ప్రైవేటు కళాశాలలో విధ్వంసకాండ

ABN , First Publish Date - 2022-07-18T17:10:05+05:30 IST

కళ్లకురిచి జిల్లా చిన్నసేలంలో మూడు రోజుల క్రితం జరిగిన ప్లస్‌-2 విద్యార్థిని అనుమానాస్పద మృతిపై న్యాయవిచారణ జరపాలంటూ ఆమె

ప్రైవేటు కళాశాలలో విధ్వంసకాండ

 కాలేజీ బస్సులు, పోలీసు వాహనం దహనం

 డీఐజీ సహా 30 మంది పోలీసులకు గాయాలు

చెన్నై: కళ్లకురిచి జిల్లా చిన్నసేలంలో మూడు రోజుల క్రితం జరిగిన ప్లస్‌-2 విద్యార్థిని అనుమానాస్పద మృతిపై న్యాయవిచారణ జరపాలంటూ ఆమె కుటుంబీకులు, స్థానికులు, కళాశాల విద్యార్థి సంఘాలు కలిసి ఆదివారం ఉదయం నిర్వహించిన ఆందోళన హింసాకాండకు దారి తీసింది. ఆందోళనకారులు రెచ్చిపోయి కళాశాలకు చెందిన 18 బస్సులు, మూడు వ్యాన్‌లకు, 50కి పైగా బైకులకు, పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. లాఠీ చార్జి జరిపేందుకు ప్రయత్నించిన పోలీసులపై ఆందోళనకారులు రాళ్ళురువ్వారు. ఈ సంఘటనలో డీఐజీ పాండ్యన్‌, ఉలుందూరుపేట డీఎస్పీ మహేష్‌, తిరుక్కోవిలూరు ఎక్సైజ్‌ విభాగం వరంజరం సీఐ ప్రభాకరన్‌  సహా 30 మందికి పైగా పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో చిన్నసేలం ప్రాంతంమంతటా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పటంతో ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. అదనపు పోలీసు బలగాలు మొహరించాయి.. చిన్న సేలం తాలూకాలో 144 నిషేధాజ్ఞలు విధించారు.


హింసాకాండకు సంబంధించి 30 మందిని అరెస్టు చేసినట్లు ఏడీజీపీ తామరైకన్నన్‌ తెలిపారు. కడలూరు జిల్లా పెరినెసలూరు గ్రామానికి చెందిన రామలింగం కుమార్తె శ్రీమతి (17) చిన్నసేలం సమీపంలోని ప్రైవేటు పాఠశాలలో హాస్టల్‌లో ఉంటూ ప్లస్‌-2 చదువుతోది. ఈ నేపథ్యంలో ఈ నెల 14 తేదీ శ్రీమతి హాస్టల్‌ భవనం మూడో అంతస్థుపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు, కుటుంబీకులు హుటాహుటిన కళాశాలకు చేరుకున్నారు. అదే సమయంలో పోలీసులు కూడా రంగంలోకి దిగి విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు  పంపారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మరుసటి పోస్టుమార్టం పూర్తికావటంతో శ్రీమతి మృతదేహాన్ని అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నించారు.


అయితే తమ కుమార్తె మృతిపై అనుమానాలున్నాయంటూ తల్లిదండ్రులు మృతదేహాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు.. తమ కుమార్తె మృతికి కారణమైనవారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థిని మృతిపై సీబీసీఐడీ విచారణ జరపాలని కోరుతూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్థానికులు, డీపీఐ కార్యకర్తలు,  భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య కార్యకర్తలు కళ్ళకుర్చి ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట శనివారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళన కారణంగా రెండుగంటలకు పైగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి.  


పోస్టుమార్టం నివేదిక...

ఇదిలా ఉండగా శ్రీమతి పోస్టుమార్టం నివేదికలో ఆమె వంటిపై తీవ్రగాయాలున్నాయని, మృతి చెందటానికి ముందే ఆ గాయాలు ఏర్పడ్డాయని, ముక్కు, కుడిభుజం, కుడిచేయి, కడుపుపైభాగన గాయాలు, దుస్తులలో రక్తపు మరకలు ఉన్నాయి పేర్కొన్నారు. అధిక రక్తస్రావం దిగ్ర్భాంతి కారణంగా మృతి చెందినట్లు ఆ నివేదికలో తెలిపారు. ఫోరెన్సిక్‌ నివేదిక వెలువడిన తర్వాతే ఆమె మృతికి వాస్తవమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.


రాస్తారోకోలో విధ్వంసం...

ఈ నేపథ్యంలో విద్యార్థిని అనుమానాస్పద మృతిపై న్యాయవిచారణ జరపాలని కోరుతూ ఆదివారం ఉదయం చిన్నసేలం వద్దనున్న ప్రైవేటు కళాశాల ఎదుట రహదారిలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆ సమయంలో  ఆందోళనకారులు హఠాత్తుగా పోలీసులపై రాళ్ళురువ్వి దాడికి దిగారు. వ్యాన్‌లో నుంచి దిగిన పోలీసులపై కూడా రాళ్ళ వర్షం కురిపించారు. ఆ తర్వాత ఆందోళనకారులు పోలీసు వ్యాన్‌కు నిప్పంటించి, కళాశాల ప్రవేశద్వారం పగులగొట్టి లోపలకు వెళ్ళి కళాశాల బస్సులకు, అక్కడే నిలిపివుంచిన బైకులు, స్కూటర్లకు నిప్పంటించడంతో ఆ ప్రాంతమంతటా దట్టమైన పొగలు అలముకున్నాయి. అదే సమయంలో కొందరు ఆందోళనకారులు ట్రాక్టర్‌తో ఢీకొట్టించి కళాశాల బస్సులను పూర్తిగా ఽ ధ్వంసం చేశారు. కళాశాల గదుల్లోని వస్తువులన్నింటిని ధ్వంసం చేశారు. ఓ గదిని పెట్రోలు పోసి తగులబెట్టారు. కళాశాల ఎదుట పోలీసులు అడ్డుగా నిలిపి ఉంచిన ఇనుప బారికేడ్లను సైతం ఆందోళనకారులు తొలగించి వాటిని కూడా ధ్వంసం చేశారు. చివరకు పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తుపాకులతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులపై లాఠీ ఛార్జి జరిపారు. ఆదివారం సాయంత్రం వరకూ ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.


అదనపు పోలీసు దళాలను మొహరించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు హింసను విడనాడకుంటే కఠిన చర్యలు చేపడతామంటూ డీఐజీ పాండ్యన్‌ హెచ్చరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే నిమిత్తం కళ్ళకుర్చి తాలూకాలో 144వ నిషేధాజ్ఞలు విధించినట్లు ఆయన తెలిపారు. అదే సమయంలో ఏడీజీపీ తామరైకన్ననన్‌ నాయకత్వంలో 500 మంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేస్తున్నారు.


శాంతించండి: సీఎం  

కళ్ళకుర్చిలో విద్యార్థిని మృతిపై జరుగుతున్న ఆందోళనను విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు.. ఈ మేరకు తన ట్విట్టర్‌ పేజీలో ఓ సందేశం వెలువరిస్తూ కళ్లకురిచిలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలు తనకెంతో బాధను కలిగిస్తోందని, విద్యార్థిని మృతిపై పోలీసులు జరుపుతున్న విచారణ పూర్తయితే నేరస్థులను తప్పకుండా శిక్షిస్తామన్నారు. ఈ సంఘటన గురించి తెలియగానే పరిస్థితిని కట్టడి చేసేందుకు హోంశాఖ కార్యదర్శి ఫణీందర్‌రెడ్డి, డీజీపీ శైలేంద్రబాబును కళ్ళకుర్చికి వెళ్ళమంటూ ఉత్తర్వు కూడా జారీ చేశానని తెలిపారు. తమ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఆందోళనకారులు హింసను విడనాడి శాంతించాలని స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు.


 మృతిపై సీబీసీఐడీ విచారణ: డీజీపీ  

  ప్రైవేటు పాఠశాల విద్యార్థిని శ్రీమతి మృతిపై సీబీసీఐడీ విచారణ జరుపనున్నట్లు డీజీపీ శైలేంద్రబాబు ప్రకటించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశం మేరకు హింసాకాండ జరిగిన చిన్నసేలం ప్రైవేటు స్కూల్‌ ప్రాంతాన్ని డీజీపీ సందర్శించారు. స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థిని మృతి కేసును సీబీసీఐడీకి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా తన కుమార్తె మృతి పై సీబీసీఐడీ విచారణకు ఆదేశించాలని కోరుతూ శ్రీమతి తండ్రి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో డీజీపీ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇదిలా ఉండటగా కళ్ళకుర్చి వద్ద హింసకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. విద్యార్థి సంఘాలు, స్థానిక ప్రజలు శాంతియుతంగా రాస్తారోకో నిర్వహిస్తామని పోలీసులనుంచి అనుమతి తీసుకున్నారని, ఆందోళనకు సుమారు మూడువందల మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారని, అయితే ఆందోళకారులు హింసాకాండ జరపాలని ముందుగానే పథకం వేసుకున్నట్లు జరిగిన సంఘటనలను బట్టి రుజువవుతోందన్నారు. హింసాకాండకు సంబంధించిన వీడియో దృశ్యాల ఆధారంగా హింసకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2022-07-18T17:10:05+05:30 IST