ఇక్కడెవరూ ఫూల్స్‌ లేరు

ABN , First Publish Date - 2022-09-27T07:37:12+05:30 IST

ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు సంబంధించి పాకిస్థాన్‌తో అమెరికా చేసుకున్న ఒప్పందంపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ధ్వజమెత్తారు.

ఇక్కడెవరూ ఫూల్స్‌ లేరు

ఎఫ్‌-16 విమానాలు ఉగ్రవాదులపై చర్యల కోసమా?

పాక్‌ వాటిని దేనికి ఉపయోగిస్తుందో అందరికీ తెలుసు

పాక్‌తో అమెరికా ఒప్పందంపై విదేశాంగ మంత్రి ధ్వజం

భారత్‌పై దుష్ప్రచారం మానుకోవాలి

అమెరికన్‌ మీడియాకు మంత్రి జైశంకర్‌ హితవు


వాషింగ్టన్‌, సెప్టెంబరు 26: ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు సంబంధించి పాకిస్థాన్‌తో అమెరికా చేసుకున్న ఒప్పందంపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ధ్వజమెత్తారు. ఈ విషయంలో అమెరికా స్పందించిన తీరును తీవ్రంగా ఆక్షేపించారు. పాకిస్థాన్‌ చేపడుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు మద్దతుగా ఎఫ్‌-16 విమానాల ఒప్పందం చేసుకున్నామని అమెరికా రక్షణ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై జైశంకర్‌ స్పందిస్తూ... ఇలాంటివి చెప్పి ఇక్కడెవర్నీ ఫూల్స్‌ను చేయలేరన్నారు. పాకిస్థాన్‌ ఎఫ్‌-16 యుద్ధ విమానాలను ఎక్కడ, దేని కోసం ఉపయోగిస్తుందో అందరికీ తెలుసన్నారు. అమెరికాలోని భారతీయులు వాషింగ్టన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి జైశంకర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మానుకోవాలని అమెరికన్‌ మీడియాకు జైశంకర్‌ హితబోధ చేశారు. వాషింగ్టన్‌ పోస్ట్‌తోపాటు మరికొన్ని ప్రధాన పత్రికలు భారత్‌ గురించి తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కశ్మీర్‌లో భద్రతా దళాలు, పోలీసుల ప్రాణాల కంటే అక్కడ ఇంటర్నెట్‌ లేకపోవడమే పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌ వ్యతిరేక శక్తులను అమెరికన్‌ మీడియా ప్రోత్సహించడం మానుకోవాలన్నారు. ‘‘ఈ పోటీ ప్రపంచంలో వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ప్రజలు తెలుసుకోవాలి. వారిని మనం విద్యావంతులను చేయాలి’’ అని అమెరికన్‌ మీడియాను ఉద్దేశించి మంత్రి అన్నారు. 

Updated Date - 2022-09-27T07:37:12+05:30 IST