Nancy Pelosi Taiwan tour: హమ్మయ్య.. గండం గడిచింది.. ముగిసిన పెలోసీ తైవాన్ టూర్

ABN , First Publish Date - 2022-08-03T23:52:24+05:30 IST

తైపీ: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి (US House of Representatives Speaker Nancy Pelosi) తైవాన్‌ (Taiwan)ఒకరోజు పర్యటన ముగిసింది. ఆమె తైపీ (Taipei)లో అడుగుపెట్టగానే నిప్పుతో చెలగాటమాడవద్దనడమే

Nancy Pelosi Taiwan tour: హమ్మయ్య.. గండం గడిచింది.. ముగిసిన పెలోసీ తైవాన్ టూర్

తైపీ: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి (US House of Representatives Speaker Nancy Pelosi) తైవాన్‌ (Taiwan)ఒకరోజు పర్యటన ముగిసింది. ఆమె తైపీ (Taipei)లో అడుగుపెట్టగానే నిప్పుతో చెలగాటమాడవద్దనడమే కాక తీవ్ర పరిణామాలు తప్పవని చైనా (China) అమెరికా (America) ను హెచ్చరించింది. తన అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ద్వారా ఫైనల్ వార్నింగ్ అని హెచ్చరిక కూడా పంపింది. చైనా సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికాను హెచ్చరించింది. ఒక్కసారిగా ఏదో జరగరానిది జరిగిపోయిందన్నట్లుగా యుద్ధ వాతావరణం సృష్టించింది. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చనే సంకేతాలను డ్రాగన్.. ప్రపంచానికి పంపింది. తైవాన్ గగనతలంలోకి తన యుద్ధ విమానాలను పంపడం ద్వారా, తైవాన్‌కు నలుదిక్కులా యుద్ధ విన్యాసాలు చేయడం ద్వారా చైనా.. అలజడిని పతాక స్థాయికి తీసుకెళ్లింది. 


మరోవైపు చైనా ఇంత హడావుడి చేస్తున్నా, అరిచి గోల పెడుతున్నా... 82 ఏళ్ల పెలోసి మాత్రం కూల్‌గా తన పర్యటన కొనసాగించారు. నిజానికి ఆమె వైట్‌హౌస్ అనుమతితో అధికారికంగా కాకుండా తన వ్యక్తిగత హోదాలో తైవాన్ వచ్చారు. ఆసియా పర్యటన పేరుతో వచ్చిన సింగపూర్, మలేషియాలో పర్యటించి సడన్‌గా తైవాన్ సందర్శించారు. పాతికేళ్లలో అమెరికాకు చెందిన అత్యున్నత స్థాయి అధికారి తైవాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో చైనాకు వణుకు పుట్టింది. 


మరోవైపు తైపీలో దిగగానే పెలోసీ ట్వీట్ చేశారు. నియంతృత్వం, ప్రజాస్వామ్యంలో ఏదో ఒక దాన్ని ప్రపంచం తేల్చుకోవాల్సి ఉంటుందని ఆమె ట్వీట్‌లో తెలిపారు. 


ఆ తర్వాత పెలోసీ తైవాన్ అధ్యక్ష భవనాన్ని సందర్శించి అధినేత్రి త్సాయి యింగ్ వెన్‌తో సమావేశమయ్యారు. చర్చలు జరిపాక సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు దేశాల చట్ట సభల మధ్య సమన్వయం పెంచడం తన పర్యటన లక్ష్యమని చెప్పారు. ప్రపంచంలోని స్వేచ్ఛాయుత సమాజాల్లో ఒకటైన తైవాన్‌కు అమెరికా మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు. అంతేకాదు పనిలో పనిగా పెలోసి తియానెన్మెన్ స్క్వేర్ నరమేధాన్ని గుర్తు చేశారు. 


1989 జూన్ 4న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ బీజింగ్‌లోని తియానెన్మెన్ స్క్వేర్ వద్ద లక్షలాది మంది విద్యార్ధులు, కార్మికులు చేపట్టిన నిరసనను చైనా అత్యంత కిరాతకంగా అణచివేసింది. నాటి హింసాకాండలో వేలాది మంది అమాయక ప్రజలను చైనాయే పొట్టన పెట్టుకుంది. ఆ ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత పెలోసి చైనా సందర్శించి నాటి హింసలో చనిపోయిన వారికి నివాళులు కూడా అర్పించిన సంగతి గుర్తు చేశారు. 

వాస్తవానికి చైనా అధికార వర్గాల్లో మూడో స్థానంలో ఉండే పెలోసీకి చైనాకు బద్ద వ్యతిరేకి అనే పేరుంది. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై తీవ్రంగా విరుచుకుపడే మహిళా నాయకురాలిలా పేరుగాంచిన పెలోసి అంటే డ్రాగన్‌కు మంట. అందుకే ఆమె తైవాన్‌ టూర్‌ను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. అగ్గిమీద గుగ్గిలమైంది. యుద్ధం తప్పదనే సంకేతాలు ప్రపంచానికి పంపింది. అంతేకాదు తైవాన్ ఉత్పత్తులపై ఆంక్షలు కూడా విధించింది.   


నిజానికి చైనాతో అధికారిక సంబంధాలు కొనసాగిస్తున్న అమెరికా... తైవాన్‌ను ప్రత్యేక దేశంగా ఇప్పటివరకూ గుర్తించలేదు. వన్ చైనా పాలసీని గౌరవిస్తూనే తైవాన్‌తో సత్సంబంధాలను మాత్రం కొనసాగిస్తోంది. చైనా కూడా తైవాన్‌ను తమ అంతర్భాగంగా చెప్పుకుంటోంది. తైవాన్ స్వాతంత్ర్యం కోసం యత్నిస్తే సైనిక చర్య జరపడానికైనా సిద్ధమని చైనా గతంలోనే అధికారికంగా ప్రకటించింది. తైవాన్ స్వాతంత్ర్యం పేరిట అమెరికా ఎలాంటి చర్యలకు పాల్పడినా తిత్తి తీస్తామని చెైనా వార్నింగ్‌లపైన వార్నింగ్‌లు ఇస్తూ పోతోంది. ఇంతలో సడన్‌గా పెలోసీ తైవాన్‌లో పర్యటించడం డ్రాగన్‌ను కుదిపేసింది. అందుకే యుద్ధ విన్యాసాల వీడియోలను తమ అధికారిక మీడియాలో ప్రసారం చేస్తూ యుద్ధ వాతావరణం సృష్టించింది. 


చైనా గొంతు చించుకుని అరుస్తున్నా.... పెలోసి మాత్రం తన ఒక రోజు పర్యటన ముగించుకుని తాపీగా తైపీ నుంచి వెళ్లిపోయారు. పెలోసీ పర్యటన ఏ ఉత్పాతం జరగకుండా ముగియడంతో అమెరికా అధికారుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. చైనా అధికారులు కూడా గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. 

 


Updated Date - 2022-08-03T23:52:24+05:30 IST

Read more