Al-Qaeda Next Chief : అయ్‌మన్ అల్-జవహిరి తర్వాత ఎవరు?

ABN , First Publish Date - 2022-08-02T20:42:00+05:30 IST

అత్యంత కిరాతక ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా చీఫ్ అయ్‌మన్ అల్-జవహిరి

Al-Qaeda Next Chief : అయ్‌మన్ అల్-జవహిరి తర్వాత ఎవరు?

న్యూఢిల్లీ : అత్యంత కిరాతక ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా చీఫ్ అయ్‌మన్ అల్-జవహిరి (Ayman al-Zawahiri) అంతమైన తర్వాత అతని స్థానంలో ఎవరు రాబోతున్నారనే అంశంపై చర్చ జరుగుతోంది. వేల మందిని పొట్టనబెట్టుకున్న ఈ సంస్థకు తదుపరి నాయకుడిగా బాద్యతలను చేపట్టేందుకు నలుగురు సీనియర్ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జవహిరి వారసుని ఎంపిక ఏవిధంగా జరుగుతుందో ఇంకా తెలియడం లేదు. 


అల్‌ఖైదా ఇన్ ది ఇస్లామిక్ మఘ్రెబ్ (AQIM)కు చెందిన సైఫ్ అల్-అడెల్ (Saif al-Adel), అబ్దల్-రహమాన్ అల్-మఘ్రెబి (Abdal-Rahman al-Maghrebi), యాజిడ్ మెబ్రాక్ (Yazid Mebrak); అల్-షబాబా (Al-Shabaab) ఉగ్రవాద సంస్థకు చెందిన అహ్మద్ దిరియే (Ahmed Diriye) సీనియర్ ఉగ్రవాదులని తెలుస్తోంది. డ్రోన్ దాడిలో హతుడైన అయ్‌మన్ అల్-జవహిరికి వారసుని ఎంపిక కోసం వీరి పేర్లను పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


జూలై 15న ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ఇచ్చిన నివేదిక ప్రకారం, అల్-జవహిరికి ఇతరులతో సంభాషించి, తనకు అనుకూలంగా మార్చుకోగలిగే సామర్థ్యం ఉంది, దీంతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం అతనికి మరింత బలాన్ని ఇచ్చింది. మరోవైపు అల్-ఖైదా అనుబంధ సంస్థలు, మిత్ర సంస్థలు తమ తమ ప్రాంతాల్లో బలపడటం కూడా అతనికి మరింత కలిసొచ్చింది. 


ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లోని తన సురక్షిత స్థావరం నుంచి ప్రపంచానికి తక్షణ ముప్పు కలిగించే ఉగ్రవాద సంస్థగా అల్-ఖైదాను చూడటం లేదు. దీనికి కారణాలు ఏమిటంటే, ఈ సంస్థకు ఇతర ప్రాంతాల్లో కార్యకలాపాలను నిర్వహించే సత్తా లేకపోవడం, అంతర్జాతీయంగా తాలిబన్లకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆ సంస్థ కోరుకోవడం అని చెప్తున్నారు. 


మరోవైపు అంతర్జాతీయ జీహాద్‌కు తానే నాయకత్వం వహిస్తున్నట్లు గుర్తింపు పొందాలని అల్-ఖైదా భావిస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉన్నాయి. తాలిబన్లకు సలహాదారు పాత్రను పోషించాలని అల్‌ఖైదా నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సమాచారం. 


తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్థాన్‌లో అల్‌ఖైదా చాలా స్వేచ్ఛను అనుభవిస్తోంది. అయితే సలహాలివ్వడం, మద్దతివ్వడం వరకు మాత్రమే తన పాత్రను పరిమితం చేసుకుంటోంది. అల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS) ఉగ్రవాద సంస్థలో దాదాపు 400 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. 


అయ్‌మన్ అల్ జవహిరి(Ayman al-Zawahiri) అమెరికా డ్రోన్ దాడిలో (drone strike)హతమయ్యాడు. ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)లో అమెరికా సైన్యం జరిపిన డ్రోన్ దాడిలో జవహరీ మరణించాడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. 2011వ సంవత్సరంలో అల్-ఖైదా(Al Qaeda) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్(Osama Bin Laden) హత్య తర్వాత ఆఉగ్రవాద సంస్థ అగ్ర నేత జవహిరిని అమెరికా హతమార్చింది. 


Updated Date - 2022-08-02T20:42:00+05:30 IST