సైనిక దళాలను ఉపయోగించడం కాలం చెల్లిన విధానం : దలైలామా

ABN , First Publish Date - 2022-07-15T19:02:11+05:30 IST

భారత్-చైనా మధ్య సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని

సైనిక దళాలను ఉపయోగించడం కాలం చెల్లిన విధానం : దలైలామా

న్యూఢిల్లీ : భారత్-చైనా మధ్య సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా పిలుపునిచ్చారు. అత్యధిక జనాభాగల ఈ రెండు ఇరుగు పొరుగు దేశాలు తూర్పు లడఖ్‌లో దళాల ఉపసంహరణ, ప్రతిష్టంభన తొలగింపు కోసం చర్చలకు కట్టుబడి ఉండాలన్నారు. చర్చలు, శాంతియుత మార్గాల్లో ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. సైనిక దళాలను ఉపయోగించడం కాలం చెల్లిన విధానమని తెలిపారు. లేహ్‌లో పర్యటించేందుకు వెళ్తూ ఆయన జమ్మూలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. 


దలైలామా (Dalai Lama) దాదాపు ఓ నెల రోజులు లడఖ్‌లో పర్యటిస్తారు. ఆయన లడఖ్ (Ladakh) పర్యటన చైనాకు మరింత ఆగ్రహం తెప్పిస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే తూర్పు లడఖ్‌లోని చాలా ఘర్షణ ప్రాంతాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరు దేశాల దళాలు మోహరించి ఉన్నాయి. 


దలైలామా వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చైనా (China) ఆరోపిస్తోంది. అయితే తాను స్వాతంత్ర్యం కోరడం లేదని, మిడిల్‌-వే అప్రోచ్ క్రింద  టిబెట్‌లోని మూడు సంప్రదాయ ప్రావిన్సులలో నివసిస్తున్న టిబెటన్లందరికీ  అసలైన స్వయంప్రతిపత్తిని కోరుతున్నానని దలైలామా చెప్పారు. 


కొందరు చైనా అతివాదులు తనను వేర్పాటువాది అని, విప్లవకారుడని అంటున్నారని, తనను ఎల్లప్పుడూ విమర్శిస్తున్నారని దలైలామా చెప్పారు. అయితే తాను స్వాతంత్ర్యాన్ని కోరడం లేదని, కేవలం టిబెట్‌కు అర్థవంతమైన స్వయంప్రతిపత్తిని కల్పించాలని, టిబెటన్ బౌద్ధ సంస్కృతిని కాపాడాలని  మాత్రమే తాను కోరుతున్నట్లు ఎక్కువ మంది చైనీయులకు అర్థమైందన్నారు. 


దలైలామా లడఖ్ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించినపుడు ఆయన స్పందిస్తూ, ఇది సాధారణ విషయమేనని చెప్పారు. చైనా ప్రజలు తన పర్యటన పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. టిబెటన్ బౌద్ధం (Tibetan Budhism) పట్ల మరింత మంది చైనీయులు ఆసక్తి చూపుతున్నారన్నారు. కొందరు చైనా స్కాలర్లు కూడా టిబెటన్ బౌద్ధం చాలా శాస్త్రీయమైనదని తెలుసుకుంటున్నారని చెప్పారు. పరిస్థితులు మారుతున్నాయన్నారు. 


టిబెట్ స్వాతంత్ర్యం కోసం దలైలామా పోరాడుతున్నారు. ఆయనకు 1989లో నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) వచ్చింది. ఇటీవల దలైలామా 87వ జన్మదినోత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. దీంతో మోదీపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి టిబెట్ సంబంధిత అంశాలను ఉపయోగించుకోవడం మానుకోవాలని భారత దేశానికి హితవు పలికింది. చైనా విమర్శలను భారత దేశం తిప్పికొట్టింది. దలైలామా భారత దేశపు గౌరవ అతిథి అని, ఇది తమ స్థిరమైన విధానమని తెలిపింది. 


Read more