తెలంగాణ పోలీసులపై బిహార్‌లో సైబర్‌ నేరగాళ్ల కాల్పులు

ABN , First Publish Date - 2022-08-15T09:47:01+05:30 IST

బిహార్‌లో తెలంగాణ పోలీసులపై సైబర్‌ నేరగాళ్లు కాల్పులు జరిపారు. ఆన్‌లైన్‌లో సైబర్‌ మోసాలకు పాల్పడి రూ.కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు బిహార్‌కు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది.

తెలంగాణ పోలీసులపై బిహార్‌లో సైబర్‌ నేరగాళ్ల కాల్పులు

నలుగురు నిందితుల అరెస్టు 

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): బిహార్‌లో తెలంగాణ పోలీసులపై సైబర్‌ నేరగాళ్లు కాల్పులు జరిపారు. ఆన్‌లైన్‌లో సైబర్‌ మోసాలకు పాల్పడి రూ.కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు బిహార్‌కు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక బిహార్‌ పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్‌ చేపట్టిన తెలంగాణ పోలీసులు చివరికి నలుగురు నేరస్థులను అరెస్ట్‌ చేసి రూ.కోటి పైగా సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఆటోమెబైల్‌ ఏజెన్సీలు ఇప్పిస్తామంటూ ఆన్‌లైన్‌లో వలవేసిన సైబర్‌ నేరగాళ్లు డీలర్‌షి్‌పల పేరుతో పలువురిని మోసం చేశారు. వారి వద్ద నుంచి అడ్వాన్స్‌ రూపంలో రూ.లక్షలు వసూలు చేశారు. కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి కూడా వారి వలలో పడి రూ.30 లక్షలు పొగొట్టుకున్నారు. ఇలాంటివే పలు ఫిర్యాదులు నమోదవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సైబర్‌ క్రైం పోలీస్‌ బృందం సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించింది. బిహార్‌ రాష్ట్రం నవాడా జిల్లాలోని భవానిబిగా గ్రామంలో సైబర్‌ నేరగాళ్ల ఆచూకీ కనుగొన్నారు. ఈ నెల 11న అక్కడికి వెళ్లి స్థానిక పోలీసులతో కలిసి నిందితుల కోసం వేట ప్రారంభించారు. అయితే  సమాచారం తెలుసుకున్న ప్రధాన నిందితుడు మిథిలేశ్‌ ప్రసాద్‌ పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. మిగిలిన నలుగురు నేరగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ.1.22 కోట్ల నగదు, 3 కార్లు, 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకురానున్నట్లు తెలిసింది. 

Updated Date - 2022-08-15T09:47:01+05:30 IST