మాకు ఆ అధికారం లేదు

ABN , First Publish Date - 2022-04-10T07:56:09+05:30 IST

ఎన్నికల సమయంలో ఉచిత బహుమతుల హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నియంత్రించడం సాధ్యం కాదని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది.

మాకు ఆ అధికారం లేదు

ఎన్నికల్లో ‘ఉచిత’ హామీలు ఇవ్వకుండా 

రాజకీయ పార్టీలను నియంత్రించలేం

దీనిపై ఓటర్లే నిర్ణయించుకోవాలి 

పార్టీల గుర్తింపును రద్దు చేయలేం 

సుప్రీంకోర్టులో ఈసీఐ అఫిడవిట్‌ దాఖలు 


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: ఎన్నికల సమయంలో ఉచిత బహుమతుల హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నియంత్రించడం సాధ్యం కాదని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. చట్టంలోని నిబంధనలు అనుమతించకుండా ఈ విషయంలో తీసుకొనే ఏ చర్య అయినా అధికారాలను అతిక్రమించడమే అవుతుందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో శనివారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఉచితాలను ప్రకటించే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది, బీజేపీ నేత అశ్వనీ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిల్‌పై ఈసీ స్పందించింది. ఎన్నికలకు ముందు లేదా తర్వాత ఓటర్లకు ఉచిత బహుమతులు పంపిణీ చేయడం సంబంధిత పార్టీ విధాన నిర్ణయమని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు గెలిచిన పార్టీ తీసుకొనే నిర్ణయాలను ఈసీ నియంత్రించదని పేర్కొంది. ఈ విషయంలో రాజకీయ పార్టీలకు తగిన మార్గదర్శకాలను కోర్టు రూపొందించవచ్చని, వాటిని ఈసీ అమలు చేయబోదని తెలిపింది. అటువంటి విధానాలు ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నాయా లేక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతాయా అనేది ఆ రాష్ట్ర ఓటర్లే నిర్ణయించుకోవాలని స్పష్టం చేసింది. ఎన్నికల సంస్కరణలపై 2016 డిసెంబరులో 47 ప్రతిపాదనలను కేంద్రానికి పంపామని, అందులో రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం గురించి కూడా వివరించినట్లు ఈసీ పేర్కొంది. దీనిపై కేంద్ర న్యాయశాఖకూ సిఫారసులు చేసినట్లు వెల్లడించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి పార్టీల గుర్తింపును రద్దుచేసే అధికారం ఈసీకి లేదని 2002లో సుప్రీం తీర్పు చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రస్తుత పిటిషన్‌కు ఆ సందర్భాలేవీ వర్తించవని తెలిపింది. కాగా, ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని కేంద్రాన్ని, ఈసీని ఆదేశిస్తూ సుప్రీం జనవరిలో నోటీసులు జారీ చేసింది. ఓటర్లకు ఉచిత బహుమతులిస్తామని పార్టీలు ఇస్తున్న హామీలపై బెంచ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని తీవ్రమైన సమస్యగా పేర్కొన్న కోర్టు... ఈ ‘ఉచితాల బడ్జెట్‌’ సాధారణ బడ్జెట్‌ను మించిపోతోందని వ్యాఖ్యానించింది.


Updated Date - 2022-04-10T07:56:09+05:30 IST