ఏకగ్రీవం మేలని థరూర్‌కు చెప్పా

ABN , First Publish Date - 2022-10-03T09:04:05+05:30 IST

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఏకగ్రీవ అభ్యర్థి అయితే బాగుంటుందని మరో అభ్యర్థిగా బరిలోకి దిగిన శశి థరూర్‌కు తాను చెప్పానని సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే తెలిపారు.

ఏకగ్రీవం మేలని థరూర్‌కు చెప్పా

సీనియర్లు కోరితేనే పోటీ చేస్తున్నా

కాంగ్రెస్‌ సిద్ధాంతాల కోసమే పోరు

ఒక్క వ్యక్తితో మార్పు రాదు

జి-23 ఉనికి లేనే లేదు

ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్‌ ఖర్గే స్పష్టీకరణ

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

ఖర్గేతో మార్పు రాదు నేను మాత్రమే తెస్తా: థరూర్‌


న్యూఢిల్లీ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఏకగ్రీవ అభ్యర్థి అయితే బాగుంటుందని మరో అభ్యర్థిగా బరిలోకి దిగిన శశి థరూర్‌కు తాను చెప్పానని సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే తెలిపారు. తాను దళిత నాయకుడిగానే గాక 55 ఏళ్లు పనిచేసిన నాయకుడిగా పోటీచేస్తున్నానని చెప్పారు. గాంధీజయంతిని పురస్కరించుకుని ఆదివారమిక్కడ తన ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీనియర్‌ నేతలంతా ఒత్తిడి చేయడంతో బరిలోకి దిగానని తెలిపారు. గాంధీ కుటుంబం తనకు మద్దతిస్తోందనడాన్ని ఖండించారు. తానెవరిపైనా వ్యక్తిగతంగా పోటీ చేయడం లేదని.. పార్టీ సిద్ధాంతాల కోసమే పోరాడుతున్నానని చెప్పారు. థరూర్‌ చెబుతున్న యథాతథ స్థితి, మార్పు అనేవాటిని నిర్ణయించేది పీసీసీ ప్రతినిధులు, ఏఐసీసీ అని స్పష్టం చేశారు. ఖర్గే ప్రస్తుత నాయకత్వానికి కొనసాగింపు అని థరూర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘ఏ సంస్కరణలపైనైనా అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలి. ఒక్క వ్యక్తి కాదు’ అని చెప్పారు. కాంగ్రె్‌సలో ప్రస్తుతం జి-23 శిబిరం అనేది లేదని స్పష్టం చేశారు.  పార్టీలో సమూల సంస్థాగత సంస్కరణలు అవసరమని గతంలో లేఖ రాసిన భూపీందర్‌సింగ్‌ హూడా, ఆనంద్‌ శర్మ, మనీశ్‌ తివారీ, పృథ్వీరాజ్‌ చవాన్‌ తదితరులంతా తనకు మద్దతిచ్చారని ఖర్గే గుర్తు చేశారు. బీజేపీ ఎప్పుడూ కాంగ్రె్‌సను తక్కువ చేసి చూస్తుందని ఆరోపించారు. ‘అసలా పార్టీలో ఎప్పుడు ఎన్నికలు జరిగాయి? దానికి ఎన్నికల అథారిటీ అంటూ ఉందా? జేపీ నడ్డాను ఎవరు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు’ అని ప్రశ్నించారు. కాగా.. ఖర్గే, థరూర్‌లలో ఎవరో ఒకరు 8వ తేదీలోపు నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే ఈ నెల 17న పోలింగ్‌ అనివార్యం. 19న ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు. 


ఖర్గేతో మార్పు రాదు: థరూర్‌

సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే గెలిస్తే కాంగ్రె్‌సలో కార్యకర్తలు కోరుకుంటున్న మార్పు రాదని.. తాను మాత్రమే మార్పు తేగలనని శశి థరూర్‌ స్పష్టం చేశారు. ఆయన ఆదివార ం ఎన్నికల ప్రచారం కోసం నాగపూర్‌ వచ్చారు. ‘ఖర్గేతో నాకెలాంటి సైద్ధాంతిక విభేదాలూ లేవు. ఆయనతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను. సంస్కరణలకు సంబంధించి మా దృక్పథాలు, ప్రణాళికలను 9 వేల మందికి పైగా ఓటర్లు (పీసీసీ ప్రతినిధులు) తెలుసుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఇప్పటికే పార్టీ నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇద్దరం ఎలాంటి ప్రతిపాదనలు చేస్తామన్నదే ప్రశ్న. ఏ పార్టీ అధ్యక్షుడూ గాంధీ కుటుంబానికి దూరంగా ఉండలేరు. అతిపెద్ద పార్టీలో మార్పు తీసుకురావడానికే పోటీచేస్తున్నాను. ఖర్గే, నేను శత్రువులం కాదు. ఇది మా ఇద్దరి మధ్య యుద్ధమూ కాదు. ఎవరిని ఎన్నుకోవాలనేది కార్యకర్తలకే వదిలేయాలి’ అని థరూర్‌ తెలిపారు.


జోడో యాత్రకు సోనియా గాంధీ

6న రాహుల్‌తో కలిసి

నడవనున్న కాంగ్రెస్‌ అధినేత్రి


బెంగళూరు, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ  భారత్‌ జోడో యాత్రలో ఆయన మాతృమూర్తి, అధినేత్రి సోనియా గాంధీ కూడా పాదం కలపనున్నారు. యాత్ర మూడు రోజులుగా కర్ణాటకలో కొనసాగుతోంది. దసరా సందర్భంగా సోమ, మంగళవారాలు పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. బుధవారం నుంచి పాదయాత్ర యథావిథిగా కొనసాగుతుంది. ఈ నెల 6న మైసూరు పాదయాత్రలో సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రకటించారు. ఆదివారం నంజనగూడు ప్రాంతం బదనవాళు గ్రామంలో మహాత్మాగాంధీ విగ్రహానికి రాహుల్‌ నివాళులర్పించారు. గ్రామంలో వీరశైవ, దళిత వర్గాల మధ్య 29 ఏళ్ల క్రితం నుంచి వివాదం సాగుతోంది. రాహుల్‌ గ్రామ సందర్శనలో భాగంగా ఇరువర్గాలతో కలసి సహపంక్తి భోజనం చేశారు. తద్వారా దాదాపు మూడు దశాబ్దాలుగా నెలకొన్న గొడవకు పరిష్కారం చూపినట్టు అయింది. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాదయ్రాతకు ప్రాధాన్యం ఏర్పడింది. 

Read more