Video call: వీడియో కాల్‌లో డాక్టర్‌ సూచన.. మహిళకు నర్సుల ప్రసవం

ABN , First Publish Date - 2022-09-21T16:56:16+05:30 IST

చెంగల్పట్టు జిల్లా మధురాంతం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళకు ముగ్గురు నర్సులు వీడియోకాల్‌(Video call) ద్వారా డాక్టర్‌ చేసిన

Video call: వీడియో కాల్‌లో డాక్టర్‌ సూచన.. మహిళకు నర్సుల ప్రసవం

- మృత శిశువు జననం 

- స్థానికుల ధర్నా


చెన్నై, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): చెంగల్పట్టు జిల్లా మధురాంతం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళకు ముగ్గురు నర్సులు వీడియోకాల్‌(Video call) ద్వారా డాక్టర్‌ చేసిన సూచనల ప్రకారం ప్రసవం చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. నర్సులు అరకొరగా ప్రసవం చేయడంతో ఆ మహిళకు మృత శిశువు జన్మించింది.ఈసంఘటనకు నిరసగా మహిళ కుటుంబీకులు, స్థానికులు ధర్నా రాస్తారోకోకు దిగారు. ఇల్లీడు ప్రభుత్వ ఆస్పత్రికి కొద్ది రోజులక్రితం పుష్పా అనే గర్భిణ వైద్యపరీక్షలకు  వెళ్ళింది. ఆమెకు పురుటి నొప్పులురాకపోవడంతో నొప్పులు వచ్చినప్పుడు ఆసుపత్రి(Hospital)కి రమ్మన్నారు. ఆ మేరకు సోమవారం ఆమెకు నొప్పులు అధికం కావటంతో ఆ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్లు ఎవరూ లేరు. ముగ్గురు నర్సులు మాత్రమే డ్యూటీలో ఉన్నారు. పురుటి నొప్పులతో బాధపడుతున్న పుష్పకు తామే పురుడు పోయాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్‌ ఫోన్‌ చేసి విషయం తెలిపారు. ఆ డాక్టర్‌ వీడియో కాల్‌ చేసి ప్రసవం ఎలా చేయాలో వివరిస్తుండగా ముగ్గురు నర్సులు కలిసి పుష్పాకు ప్రసవం చేస్తుండగా గర్భంలోని శిశువు అడ్డం తిరిగింది. శిశువు కాళ్లు మాత్రమే వెలుపలకి వచ్చాయి. ఆ తర్వాత ఏం చేయాలో తోచక నర్సులు ఇబ్బంది పడ్డారు. వీడియో కాల్‌లో ఉన్న డాక్టర్‌ సలహా మేరకు ఆమెను మధురాంతకం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో పుష్పాకు మృత శిశువు జన్మించింది. ఈ విషయం తెలుసుకుని ఆగ్రహం చెందిన ఆమె కుటుంబీకులు, స్థానిక ప్రజలు ఇల్లీడు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పురుటి నొప్పులతో బాధపడుతున్న పుష్పాను కాపాడేందుకు రాకుండా వీడియో కాల్‌ ద్వారా నర్సులకు సూచనలిచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.ఈధర్నా కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - 2022-09-21T16:56:16+05:30 IST