WB SSC Scam: పార్థా ఛటర్జీ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు.. అంతేకాదు..

ABN , First Publish Date - 2022-09-01T01:22:11+05:30 IST

పశ్చిమబెంగాల్‌ పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో అరెస్ట్ అయిన ఆ రాష్ట్ర మాజీ పారిశ్రామిక మంత్రి, టీఎంసీ మాజీ సెక్రటరీ జనరల్‌ పార్థా చటర్జీ, అతని స్నేహితురాలు అర్పిత ముఖర్జీకి..

WB SSC Scam: పార్థా ఛటర్జీ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు.. అంతేకాదు..

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌ పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో అరెస్ట్ అయిన ఆ రాష్ట్ర మాజీ పారిశ్రామిక మంత్రి, టీఎంసీ మాజీ సెక్రటరీ జనరల్‌ పార్థా చటర్జీ, అతని స్నేహితురాలు అర్పిత ముఖర్జీకి జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 14 వరకూ పొడిగిస్తున్నట్లు కోల్‌కత్తాలోని ప్రత్యేక కోర్టు బుధవారం వెల్లడించింది. ఈ కేసులో పార్థా ఛటర్జీ బెయిల్ అభ్యర్థనను స్పెషల్ కోర్టు తిరస్కరించింది. 2014-2021 వరకు పార్థా చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలోనే విద్యాశాఖలో ఈ కుంభకోణం వెలుగుచూసింది. పార్థా చటర్జీకి సన్నిహితురాలైన ఆర్పితా ముఖర్జీ ఇంట్లో రూ.21 కోట్ల నగదు దొరకడంతో ఆమెనూ ఈడీ అదుపులోకి తీసుకుంది. పార్థా ఛటర్జీని తృణముల్ కాంగ్రెస్.. పార్టీ నుంచి బహిష్కరించింది. పార్థా ఛటర్జీ ఇంట్లో ఈ కుంభ కోణానికి సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు తెలిసింది.



ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ పోస్టుల (Teacher Posts) కోసం ఆశావహులుగా ఉన్న 48 మంది అభ్యర్థుల జాబితా రోల్ నంబర్లతో సహా పార్థా ఛటర్జీ ఇంట్లో (Partha Chatterjee House) లభ్యమైనట్లు కోర్టుకు ఈడీ వెల్లడించింది. రిక్రూట్‌మెంట్ టెస్ట్ కోసం అడ్మిట్ కార్డులు, గ్రూప్-డీ (Group D) సిబ్బంది నియామకానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఆయన ఇంట్లో లభ్యమైనట్లు న్యాయస్థానానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది. పార్థా ఛటర్జీ దోషిగా తేలితే జీవిత ఖైదు విధించినా తనకు అభ్యంతరం లేదని తానెప్పుడూ అవినీతిని సమర్థించబోనని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమత ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ అర్పితా ముఖర్జీతో ఎలాంటి సంబంధాలు లేవన్నారు.

Read more