Viral Video: ఎమ్మెల్యేను కొట్టిన భర్త...

ABN , First Publish Date - 2022-09-03T01:04:39+05:30 IST

చండీగఢ్: పంజాబ్‌ ఎమ్మెల్యే బాజిందర్ కౌర్‌ను ఆమె భర్త సుఖ్‌రాజ్ సింగ్ చెంపదెబ్బ కొట్టారు. అది కూడా ఆమె నివాసంలోనే.

Viral Video: ఎమ్మెల్యేను కొట్టిన భర్త...

చండీగఢ్: పంజాబ్‌ ఎమ్మెల్యే బాజిందర్ కౌర్‌ను ఆమె భర్త సుఖ్‌రాజ్ సింగ్ చెంపదెబ్బ కొట్టారు. అది కూడా ఆమె నివాసంలోనే. బంధువులంతా చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. సమయానికి మిగతా బంధువులు ఆపడం వల్ల గొడవ సద్దుమణిగింది. లేకపోతే గొడవ మరింత ముదిరేది. తొలుత వాగ్వాదం జరిగింది. మాటామాట పెరిగాక సహనం కోల్పోయిన సుఖ్‌రాజ్ సింగ్ తన భార్యపై చేయిచేసుకున్నారు. ఆ తర్వాత బంధువులు ఆయన్ను దూరంగా తీసుకెళ్లారు. ఈ తతంగమంతా సీసీటీవీలో రికార్డయింది. వీడియో వైరల్ అయింది.  దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 






దీన్ని సుమోటోగా స్వీకరించిన పంజాబ్ మహిళా కమిషన్ నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. అయితే బాజిందర్ కౌర్‌ మాత్రం భర్తపై ఫిర్యాదు చేయలేదు. 


ఎమ్మెల్యేను కొట్టిన ఆమె భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ కేంద్ర మంత్రి హ‌ర్‌సిమ్ర‌త్ కౌర్ బాద‌ల్ డిమాండ్ చేశారు. బాజిందర్ కౌర్‌ భర్త సుఖ్‌రాజ్ సింగ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని హ‌ర్‌సిమ్ర‌త్ డిమాండ్ చేశారు. 


పంజాబ్‌ లోని తాల్వాండి సాబో నియోజకవర్గం నుంచి బాజిందర్ కౌర్‌ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గెలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగానికి ఆమె అధ్యక్షురాలు కూడా. రాజకీయాల్లోకి రాకముందు బాజిందర్ కౌర్‌ ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 





Updated Date - 2022-09-03T01:04:39+05:30 IST