కొత్త మహా దళపతి అనిల్‌ చౌహాన్‌

ABN , First Publish Date - 2022-09-29T08:56:37+05:30 IST

జనరల్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణంతో తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న మహాదళపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌-సీడీఎస్‌) పదవిని..

కొత్త మహా దళపతి అనిల్‌ చౌహాన్‌

ఈస్ట్రన్‌ ఆర్మీ కమాండ్‌ చీఫ్‌ హోదాలో చైనాను సమర్థంగా అడ్డుకున్న చరిత్ర

బాలాకోట్‌ ఎయిర్‌స్ట్రైక్స్‌, ఆపరేషన్‌ సన్‌రైజ్‌ వంటివాటిలో కీలకపాత్ర 

ఈశాన్య రాష్ట్రాల్లో కౌంటర్‌ ఇన్‌సర్జెన్సీ ఆపరేషన్స్‌లో విస్తృత అనుభవం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: జనరల్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణంతో తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న మహాదళపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌-సీడీఎస్‌) పదవిని.. విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌తో భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన ఈ హోదాలోను, భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల కార్యదర్శిగానూ పనిచేస్తారని కేంద్ర రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పదవీ విరమణ పొందిన ఒక త్రీస్టార్‌ అధికారి.. తిరిగి ఫోర్‌ స్టార్‌ హోదాలో యాక్టివ్‌ సర్వీసులోకి చేరడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు.. జమ్ముకశ్మీర్‌తోపాటు, ఈశాన్య రాష్ట్రాల్లో కౌంటర్‌-ఇన్‌సర్జెన్సీ ఆపరేషన్స్‌ను సమర్థంగా నిర్వహించిన విస్తృత అనుభవం ఉంది. గఢ్వాల్‌ రాజ్‌పుట్‌ కుటుంబానికి చెందిన అనిల్‌ చౌహాన్‌.. 1961 మే 18న జన్మించారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీ, ఖడక్‌వాస్లాలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. 1981లో ఇండియన్‌ ఆర్మీలోని 11 గూర్ఖా రైఫిల్స్‌ విభాగంలో చేరారు. మేజర్‌ జనరల్‌గా నార్తర్న్‌ కమాండ్‌లోని అత్యంత కీలకమైన బారాముల్లా సెక్టార్‌లో పదాతిదళానికి నాయకత్వం వహించారు. ఆర్మీలో ఆయన అందించిన విశిష్ట సేవలకుగాను ప్రభుత్వం పరమ విశిష్ట సేవా మెడల్‌, ఉత్తమ యుద్ధ సేవా మెడల్‌, అతి విశిష్ట సేవా మెడల్‌, సేనా మెడల్‌, విశిష్ట సేవా మెడల్‌తో గౌరవించింది. ఆయన రచించిన ‘ఆఫ్టర్‌మాత్‌ ఆఫ్‌ ఏ న్యూక్లియర్‌ ఎటాక్‌’ అనే పుస్తకం 2010లో ప్రచురితమైంది.  


‘చైనా’ నిపుణుడు..

స్ట్రన్‌ ఆర్మీ కమాండ్‌కు నాయకత్వం వహించిన అనిల్‌ చౌహాన్‌కు.. ‘చైనా నిపుణుడు’గా సైనిక వర్గాల్లో బాగా పేరుంది. గతంలో చైనాను పెద్ద ముప్పుగా పరిగణించలేదు. 2020లో లద్దాఖ్‌లో చైనా కదలికలు, గల్వాన్‌లో సైనికుల ఘర్షణతో పరిస్థితులు మారిపోయాయి. ఆ సమయంలో ఈస్ట్రన్‌ కమాండ్‌ చీఫ్‌గా ఉన్న అనిల్‌చౌహాన్‌ ఇండో-చైనా సరిహద్దుల్లో చైనా దూకుడును సమర్థంగా నిలువరించడంలో కీలకపాత్ర పోషించారు. 


సర్వీసు నిబంధనల్లో సవరణ చేసి..

ఈ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘంగా కసరత్తు చేసింది. త్రివిధ దళాధిపతులతోపాటు.. ప్రస్తుత, పదవీ విరమణ పొందిన లెఫ్టినెంట్‌ జనరల్‌, ఎయిర్‌మార్షల్‌, వైస్‌ అడ్మిరల్‌ కూడా అర్హులయేలా సీడీఎస్‌ పదవికి అర్హత పరిధిని పెంచుతూ ఈ ఏడాది జూన్‌లో రక్షణ శాఖ సర్వీసు నిబంధనల్లో సవరణలు సైతం చేసింది. ఈ క్రమంలోనే అనిల్‌ చౌహాన్‌ను కొత్త నిబంధనల ప్రకారం ఈ పదవిలో నియమించింది. 


మాస్కుల సేకరణ అంటే మస్తు ఇష్టం

అనిల్‌ చౌహాన్‌కు మాస్కుల (కృత్రిమ ముఖాల) సేకరణ అంటే చాలా ఇష్టం. ఆయన వద్ద చాలా దేశాలకు చెందిన చెక్క, మట్టితో చేసిన మాస్కులు ఉన్నాయి. ఆయన వద్ద ప్రస్తుతం 160కి పైగా మాస్కులున్నాయి. 

Updated Date - 2022-09-29T08:56:37+05:30 IST