నా వల్లే వారికి టికెట్లు రాలేదు!

ABN , First Publish Date - 2022-03-16T07:48:43+05:30 IST

వారసత్వ రాజకీయాలు దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ప్రధాని మోదీ అన్నారు. వాటిపై పోరాడాల్సిన అవసరం...

నా వల్లే వారికి టికెట్లు రాలేదు!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీల పిల్లలకు టికెట్లు వద్దని చెప్ప్ఙా

 వారసత్వ రాజకీయాలు 

ప్రజాస్వామ్యానికి ప్రమాదం

ఈ సంప్రదాయానికి ముందు 

బీజేపీలో చెక్‌ పెట్టాలనుకున్నాం

ఈ నిర్ణయానికి నేతల స్వాగతం

బీజేపీ పార్లమెంటరీ పార్టీ 

భేటీలో నరేంద్ర మోదీ వెల్లడి


న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): వారసత్వ రాజకీయాలు దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ప్రధాని మోదీ అన్నారు. వాటిపై పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించకూడదన్న ఉద్దేశంతోనే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఎంపీల పిల్లలకు పార్టీ టికెట్లు ఇవ్వలేదని చెప్పారు. తన వల్లే వారికి సీట్లు రాలేదని తెలిపారు. మంగళవారమిక్కడ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత పనితీరు కనబరిచిన తర్వాత పార్లమెంటరీ పార్టీ భేటీ జరగడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి మీడియాకు తెలిపారు.


దేశంలో వారసత్వ రాజకీయాలపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పార్టీ ఎంపీల కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు మోదీ చెప్పారని జోషి వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ నేతలంతా స్వాగతించారన్నారు. ‘‘వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామానికి పెనుముప్పు. అందుకే అనేక మంది ఎంపీల పిల్లలకు పార్టీ టికెట్లు ఇవ్వలేదు. దానికి నాదే బాధ్యత. నా వల్లే టికెట్లు నిరాకరించారు’’ అని మోదీ ఎంపీలతో చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారసత్వ రాజకీయాలపై పోరులో భాగంగా ముందు బీజేపీలో ఆ సంప్రదాయానికి చెక్‌ పెట్టాలన్నారని తెలిపాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. యూపీలో బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్‌కు పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆయన ఎస్పీలో చేరిన సంగతి తెలిసిందే.


కాగా, సమావేశంలో ఎంపీలు ప్రధాని మోదీకి పూలమాల వేసి సత్కరించబోగా.. ముందు పార్టీ అధ్యక్షుడు నడ్డాను సన్మానించాలని సూచించారు. ఇక ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించే అంశాన్ని కూడా కొందరు నేతలు రాజకీయం చేశారని మోదీ పేర్కొన్నారు. ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా భారతీయులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా.. కొందరు రాజకీయ నేతలు అసంబద్ధ ప్రకటనలతో రాజకీయాలు చేయాలని చూశారని ఆరోపించారు. అలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన ఎంపీలను ప్రధాని అభినందించారు. 

వాస్తవాలు వెలుగులోకి..

1990ల్లో కశ్మీరీ పండితులపై జరిగిన దారుణాలను, నాటి అకృత్యాలను కళ్లకు కట్టేలా చిత్రీకరించిన ‘ద కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇలాంటి సినిమాల వల్ల ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. ద కశ్మీర్‌ ఫైల్స్‌ లాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన దారుణాలు, ఘోరాలను ప్రజలకు తెలియనివ్వలేదని.. ఏళ్ల తరబడి అణచివేయబడిన వాస్తవాలు ఈ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చాయని మోదీ చెప్పారు.


సినిమాలో చూపిన అంశాలపై సమస్యలు ఉన్న వారు వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలని, నిజాలను తెలుసుకోవాలని సూచించారు. దేశ ప్రజలకు నిజాలు తెలియాలంటే గాంధీ, కశ్మీర్‌ ఫైల్స్‌ వంటి సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాను అందరూ చూడాలని కోరారు. దేశ విభజన, 1975లో ఎమర్జెన్సీ వంటి అనేక అంశాలు ఉన్నాయని.. వాటి గురించి పూర్తి వివరాలతో ఇప్పటి వరకు సినిమాలు రాలేదని చెప్పారు.

Read more