బహుముఖ ప్రజ్ఞాశాలి Karuna

ABN , First Publish Date - 2022-05-29T14:28:16+05:30 IST

పేదలు, వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి విశేషమైన కృషి చేశారని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

బహుముఖ ప్రజ్ఞాశాలి Karuna

- పేదల సాధికారత కోసం కృషి చేసిన నేత

- ఓమందూరార్‌ ఎస్టేట్‌లో ‘కలైంజర్‌’ విగ్రహావిష్కరణ

- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు


చెన్నై: పేదలు, వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి విశేషమైన కృషి చేశారని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శ్లాఘించారు. భారతదేశం చూసిన చురుకైన, ప్రజారంజక ముఖ్యమంత్రుల్లో ఆయన ఒకరని గుర్తు చేసుకున్నారు. స్థానిక ఓమందూరార్‌ ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన కరుణానిధి విగ్రహాన్ని శనివారం సాయంత్రం ఉపరాష్ట్రపతి లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలైవానర్‌ అరంగంలో జరిగిన సభలో వెంకయ్య మాట్లాడుతూ... తమిళనాడులో పారిశ్రామిక ప్రగతి, సమాచార, సాంకేతిక విప్లవానికి అవసరమైన మౌలిక వసతుల కల్పలో కీలకపాత్ర పోషించారన్నారు. దశాబ్దాలుగా కరుణానిధితో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ సిద్ధాంతం విషయంలో కరుణానిధి నిబద్ధతతో వున్నారన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా విధించిన అత్యయిక పరిస్థితులను కరుణ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కరుణానిధి దాదాపు 50 ఏళ్లపాటు తాను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ గెలిచారన్నారు. తన వాక్చాతుర్యం, చక్కటి పద ప్రయోగంతో శ్రోతలను కట్టి పడేసే ప్రసంగాలెన్నో కలైంజర్‌ చేశారన్నారు.  సాంస్కృతిక, కళాత్మకత కలిగిన కళాకారుడిగా, పాత్రికేయుడిగా, విమర్శకుడిగా ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ ప్రజల గుండెల్లో ‘కలైంజర్‌’గా గుర్తింపు పొందారని, తమకున్న అనుభవంతో తమిళనాడు సమగ్రాభివృద్ధికి బాటలు వేశారన్నారు. మాతృదేశంతో పాటు మాతృభాషపై ఎంతో ప్రేమాభిమానాలున్న అలాంటి వ్యక్తిని యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కరుణానిధి తమిళ భాష సాహిత్యాలను ప్రోత్సహించారని, ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తమ భాషా సంస్కృతులను ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు. కరుణ మాటల్లో హ్యూమర్‌ (హాస్య చతురత), గ్రామర్‌ (విషయ పరిజ్ఞానం), గ్లామర్‌ (ఆకర్షణ) మూడు సమ్మిళితమై ఉంటాయని తెలిపారు. 1970లో ఆయన ప్రార్థనా గీతంగా గుర్తింపు తీసుకొచ్చిన ‘తమిళ్‌ తై వాళ్తు..’ ఆ తరువాత రాష్ట్ర గీతంగా ప్రఖ్యాతి సంపాదించుకుని, నేటికీ తమిళలకు స్ఫూర్తి రగిలిస్తోందన్నారు. నేటికీ తమిళనాడు అన్ని రంగాల్లో ప్రగతి పథంలో కేంద్రంతో కలిసి పని చేస్తూ సహకార సమాఖ్య స్ఫూర్తితో దూసుకుపోతోందన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలోనూ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషలో నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి.. ఒక భాషను బలవంతంగా రుద్దడం గానీ, దూరం చేయడం గానీ సరైన విధానాలు కావని తెలిపారు. కరుణలో తనకు నచ్చిన గుణం మాతృభాషను కాపాడుకునేందుకు ఉద్యమస్థాయిలో కృషి చేయడమేనని పేర్కొన్నారు.


నా జీవితంలో మధురమైన క్షణమిది: స్టాలిన్‌

రాష్ట్ర శ్రేయస్సు కోసం అలుపెరుగకుండా ప్రజా సేవ చేసి, రాష్ట్రాన్ని ఆకాశమంత ఎత్తుకు అభివృద్ధి పరచిన కరుణానిధి విగ్రహాన్ని ఆయనకు నచ్చిన ప్రదేశంలో ఆవిష్కరించడం తన జీవితంలో మరచిపోలేని మధురమైన క్షణమని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్టాలిన్‌ మాట్లాడుతూ... ఐదు దశాబ్దాలకుపైగా ప్రజలకు సేవలందించినందుకు కృతజ్ఞతా భావంతోనే ప్రభుత్వం తరఫున కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, అన్నాసాలైలో పెరియార్‌, అన్నాదురై విగ్రహాల నడుమ ఈ విగ్రహం పెట్టడం సమంజసంగా ఉందన్నారు.  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కరుణానిధికి, తనకు ఆత్మీయ మిత్రులన్నారు. అత్యుత్తమ పార్లమెంటేరియన్‌గా కీర్తిగడించి రాజ్యసభలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సమయాల్లో సభను సమర్థవంతంగా నడిపిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గతంలో కరుణానిధి అరెస్టయినప్పుడు అప్పటి రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌, ప్రధాని వాజ్‌పేయ్‌ ఫోన్‌ చేసి పరామర్శించారని, అప్పట్లో వెంకయ్యనాయుడు ఆ దుర్ఘటనపై తీవ్రంగా స్పందించి అప్పటి పాలకులు, పోలీసులు దురుసుగా వ్యహరించడాన్ని ఖండించారని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఉపరాష్ట్రపతికి జ్ఞాపిక బహూకరించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి కరుణానిధి కుటుంబీకులు, బీజేపీ, అన్నాడీఎంకే తప్ప అన్ని పార్టీల నేతలు, ప్రతినిధులు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తదితరులంతా హాజరయ్యారు.


Read more