రష్యాను హెచ్చరించిన జో బైడెన్

ABN , First Publish Date - 2022-02-19T16:35:20+05:30 IST

ఉక్రెయిన్‌పై మరికొద్ది రోజుల్లో దాడి చేయడానికి రష్యా సిద్ధంగా

రష్యాను హెచ్చరించిన జో బైడెన్

వాషింగ్టన్ : ఉక్రెయిన్‌పై మరికొద్ది రోజుల్లో దాడి చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం పునరుద్ఘాటించారు. మహా విపత్కరమైన, అవసరం లేని యుద్ధాన్ని ఎంచుకున్నందుకు బాధ్యత వహించాలని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌ను హెచ్చరించారు.  రష్యా ప్రణాళికలను గట్టిగా, మళ్ళీ మళ్ళీ ఖండిస్తున్నామని చెప్పారు. దీనికి కారణం ఘర్షణ జరగాలని కోరుకోవడం కాదని, ఉక్రెయిన్‌పై దాడిని సమర్థించుకునేందుకు రష్యాకు ఏదైనా కారణం ఉండకుండా చూసేందుకేనని చెప్పారు. యుద్ధం దిశగా రష్యా ముందుకు కదలడాన్ని నిరోధించేందుకు  తాము తమ శక్తినంతటినీ వినియోగించి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. 


రాబోయే వారంలో, రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌పై దాడికి రష్యా దళాలు ప్రణాళిక రచిస్తున్నాయని, ఆలోచిస్తున్నాయని విశ్వసించేందుకు తగిన కారణం ఉందని చెప్పారు. ఉక్రెయిన్ రాజధాని నగరం క్యివ్‌పై రష్యా దళాలు దాడి చేస్తాయని నమ్ముతున్నామన్నారు. ఈ నగరంలో అమాయకులైన 2.8 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారన్నారు. ఉక్రెయిన్‌పై దాడి చేయాలని పుతిన్ నిర్ణయించుకున్నారన్నారు. ఉక్రెయిన్‌తో రష్యా సరిహద్దుల్లో ఉన్న బెలారస్ నుంచి దక్షిణ దిశలో ఉన్న నల్ల సముద్రం వరకు రష్యా తన దళాలను మోహరించిందన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ను బైడెన్ ప్రశంసించారు. యుద్ధంలోకి తమను లాగడానికి రష్యాకు ఉక్రెయిన్ అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఈ ఉద్రిక్త వాతావరణంలో ఉక్రెయిన్ దళాలు చాలా గొప్ప సంయమనం, బలం, జడ్జిమెంట్‌ను ప్రదర్శిస్తున్నాయన్నారు.


NATO భూభాగంలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకోవడానికి అమెరికా, దాని మిత్ర దేశాలు సిద్ధంగా ఉన్నాయని, అదేవిధంగా ఉమ్మడి భద్రతకు ఎదురయ్యే ముప్పును కూడా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రష్యా ఇప్పటికీ దౌత్య మార్గాన్ని ఎంచుకోవచ్చునన్నారు. ఉద్రిక్తతలను సడలించి, తిరిగి చర్చలు జరపడానికి ఇప్పటికీ అవకాశం ఉందన్నారు.


అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్, రష్యా విదేశాంగ మంత్రి విక్టోరోవిచ్ లవ్‌రోవ్  ఫిబ్రవరి 24న చర్చలు జరిపేందుకు రష్యా అంగీకరించిందన్నారు. అంతకన్నా ముందే సైనిక చర్యకు రష్యా ఉపక్రమిస్తే, దౌత్య మార్గానికి తలుపులు మూసేసినట్లేనన్నారు. యుద్ధాన్ని ఎంచుకుంటే, అందుకు అత్యధిక మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందన్నారు. రష్యాపై అమెరికా, దాని మిత్ర దేశాలు విధించే ఆంక్షలను మాత్రమే కాకుండా, మిగతా ప్రపంచం నైతికంగా వ్యక్తం చేసే ఆగ్రహాన్ని కూడా రష్యా రుచి చూడవలసి వస్తుందని హెచ్చరించారు. 


రష్యా దళాల్లో దాదాపు 40 శాతం నుంచి 50 శాతం దళాలు ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ దళాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో దాడికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 


Updated Date - 2022-02-19T16:35:20+05:30 IST