద్రం సమగ్ర విచారణ జరిపించి, నిజాలను నిగ్గు తేల్చాలన్నారు.  


రూ.లక్ష పెట్టుబడితో 

2019లో రూ.లక్ష పెట్టుబడితో అదాన్‌ డిస్టిలరీ్‌సను శరత్‌ చంద్రారెడ్డి, రోహిత్‌రెడ్డి కలిసి ప్రారంభించారని రఘురామ తెలిపారు. రోహిత్‌ రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడని, అయితే, అదాన్‌ డిస్టిలరీస్‌ డైరెక్టర్లుగా పేర్కొన్న శ్రీనివాస్‌, బొలారం శివకుమార్‌ ఎవరికీ తెలియదన్నారు. మియాపూర్‌లోని అరబిందో ఫార్మా కంపెనీ ప్రధాన కార్యాలయం అడ్ర్‌సను, అదాన్‌ కంపెనీ చిరునామాగా పేర్కొన్నారని వెల్లడించారు. అదాన్‌ యజమానులు చిన్న చిన్న డిస్టలరీ యజమానులను బెదిరించి వారి డిస్టలరీలను లీజు తీసుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు స్వయంగా డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారని పదే పదే చెప్పే తమ ప్రభుత్వ పెద్దలు ఆ డిస్టిలరీల లైసెన్సు రద్దు చేయవచ్చు కదా? అని రఘురామ ప్రశ్నించారు. ఎస్పీవై రెడ్డికి చెందిన డిస్టిలరీని ప్రస్తుతం ఎవరు లీజుకు తీసుకున్నారని, దాని నిర్వాహకులు ఎవరు అని ప్రశ్నించారు. ఆ డిస్టిలరీ నిర్వహణ వెనుక చిత్తూరుకు చెందిన రెడ్డి నేతలు, చెన్నైకి చెందిన అదే సామాజిక వర్గ వ్యక్తుల ప్రమేయం లేదా అని నిలదీశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో 108 షాపులకు రోజుకు రూ.2.75 లక్షల చొప్పున ట్రైడెంట్‌ కెమ్‌ ఫామ్‌, సత్యా కెమ్‌ ఫామ్‌లు రూ.200 కోట్ల  మేర బ్యాంకు గ్యారంటీ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

  

న్యూడ్‌ వీడియోపై విచారణ చేయండి

32 రోజుల తర్వాత ఎంపీ గోరంట్ల మాధవ్‌ తనకు అవమానం జరిగినట్టు, తనది కానిది... తనదిగా వీడియో చూపిస్తూ ప్రచారం చేశారని సీఐడీకి ఫిర్యాదు చేశారని, దీనిపై ప్రాథమిక విచారణ కూడా జరపకుండా సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ ఎఫ్‌ఐఆర్‌ ఎలా నమోదు చేశారని రఘురామ ప్రశ్నించారు. తన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగిందని చెబుతున్న మాధవ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించి పరువు నష్టం దావా వేయవచ్చునని సూచించారు. కానీ మాధవ్‌ మాత్రం క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోరడం, దానికి పీవీ సునీల్‌ కుమార్‌... 153 ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో మార్ఫింగ్‌ చేశారా? లేదా అన్నదానిపై ముందు నిర్ధారణకు రావాలని సూచించారు.

Updated Date - 2022-09-08T08:19:36+05:30 IST