‘సుప్రీం’ ఇక లైవ్‌ స్ట్రీమ్‌

ABN , First Publish Date - 2022-09-27T07:43:57+05:30 IST

సుప్రీంకోర్టు కార్యకలాపాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణలు జరుగుతుండగా, సాంకేతిక పరిజ్ఞానంలో ఇంకో ముందడుగు పడనుంది.

‘సుప్రీం’ ఇక లైవ్‌ స్ట్రీమ్‌

సొంతంగా ప్లాట్‌ఫారం ఏర్పాటు.. స్పష్టం చేసిన సీజేఐ బెంచ్‌


సమాచార హక్కు కోసం పోర్టల్‌ 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: సుప్రీంకోర్టు కార్యకలాపాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణలు జరుగుతుండగా, సాంకేతిక పరిజ్ఞానంలో ఇంకో ముందడుగు పడనుంది. కోర్టు కార్యకలాపాలు ఇకపై లైవ్‌ స్ట్రీమ్‌ కానున్నాయి. ఇందుకు ప్రత్యేకంగా సొంత ప్లాట్‌ఫారం ఏర్పాటుకానుంది. సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా సమాచార హక్కు పరిధిలోకి తీసుకురానుండడం మరో ముఖ్యమైన అంశం. ప్రస్తుతం కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాల కోసం యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని పేర్కొంటూ బీజేపీ మాజీ నాయకుడు కె.ఎన్‌.గోవిందాచార్య దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చింది. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ జె.బి.పార్డీవాలాల ధర్మాసనం పరిశీలించింది.


కోర్టు కార్యకలాపాలను ప్రైవేటు ప్లాట్‌ఫారం ద్వారా నిర్వహించడం సరికాదని గోవిందాచార్య తరఫు న్యాయవాది విరాగ్‌ గుప్తా వాదించారు. ఈ లైవ్‌స్ట్రీమ్‌పై ఆ సంస్థ కాపీరైట్‌ హక్కులను అడుగుతుందని చెప్పారు. 2018 నాటి ఓ తీర్పు ప్రకారం న్యాయస్థానాల్లో రికార్డయిన, ప్రసారమయిన మొత్తం సమాచారంపై కాపీరైట్‌ హక్కు కోర్టుకే ఉంటుందని గుర్తు చేశారు. యూట్యూబ్‌ నిబంధనల ప్రకారం ఆ సంస్థకు కూడా కాపీరైట్‌ కోరే హక్కు ఉందని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ యూట్యూబ్‌ను ఉపయోగించడం తాత్కాలిక ఏర్పాటేనని తెలిపింది. సొంత ప్లాటుఫారం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. కాపీరైట్‌పై తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే నెల 17కి వాయిదా వేసింది. రాజ్యాంగ ధర్మాసనాల విచారణలన్నీ మంగళవారం (సెప్టెంబరు 27) నుంచి లైవ్‌స్ట్రీమ్‌ చేయాలని ఈ నెల 20న సీజేఐ ఆధ్వర్యంలో ఫుల్‌కోర్టు ఏకగ్రీవంగా తీర్మానించింది. 2018లో వెలువరించిన తీర్పును అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకొంది. నాలుగేళ్లకు ఆ నిర్ణయం అమల్లోకి రానుంది.  జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పదవీ విరమణ చేసిన రోజైన ఆగస్టు 26న చరిత్రలో తొలిసారిగా కోర్టు కార్యకలాపాలను వెబ్‌కాస్ట్‌ చేయడం గమనార్హం.


పారదర్శకతపై యత్నాలు కొలిక్కి... 

పారదర్శకత ఉండేలా సుప్రీంకోర్టు వ్యవహారాలను సమాచార హక్కు (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సమాచార హక్కు పోర్టల్‌ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని ఇటీవల న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ కోర్టులోనే ప్రకటించారు. కోర్టు వ్యవహారాలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలంటూ ఏడేళ్ల క్రితం ప్రారంభమయిన ప్రయత్నాలు దీంతో కొలిక్కివచ్చినట్టయింది. మొదట్లో సుప్రీంకోర్టు ఇందుకు సుముఖత తెలపలేదు. 2015లో ముఖ్యమైన నిర్ణయాన్ని వెలువరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వివరాలను ఇతర వ్యవస్థలతో పంచుకోలేమని తెలిపింది. కానీ ప్రజాభిప్రాయాన్ని గమనించి కొలీజియం నిర్ణయాలను వెబ్‌సైట్‌లో పెట్టడం ప్రారంభించింది. 2019లో ఇచ్చిన మరో తీర్పులో ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. 

Read more