టార్గెట్ Shivakumar

ABN , First Publish Date - 2022-07-03T17:01:15+05:30 IST

రాజకీయాల్లో తాను ఎదుగుతూ ప్రత్యర్థిని దెబ్బతీయడమే లక్ష్యంగా సాగుతుంటారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉంటున్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే

టార్గెట్ Shivakumar

- సాతనూరులో ఓడించేందుకు వ్యూహాలు 

- ఏకతాటిపైకి ప్రత్యర్థులు

- జేడీఎస్‌ నుంచి మరోసారి విశ్వనాథ్‌ పోటీ..? 

- పరోక్షంగా మద్దతు ఇవ్వనున్న ముఖ్యనేతలు


బెంగళూరు, జూలై 2(ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో తాను ఎదుగుతూ ప్రత్యర్థిని దెబ్బతీయడమే లక్ష్యంగా సాగుతుంటారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉంటున్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకు మార్‌ అధికార పార్టీ నుంచే కాకుండా సొంత పార్టీలోనూ అంతర్గతంగా వర్గపోరు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వద్ద కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి రేసులో సిద్ద రామయ్యతో పాటు డీకే శివకుమార్‌ కూడా అగ్రభాగాన ఉన్నారు. ఇటీవలే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య వర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలుస్తోంది. మరో వైపు డీకే శివకుమార్‌ రాజకీయ ప్రత్యర్థులు ఒకేతాటి పైకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను సాతనూరు నియోజక వర్గంలో ఓడించాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు చర్చలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగానే డీకే శివకుమార్‌కు ప్రధాన రాజకీయ శత్రువులైన ముగ్గురు కలసి దెబ్బతీసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. వీరంతా డీఎం విశ్వనాథ్‌ అనే వ్యక్తిని అస్త్రంగా వాడుకునేందుకు సిద్ధమవుతున్నారు. డీకే శివకుమార్‌కు వివిధ కారణాలతో బీజేపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు ప్రధాన ప్రత్యర్థులుగా మారారు. రామనగర జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి డాక్టర్‌ అశ్వత్థనారాయణతో విభేదాలు ఉన్నాయి. ఇదే ప్రాంతానికి చెందిన సీపీ యోగేశ్వర్‌తో రాజకీయంగా డీకే శివకుమార్‌కు దాదాపు దశాబ్దన్నర కాలంగా వైరం సాగుతోంది. బెళగావి జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేత, రాష్ట్రంలో కాంగ్రెస్-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కూలేందుకు కారకుడైన రమేశ్‌ జార్కిహొళి కూడా డీకే శివకుమార్‌ను ప్రత్యర్థిగానే భావిస్తున్నారు. రాష్ట్రమంత్రిగా కొనసాగుతున్న రమేశ్‌ జార్కిహొళి రాసలీలల సీడీ వివాదంతో పదవిని కోల్పోయారు. ఈ కుట్ర వెనుక డీకే శివకుమార్‌ ఉన్నట్టు రమేశ్‌ జార్కిహొళి బహిరంగంగానే ప్రకటించారు. పలుమార్లు తానేంటో చూపుతానని రమేశ్‌జార్కిహొళి సవాల్‌ విసిరిన సంగతి విదితమే. డీకే శివకుమార్‌ పోటీ చేసే సాతనూరు నుంచి విశ్వనాథ్‌ను రంగంలోకి దించి అన్ని విధాలా సహకరించేందుకు ఈ ముగ్గురు నేతలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 2004లో సాతనూరు నుంచి జేడీఎస్‌ తరపున పోటీ చేసిన విశ్వనాథ్‌ ఓటమి చెందారు. 2008లో జేడీఎస్‌ అభ్యర్థిగా మరోసారి రంగంలోకి దిగి డీకే శివకుమార్‌కు గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 7,179 ఓట్ల తేడాతో డీకే శివకుమార్‌ అప్పట్లో గెలిచారు. 2013లో డీకే శివకుమార్‌ను ఎదుర్కొనలేక పోటీకి దూరమయ్యాడు. డీకే శివకుమార్‌తోపోటీ అంటే విశ్వనాథ్‌తోనే సాధ్యమనే అభిప్రాయాలు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇదే కారణంతోనే విశ్వనాథ్‌ను జేడీఎస్‌ తరపున మరోసారి రంగంలోకి దించి సత్తా చూపాలని వారు భావిస్తున్నారు.


Read more