ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న ‘Tamils are not Hindus’.. వెట్రిమారన్ వ్యాఖ్యలే కారణమా..?

ABN , First Publish Date - 2022-10-06T22:37:25+05:30 IST

తమిళనాడులో ఇప్పుడో అంశంపై సోషల్ మీడియా సాక్షిగా రెండు వర్గాల మధ్య యుద్ధం జరుగుతోంది. తమిళులు హిందువులు కాదని ఓ వర్గం, తమిళులకు వేల యేళ్ల నుంచి..

ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న ‘Tamils are not Hindus’.. వెట్రిమారన్ వ్యాఖ్యలే కారణమా..?

తమిళనాడులో ఇప్పుడో అంశంపై సోషల్ మీడియా సాక్షిగా రెండు వర్గాల మధ్య యుద్ధం జరుగుతోంది. తమిళులు హిందువులు కాదని ఓ వర్గం, తమిళులకు వేల యేళ్ల నుంచి శివుడిని పూజించిన చరిత్ర ఉందని.. తమిళులు హిందువులు కాక మరెవరని మరో వర్గం ట్వీట్ల యుద్ధం చేసుకుంటున్నాయి. దీంతో.. #TamilsAreNotHindus అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అయింది. ఉన్నట్టుండి ఈ చర్చ తలెత్తడానికి కారణం మరెవరో కాదు తమిళ దర్శకుడు వెట్రిమారన్. హీరో ధనుష్‌తో కలిసి జాతీయ అవార్డులు దక్కించుకున్న సినిమాలు తెరకెక్కించిన ఈ తమిళ స్టార్ డైరెక్టర్ చోళ రాజు అయిన రాజరాజ చోళన్‌పై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. చోళ రాజుల కథతో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.



ఇంతకీ వెట్రిమారన్ ఏమన్నారంటే.. ‘‘ మన మూలాలను మన నుంచి లాగేసుకుంటూనే ఉన్నారు. వళ్లువార్‌కు కాషాయ రంగు పులమడం, రాజరాజ చోళన్‌ను హిందూ రాజుగా చెప్పడం.. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి’’. ఇవీ దర్శకుడు వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలతో తమిళనాడులో వెట్రిమారన్ ఒక కొత్త చర్చకు తెరలేపినట్టయింది. రాజరాజ చోళన్ మాత్రమే కాదు అసలు తమిళులెవరూ హిందువులు కాదని కొందరు, హిందువులే అని కొందరు సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. కొందరు ప్రముఖులు కూడా వెట్రిమారన్ వ్యాఖ్యలపై స్పందించడంతో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది.



ప్రముఖ తమిళ నటుడు కమల్‌హాసన్ కూడా వెట్రిమారన్ వ్యాఖ్యలను సమర్థించారు. రాజరాజ చోళన్ అసలు హిందూ రాజే కాదని, హిందూ అనేది బ్రిటీషర్లు సృష్టించిన భావన అని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. కొందరు బీజేపీ నేతలు వెట్రిమారన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమిళనాడు బీజేపీ నేత హెచ్.రాజా స్పందిస్తూ.. ‘‘చరిత్ర గురించి వెట్రిమారన్‌కు తెలిసినంత నాకు తెలియదు. కానీ.. అతనికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. రాజరాజచోళన్ రెండు చర్చ్‌లు, మసీదు కట్టించారు. తనను తాను శివపాద శేఖరన్ అని చెప్పుకొనే వారు. అలాంటప్పుడు రాజరాజచోళన్ హిందువు ఎందుకు కాదు..?’’ అని హెచ్.రాజా ప్రశ్నించారు.

Updated Date - 2022-10-06T22:37:25+05:30 IST