తెలంగాణలో గిరిజన వర్సిటీ

ABN , First Publish Date - 2022-07-18T07:53:20+05:30 IST

తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.

తెలంగాణలో గిరిజన వర్సిటీ

ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం 

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఈ వర్సిటీ ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈమేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, 2022ను కేంద్ర విద్యా శాఖ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సమాచారమిచ్చింది. ఈ మేరకు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే, ఆమోదించబోయే బిల్లుల జాబితాలో ఈ బిల్లును చేర్చుతూ ఉభయసభల సచివాలయాలు బులెటిన్‌ విడుదల చేశాయి. ఈ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల క్రితమే వర్సిటీ ఏర్పాటు కాగా... తెలంగాణ ప్రభుత్వం భూకేటాయింపులో జాప్యం చేయడం వల్ల వర్సిటీ ఏర్పాటు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. కాగా ములుగు జిల్లా జాకారంలో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించగా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఖరారు చేసింది.

Read more