రామ్‌నాథ్ కోవింద్‌కు మోదీ నమస్కరించ లేదా? ఇందులో నిజమెంత?

ABN , First Publish Date - 2022-07-26T01:16:55+05:30 IST

ఔట్ గోయింగ్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పార్లమెంటు ఆవరణలో ఆదివారం వీడ్కోలు చెబుతున్నప్పటి వీడియోను..

రామ్‌నాథ్ కోవింద్‌కు మోదీ నమస్కరించ లేదా? ఇందులో నిజమెంత?

న్యూఢిల్లీ: ఔట్ గోయింగ్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పార్లమెంటు ఆవరణలో ఆదివారం వీడ్కోలు చెబుతున్నప్పటి వీడియోను ఆమ్ ఆద్మీ  పార్టీ నేత సంజయ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. వీడియోలో రామ్‌నాథ్ కోవింద్‌కు మోదీ నమస్కారం పెట్టలేదని సంజయ్ సింగ్ చేసిన కామెంట్లపై బీజేపీ భగ్గుమంది. ఇది..అసలు వీడియోను కత్తిరించి, వక్రీకరించిన వీడియో అని చెప్పింది. దీనిపై ట్విట్టర్ సంస్థ అభ్యంతరం తెలిపింది. సందర్భానికి దూరంగా తీశారని (Out of context) వ్యాఖ్యానించింది.


అసలేం జరిగింది?

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారంనాడు షేర్ చేసిన వీడియో ప్రకారం, రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు సెంట్రల్ హాలులో తన వీడ్కోలు సందర్భంగా ఆందరికీ నమస్కారం చేస్తూ ముందుకు వెళ్లారు. ఆయన నమస్కరిస్తుంటే మోదీ పట్టించుకోనట్టుగా వేరే వైపు చూస్తున్నారు. ఆ తర్వాత రామ్‌నాథ్ కోవింద్ ముందుకు కదిలివెళ్లారు. ఈ వీడియోకు సింగ్ కామెట్లు జోడించారు. ''ఇది చాలా అవమానకరం, వెరీ సార్ సార్. ఈ వ్యక్తులు అంతే, మీ పదవీకాలం పూర్తి కావడంతో ఇక మీవైపు కన్నెత్తి కూడా చూడరు'' అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వీడియో వైరల్ అయింది.


ఫేక్ న్యూస్ పెడ్లర్ : బీజేపీ

ఆప్ షేర్ చేసిన వీడియోపై బీజేపీ వెంటనే స్పందించింది. సంజయ్ సింగ్‌ను 'ఫేక్ న్యూస్ పెడ్లర్' అంటూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ విమర్శించారు. సంజయ్ సింగ్ పోస్ట్ చేసిన వీడియోతో పాటు, ఎలాంటి కత్తెర్లు పడని (unedited cut) పూర్తి నిడివి వీడియోను ఆయన షేర్ చేశారు. ఇందులో రామ్‌నాథ్ కోవింద్ నమస్కారానికి మోదీ ప్రతినమస్కారం చేయడం కనిపిస్తుంది. ఇతర పార్లమెంటేరియన్లకు కోవింద్ నమస్కారం చేస్తున్నప్పుడు మోదీ వేరేవైపు చూస్తున్నారు. అమిత్‌ మాలవీయ తన ట్వీట్‌లో ఆప్‌పై విరుచుకుపడ్డారు. "ఈ వ్యక్తులు (కేజ్రీవాల్, సిసిడియో, తదితరులు) రోజూ అబద్ధాలు చెబుతూనే కనిపిస్తారు. అవమానించడం వీరికి అలవాటు. ప్రజలను ఎలా గౌరవించాలో వీళ్లు తెలుసుకోవాలి'' అని ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి మోదీని తక్కువ చేసి చూపించేందుకు ఆప్ ప్రయత్నిస్తోందని మరికొందరు బీజేపీ నేతలు సైతం ఆప్‌పై మండిపడ్డారు. సంజయ్ సింగ్‌  ''ఫ్యాక్ట్ చెక్'' చేసుకోవాలని అన్నారు.


ట్విట్టర్ అడ్వయిజరీ..

సంజయ్ సింగ్ ట్వీట్‌పై ట్విట్టర్ స్పందించింది. ఔట్ ఆఫ్ కాంటెస్ట్ అంటూ పేర్కొంటూ .. ఒక అడ్వయిజరీని జోడించింది. ప్రజలను పక్కదారి పట్టించడం, అయోమయంలో పడేయడం, హాని కలిగించే వీలున్న వాటిని షేర్ చేయవద్దని సూచించింది.

Read more