Brahmotsavams: తిరుపతి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2022-09-03T13:53:16+05:30 IST

తిరుపతి బ్రహ్మోత్సవాలకు 150 ప్రత్యేక బస్సులు నడపాలని ఆంధ్ర, తమిళనాడు(Andhra and Tamil Nadu) రాష్ట్రాల రవాణా సంస్థలు

Brahmotsavams: తిరుపతి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు

పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 2: తిరుపతి బ్రహ్మోత్సవాలకు 150 ప్రత్యేక బస్సులు నడపాలని ఆంధ్ర, తమిళనాడు(Andhra and Tamil Nadu) రాష్ట్రాల రవాణా సంస్థలు నిర్ణయించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి అక్టోబరు 5వ తేది వరకు జరుగనున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా భక్తులు లేకుండా ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించారు. కరోనా నియంత్రణలోకి రావడంతో ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు ఉత్సవాలకు వచ్చే అవకాశముందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, భక్తుల సౌకర్యార్ధం ఉత్సవాలు జరిగే రోజుల్లో సాధారణంగా నడిపే బస్సుల కన్నా 150 బస్సులు అదనంగా నడపాలని ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రప్రభుత్వ రవాణా సంస్థలు నిర్ణయించాయి. ఆ ప్రకారం ఏపీఎస్‌ఆర్టీసీ చెన్నై నుంచి ఊత్తుకోట మార్గంగా తిరుమలకు 30 బస్సులు, చెన్నై, కాళహస్తి మార్గంగా 55 బస్సులు, తిరువణ్ణామలై నుంచి వేలూరు మీదుగా 20 బస్సులు, వేలూరు, చిత్తూరు రూట్‌లో 65 బస్సులు నడుపనున్నారు. అలాగే, కన్నియాకుమారి, తిరుచ్చి, సేలం, హోసూరు(Kanniyakumari, Trichy, Salem, Hosur) తదితర ప్రాంతాల నుంచి వేలూరు మీదుగాను, పుదుచ్చేరి, కాంచీపురం నుంచి తిరుత్తణి రూట్‌లో తిరుమలకు బస్సులు నడుపనున్నారు. ఇక, రాష్ట్రప్రభుత్వ రవాణా సంస్థ ఆధ్వర్యంలో తిరువణ్ణామలై నుంచి వేలూరు మార్గంలో పది ప్రత్యేక బస్సులు, కృష్ణగిరి నుంచి ధర్మపురి, కుప్పం రూట్‌లో 15 బస్సులు, కళ్లకుర్చి నుంచి వేలూరు రూట్‌లో 8 బస్సులు, వేలూరు నుంచి చిత్తూరు రూట్‌లో 26 బస్సులు, తిరుపత్తూర్‌, వేలూరు మీదుగా పది బస్సులు, పుదుచ్చేరి, కాంచీపురం మీదుగా మరో పది మొత్తం 150 బస్సులు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-09-03T13:53:16+05:30 IST