టార్గెట్ 2023

ABN , First Publish Date - 2022-07-15T16:56:27+05:30 IST

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ విజయపతాకం ఎగురవేసే దిశగా పార్టీ వ్యూహాలు రూపొందిస్తోంది. 2023శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన

టార్గెట్ 2023

- వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా బీజేపీ వ్యూహాలు 

- చింతన శిబిరంలో నేడు మంత్రుల కీలక సమావేశం

- బోర్డుల అధ్యక్ష పదవులు విధేయులకే.. 

- ఆగస్టులో పార్టీకి కొత్త అధ్యక్షుడు? 

- సంఘ్‌ నేతల దిశానిర్దేశం


బెంగళూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ విజయపతాకం ఎగురవేసే దిశగా పార్టీ వ్యూహాలు రూపొందిస్తోంది. 2023శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు దేవనహళ్ళిలోని రిసార్టులో గురువారం బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కీలక సమావేశం జరిగింది. రా నున్న 8 నెలల్లో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించేందుకు శుక్రవారం మంత్రుల కీలక సమావేశం జరుగుతుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. హిందూ ఓట్ల క్రోడీకరణపైనే తొలి రోజు సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఆర్‌ఎస్ఎస్‏ను బూచిగా చూపిస్తూ ముస్లిం, క్రైస్తవ ఓట్లను క్రోడీకరించేందుకు కాంగ్రెస్‌ చేస్తున్న ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొనాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీకి దూరంగా ఉంటున్న వర్గాల ఆదరణను చూరగొనాలని బూత్‌స్థాయిలో పార్టీ శ్రేణులను ఉత్తేజపరచాలని తీర్మానించినట్లు సమాచారం. గతంలో యడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలో  ఆర్‌ఎస్ఎస్‌ సూచించిన కార్యకర్తలకు బోర్డులు, కార్పోరేషన్ల అధ్యక్ష పదవులను ఇవ్వలేదని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు తెలిసింది. సంఘ్‌పరివార్‌ నేపథ్యం కలిగిన విధేయులకే ఈ పదవుల పందేరం సమయంలో ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా మెజార్టీ ఎమ్మెల్యేలు సూచించినట్లు పార్టీ వర్గాలను ఉటంకిస్తూ తెలిసింది. సాధారణ ఎన్నికలకు ఇంకా అట్టే సమయం లేదని ప్రజల్లోనే ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హితబోధ చేసినట్లు తెలుస్తోంది. ప్ర త్యేకించి వచ్చే శాసనసభ  ఎన్నికల్లో ప్రతిపక్షాలు 40 శాతం కమీషన్‌, హిజాబ్‌, పాఠ్యపుస్తకాలలో మార్పులు ఇత్యాది అంశాలనే అస్త్రాలుగా మార్చుకునే అవకాశం ఉందని ఇందుకు దీటుగా పార్టీ శ్రేణులు కూడా బీజేపీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అభిప్రాయపడినట్లు తెలిసింది.


మంత్రులకు కీలక బాధ్యతలు?

కాగా 2023 శాసనసభ ఎన్నికల్లో టార్గెట్‌ 150ను అందుకునే దిశలో పలువురు మంత్రులకు కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఒక్కో మంత్రికి కనీసం అర డజను అసెంబ్లీ నియోజకవర్గాల గెలుపు బాధ్యతలను అప్పగించాలని పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. తాము సిఫార్సు చేసే వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే పక్షంలో ఈ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమని కొందరు మంత్రులు పేర్కొంటున్నట్లు తెల్సింది. పలువురు మంత్రుల పనితీరుపై చింతన్‌ శిబిరం తొలిరోజు అసంతృప్తి గళాలు వినిపించిన నేపథ్యంలో శుక్రవారం జరిగే మంత్రుల సమావేశం కీలక ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. పలు విధివిధానాలు రూపొందించనున్నారు.

Read more