BSNL: నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు భారీ ప్యాకేజ్ ప్రకటించిన కేంద్రం

ABN , First Publish Date - 2022-07-27T23:06:53+05:30 IST

నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) పునరుజ్జీవం దిశగా కేంద్రం చర్యలు మొదలుపెట్టింది. అందులో భాగంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థకు..

BSNL: నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు భారీ ప్యాకేజ్ ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) పునరుజ్జీవం దిశగా కేంద్రం చర్యలు మొదలుపెట్టింది. అందులో భాగంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థకు బాసటగా నిలిచేందుకు సదరు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థకు లక్షా అరవై నాలుగు వేల కోట్ల రూపాయల ప్యాకేజ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం నాడు ఆమోదం తెలిపింది. అంతేకాదు.. బీఎస్‌ఎన్‌ఎల్, బీబీఎన్ఎల్ విలీనానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.



ఈ ప్యాకేజీపై కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రధానంగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపారు. ఒకటి బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీసుల్లో నాణ్యతను పెంచడం, బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్‌ను మరింత చేరువ చేయడం, నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ను కొంత ఉపశమనం కల్పించడం. అంతేకాకుండా.. 4జీ సేవలను విస్తరించుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందించనున్నట్లు మంత్రి తెలిపారు.



ఇదిలా ఉండగా.. ప్రైవేట్‌ టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రభుత్వ రంగంలోని భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎ్‌సఎన్‌ఎల్‌) సిద్ధమవుతోంది. ఇందుకోసం తనకు 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లో 10 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌, 3,300-3,670 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లో 70 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ట్రాయ్‌ నిర్ణయించిన కనీస ధర ప్రకారం చూస్తే ఈ స్పెక్ట్రమ్‌ విలువ రూ.61,000 కోట్లు. ఇందులో 3,300-3670 బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ అత్యాధునిక 4జీ, 5జీ సేవలకు ఉపయోగపడుతుంది. ఇక 700 మెగాహెట్జ్‌ ప్రీమియం బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ ద్వారా తక్కువ టవర్లతో విశాలమైన ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించవచ్చు.

Updated Date - 2022-07-27T23:06:53+05:30 IST