రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 5.09 కోట్లు

ABN , First Publish Date - 2022-11-11T08:31:06+05:30 IST

రాష్ట్రంలోని 224 శాసనసభ నియోజకవర్గాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో మార్పు చేర్పులకు

రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 5.09 కోట్లు

బెంగళూరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 224 శాసనసభ నియోజకవర్గాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో మార్పు చేర్పులకు సంబంధించి జాగృతి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ఎన్నికల ప్రదాన అధికారి మనోజ్‌ కుమార్‌ మీనా(Manoj Kumar Meena) గురువారం మీడియా తో మాట్లాడారు. ఓటర్ల జాబితానుంచి ఏకంగా 27.08 లక్షలమంది ఓటర్లను పలు కారణాలతో తొలగించారు. ఇదే సమయంలో 11.13 లక్షల మంది కొత్త ఓటర్లను జాబితాలో చేర్చారు. ఓటర్ల జాబితా సిద్ధం చేసే సమయంలో మృతి చెందిన, చిరునామాలు సరిగాలేని వారి పేర్లను తొలగించినట్లు సంజీవ్‌కుమార్‌ చెప్పారు. 2022లో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.25 కోట్లుగా ఉంటే తాజాగా విడుదల చేసిన ముసాయిదాలో 5.09 కోట్లమంది ఉండడం గమనార్హం. వీరిలో 2,56,59,736మంది పురుషులు కాగా 2,52,09,619 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతరుల జాబితాలో 4,490మంది ఉన్నారు. ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో ఓటర్లు 5,09,01,662మంది ఉన్నారని ఒకవేళ అర్హత ఉన్నప్పటికీ జాబితాలో చోటు దక్కనివారు సంబంధిత ఫారాలను భర్తీ చేసి స్థానిక అధికారులకు సమర్పిస్తే మళ్లీ చేరుస్తామన్నారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి మొత్తం 4 ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 12న, 20, డిసెంబరు 3న, డిసెంబరు 4న ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులకు సంబంధించి డిసెంబరు 8లోపు అభ్యంతరాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. వీటిని డిసెంబరు 26న పరిశీలించి 2023 జనవరి 5న రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసేందుకు ఆధార్‌ కార్డు తప్పనిసరికాదని ఆయన స్పష్టం చేశారు. జాబితాలో పేర్లులేనివారు ఆందోళన చెందాల్సిన అ వసరం లేదని ఇందుకుగాను నిర్ణీత ఫారాలను భర్తీ చేసి అధికారులకు సమర్పించాల్సి ఉంటుందన్నారు.

Updated Date - 2022-11-11T08:31:09+05:30 IST