తెలంగాణపై ఆప్‌ నజర్‌!

ABN , First Publish Date - 2022-03-16T07:59:22+05:30 IST

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్‌, బీజేపీ, వైఎ్‌సఆర్టీపీ, బీఎస్పీలకు తోడుగా.. మరో ప్రతిపక్షమూ దిగుతోంది. ..

తెలంగాణపై ఆప్‌ నజర్‌!

 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు

 ప్రారంభించనున్న పార్టీ అధినేత కేజ్రీవాల్‌

 అదేరోజుపార్టీలోకి పలువురు రిటైర్డ్‌ ఐఏఎ్‌సలు


హైదరాబాద్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్‌, బీజేపీ, వైఎ్‌సఆర్టీపీ, బీఎస్పీలకు తోడుగా.. మరో ప్రతిపక్షమూ దిగుతోంది. రాష్ట్రంలో ఆమ్‌ ఆద్మీపార్టీ(ఆప్‌) విస్తరణపై ఆ పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. పంజాబ్‌ ఎన్నికల్లో విజయం సాధించి మంచి ఉత్సాహం మీద ఉన్న ఆప్‌.. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు తెలంగాణ మంచి ప్లాట్‌ఫారంగా బావిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌ నగరంతో పాటుగా తెలంగాణలోని అర్బన్‌ ప్రాంతాల్లో ఆప్‌ ప్రభావం బలంగా ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆప్‌ సాధించిన ఫలితాలతో తెలంగాణలోని పలువురు రిటైర్డ్‌ అధికారుల్లో ఆ పార్టీలో చేరాలన్న ఆసక్తి పెరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అనుకూలతలను బలాలుగా మలుచుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆప్‌ పాదయాత్రలను నిర్వహించబోతోంది. ప్రస్తుతం తెలంగాణలో బాధ్యతలు చూస్తున్న, పార్టీ సెర్చ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ ఇందిరాశోభన్‌ ఈ పాదయాత్రకు సంబంధించిన కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్‌ 14న ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తెలంగాణకు వచ్చి ఈ పాదయాత్రను ప్రారంభిస్తారు. కేజ్రీవాల్‌ సమక్షంలో పలువురు రిటైర్డ్‌ అధికారులు, ఇతర ప్రముఖులు ఆప్‌లో చేరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆప్‌ దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జి, ఆ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌ భారతి మాత్రం పూర్తి స్థాయిలో పాదయాత్రపైన దృష్టి పెట్టనున్నారు. పాదయాత్ర పూర్తయ్యే వరకూ ఆయన తరచూ హైదరాబాద్‌కు రానున్నారని, ఆయన సమక్షంలో నిరంతరం చేరికలు కొనసాగుతాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

Read more