తీవ్ర నేరాలు నమోదైనవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి

ABN , First Publish Date - 2022-09-29T08:58:49+05:30 IST

తీవ్రమైన నేరారోపణలు నమోదైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది.

తీవ్ర నేరాలు నమోదైనవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి

సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలు

విచారణకు స్వీకరించిన న్యాయస్థానం

కేంద్రం, ఈసీకి నోటీసులు జారీ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తీవ్రమైన నేరారోపణలు నమోదైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, హృషికేష్‌ రాయ్‌లతో కూడిన బెంచ్‌ కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖ, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. తీవ్రమైన నేరారోపణలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని లా కమిషన్‌ తన 244వ నివేదికలో తెలిపిందని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. ఇదే అంశంపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ రూపొందించిన గణాంకాలను పిటిషన్‌లో ప్రస్తావించారు. 2009 నుంచి క్రిమినల్‌ కేసులున్న ఎంపీల సంఖ్య 109 శాతం పెరిగిందని పేర్కొన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన 539 మంది లోక్‌సభ సభ్యుల్లో 233 మందిపై... అంటే 43 శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నాయని తెలిపారు. ఓ ఎంపీ తనపై ఏకంగా 204 క్రిమినల్‌ కేసులున్నట్టు వెల్లడించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అత్యాచారం, హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాపింగ్‌, మహిళలపై నేరాలకు పాల్పడటం వంటి కేసులు ఎంపీలపై ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. క్రిమినల్స్‌ను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించడం భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, వారు అనేకమంది ఓటర్లను, ప్రత్యర్థులను భయపెట్టి, అక్రమార్జనతో ప్రలోభపెట్టి గెలుస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు కాదలచుకున్నవారు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఉన్నత ప్రమాణాలు పాటించాలని పిటిషనర్‌ పేర్కొన్నారు.


ప్రజా ప్రతినిధుల వాక్‌ స్వాతంత్య్రంపై మరిన్ని పరిమితులు విధించడం కష్టం 

ప్రజా ప్రతినిధుల వాక్‌ స్వాతంత్య్రంపై మరిన్ని పరిమితులు విధించడం కష్టమని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. ఆర్టికల్‌ 19(2)లో పేర్కొన్న భావ ప్రకటనా స్వేచ్ఛపై రాజ్యాంగమే కొన్ని పరిమితులను కూడా విధించిందని కోర్టు తెలిపింది. అఖిలేష్‌ యాదవ్‌ హయాంలో ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకున్న బులంద్‌షా రేప్‌ కేసుకు సంబంధించి బాధితురాలి కుటుంబసభ్యులు దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వంపై రాజకీయ కుట్రలో భాగంగానే రేప్‌ కేసు పెట్టారని అప్పట్లో ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సదరు మంత్రి కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ప్రజా ప్రతినిధులు తరచుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో వారి వాక్‌ స్వాతంత్య్రంపై పరిమితులు విధించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈ అంశాన్ని నవంబరు 15న పరిశీలిస్తామని న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

Updated Date - 2022-09-29T08:58:49+05:30 IST