గఢ్వీ గట్టెక్కేనా...?

ABN , First Publish Date - 2022-11-30T02:25:43+05:30 IST

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ద్వారకా జిల్లాలోని ఖంబాలియా నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ ఉత్కంఠ రేపుతోంది.

గఢ్వీ గట్టెక్కేనా...?

ఆప్‌ సీఎం అభ్యర్థిగా ఇసుదాన్‌

బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి హేమాహేమీలు

ఖంబాలియా/అహ్మదాబాద్‌(గుజరాత్‌), నవంబరు 29: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ద్వారకా జిల్లాలోని ఖంబాలియా నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ ఉత్కంఠ రేపుతోంది. ఈ స్థానం నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) తరఫున బరిలోకి దిగిన ఇసుదాన్‌ గఢ్వీని ఆ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టీ అటువైపు తిరిగింది. నేతి భూమిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఖంబాలియాలో కాంగ్రెస్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే మేడమ్‌ విక్రమ్‌ అర్జన్‌భాయ్‌, బీజేపీ అభ్యర్థి ములుభాయ్‌ బేరాతో గఢ్వీ తలపడనున్నారు. అపార రాజకీయ అనుభవానికి తోడు లోక్‌సభ మాజీ ఎంపీ కూడా అయిన విక్రమ్‌ మేడమ్‌, రాష్ట్ర మంత్రిగా చేసిన బేరాతో పోటీ అంత తేలిక కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అహిర్‌ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండగా, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ ఆ వర్గానికి చెందినవారే కావడం కూడా ఆయనకు సవాలుగా మారనుంది. కాగా, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆ్‌ప)లు పిట్టల్లాంటివని, చేతికొచ్చిన పంటను నాశనం చేసి ఎగిరిపోతాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. దాహోద్‌ జిల్లాలోని దేవ్‌గఢ్‌ బరియా పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

Updated Date - 2022-11-30T02:25:43+05:30 IST

Read more