ఇద్దరు Jds ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు?

ABN , First Publish Date - 2022-06-12T16:39:49+05:30 IST

రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓట్లువేసిన తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై

ఇద్దరు Jds ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు?

                                        - దళపతుల సమాలోచన


బెంగళూరు, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓట్లువేసిన తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై బహిష్కరణవేటు వేయాలని జేడీఎస్‌ సూత్రప్రాయం గా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాజ్యసభ ఎన్నికల్లో ఎదురు దెబ్బతిన్న అనంతరం మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ శనివారం నగరంలోని తన నివాసంలో కొందరు ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. మాజీ సీఎం కుమారస్వామితో చర్చించిన తర్వాత ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కోలారు జేడీఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ, తుమకూరు జిల్లా గుబ్బి జేడీఎస్‌ ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ శ్రీనివాస్‌ పార్టీని వీడాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, ఇలాంటి వారిని పార్టీలో కొనసాగించడం అనవసరమని పలువురు నేతలు దేవెగౌడకు తెగేసి చెప్పినట్లు సమాచారం. జేడీఎస్‌ ఎమ్మెల్యేలను ముందస్తుగా రిసార్టుకు తీసుకెళ్లడం చాలా మేలు చేసిందని, లేనట్లయితే పార్టీలో చిన్నపాటి చీలిక సంభవించి ఉండేదని మరింత మంది క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి ఉండేవారని దళపతి దేవెగౌడకు ఈ నేతలు వివరించినట్లు తెలిసింది. పార్టీ చిహ్నంపై గెలుపొందిన ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో లక్ష్మణరేఖ దాటి తీరని ద్రోహం చేశారని తెలిపారు. దీనిపై ప్రజల్లోకి వెళ్లాలని ఈ రెండు నియోజకవర్గాలకు ఇప్పటి నుండే కొత్త అభ్యర్థులను సిద్ధం చేసి ప్రకటించాలని పలువురు నేతలు దళపతి దేవెగౌడకు సూచించగా ఆయన సమ్మతించినట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికల్లో జేడీఎ్‌సకే ఎదురు దెబ్బ తగిలి ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లు క్రాస్‌ అయిన సంగతి విదితమే.

Read more