నగరాల అభివృద్ధిపైనే దేశ భవిష్యత్‌

ABN , First Publish Date - 2022-10-01T08:32:10+05:30 IST

నగరాల అభివృద్ధిపైనే దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉందని ప్రధాని మోదీ అన్నారు.

నగరాల అభివృద్ధిపైనే దేశ భవిష్యత్‌

వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన భారత్‌ 

అహ్మదాబాద్‌ మెట్రో ప్రారంభించిన మోదీ

అహ్మదాబాద్‌, సెప్టెంబరు 30: నగరాల అభివృద్ధిపైనే దేశ భవిష్యత్‌ ఆధారపడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. నగరీకరణతో వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవిర్భవించనుందని ఆయన ప్రకటించారు. శుక్రవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించిన ప్రధాని మెట్రో రైల్‌ ప్రాజెక్టును, వందే భారత్‌ రైలును ప్రారంభించారు. అనంతరం ఆ రైలులో కొద్ది సేపు ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, దేశం వేగవంతంగా అభివృద్ధి చెందాలంటే వ్యవస్థలను వేగంగా నడపాలని తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. సరుకు రవాణాలో వేగం పుంజుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. 


కాన్వాయ్‌ ఆపి.. అంబులెన్స్‌కు దారి...

గుజరాత్‌ పర్యటనలో అనూహ్య సంఘటన చోటు చేసుకున్నది. అహ్మదాబాద్‌లో పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ గాంధీనగర్‌లో రాజభవన్‌కు రోడ్డు మార్గంలో వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌ వెనుక ఓ అంబులెన్స్‌ను గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌ని నిలిపి ఆ అంబులెన్స్‌కు దారి ఇవ్వాల్సిందిగా మోదీ ఆదేశించారు. దీంతో నడిరోడ్డుపై కొద్ది సమయం ప్రధాని కాన్వాయ్‌ నిలిచిపోయింది. ఈ వీడియోను గుజరాత్‌ బీజేపీ విడుదల చేసింది. మోదీ శకంలో వీఐపీ సంస్కృతికి చోటు లేదంటూ ట్వీట్‌ చేసింది. 

Read more