Chandrasekhar Guruji హత్య కేసులో ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2022-07-06T00:19:07+05:30 IST

సరళ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ అంగడి అలియాస్ గురూజీ దారుణ హత్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను బెళగవి జిల్లాలో..

Chandrasekhar Guruji హత్య కేసులో ఇద్దరి అరెస్టు

హుబ్లి: సరళ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ అంగడి అలియాస్ గురూజీ దారుణ హత్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను బెళగవి జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరినీ చంద్రశేఖర్ గురూజీ వద్ద పనిచేసిన మాజీ ఉద్యోగులు మహానటేష్, మంజునాథ్‌గా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో  హుబ్లిలోని ప్రెసిడెంట్ హోటల్‌ లాబీలో ఇద్దరు వ్యక్తులు గురూజీ ఆశీస్సులు తీసుకుంటున్నట్టు నటిస్తూ కత్తితో దాడి చేశారు. పలుమార్లు కత్తితో పొడిచి అక్కడ్నించి పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్ నెట్‌వర్క్‌ను ట్రేస్ చేసి, వారిద్దరూ పరారవుతున్న కారును గుర్తించి రామదుర్గ వద్ద అదుపులోనికి తీసుకున్నారు. ఈ విషయాన్ని రామదుర్గ పోలీస్ కమిషనర్ ధ్రువీకరించారు. తదుపరి విచారణ కోసం వీరిని హుబ్లి తీసుకువెళ్తున్నారు. గురూజీ హత్యకు కారణం ఇంకా తెలియలేదని, దర్యాప్తు జరుపుతున్నామని కమిషనర్ తెలిపారు. అయితే, కొద్దిరోజులుగా నడుస్తున్న ఒక కమర్షియల్ వివాదమే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.


సీఎం ఖండన...

చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్యను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఖండించారు. ఇది అత్యంత నీచమైన చర్య అని, నిందితులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని హుబ్లి పోలీస్ కమిషనర్‌ను ఆయన ఆదేశించారు.

Updated Date - 2022-07-06T00:19:07+05:30 IST