కొలీజియం చర్చలను బహిర్గతం చేయలేం

ABN , First Publish Date - 2022-12-10T01:14:43+05:30 IST

న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం సమావేశాల్లో చర్చించిన అంశాలను బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కొలీజియం భేటీలో చర్చల వివరాలను వెల్లడించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. పలువురు సభ్యులతో కూడిన

కొలీజియం చర్చలను బహిర్గతం చేయలేం

తుది నిర్ణయాలను మాత్రమే వెల్లడిస్తాం

సుప్రీంకోర్టు స్పష్టీకరణ.. పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, డిసెంబరు 9: న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం సమావేశాల్లో చర్చించిన అంశాలను బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కొలీజియం భేటీలో చర్చల వివరాలను వెల్లడించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. పలువురు సభ్యులతో కూడిన కొలీజియంలో చాలా చర్చ జరుగుతుందని, ఆ మొత్తాన్నీ బహిర్గతం చేయలేమని తెలిపింది. కేవలం సమావేశంలో తీసుకున్న తుది నిర్ణయాన్ని మాత్రమే వెల్లడిస్తామని తేల్చిచెప్పింది. ఇద్దరు న్యాయమూర్తుల నియామకం కోసం 2018, డిసెంబరు 12న జరిగిన కొలీజియం సమావేశ వివరాలను వెల్లడించాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్‌ కోర్టును ఆశ్రయించారు. తొలుత ఆమె ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయగా.. సంబంధిత అధికారులు వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆమె పిటిషన్‌ను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. నాటి సమావేశంలో పాల్గొన్న ఓ న్యాయమూర్తి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా వెలువడ్డ కథనాలపై పిటిషనర్‌ ఆధారపడ్డారని ధర్మాసనం పేర్కొంది. తాము ఈ ఆంశంపై మరోసారి వ్యాఖ్యానించదల్చుకోలేదని.. ఈ పిటిషన్‌లో పసలేదని తెలిపింది. దీనిని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. 2018 డిసెంబరు 12న జరిగిన కొలీజియం సమావేశంలో అప్పటి సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. కానీ, ఆ భేటీ వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. ఆ సమావేశం వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచకపోవడంపై జస్టిస్‌ లోకూర్‌ 2019లో అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-10T01:14:44+05:30 IST